Saturday, June 22, 2019

భద్రమే!!

గుప్పెళ్లతో విసిరేసినట్టు
చెల్లాచెదరవుతున్న జ్ఞాపకాలు

నీళ్లింకిపోయిన నదిలా
బీటలువారుతున్న బంధాలు

వాసన వీడుతున్న పువ్వులా
మసకబారుతున్న ఆనందపు ఆనవాళ్లు

ఒక్కొక్కటిగా నేలకొరుగుతున్న పచ్చటి చెట్లల్లా..
కళ్ళవెనుక కరిగిపోతున్న దృశ్యాలు

కృష్ణ పక్షపు చంద్రుడిలా
మస్తిష్కంలో క్షీణిస్తున్న మధురానుభూతులు

మరి..

మనసు మరువగలదా మమతల మాధుర్యం
మంజూషమై భద్రం చేసుకోదా ..!

Thursday, June 20, 2019

ప్చ్..

ఆడవాళ్లు తమ బ్యాగులు, పర్సులతో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

వీధి చివర కిరాణా కొట్టుకి వెళ్ళటానికి ఒక పర్సు, 'సీరియస్' షాపింగ్ కోసం ఒక బాగ్, పార్టీలకి ఇంకో రకం పర్సు, పెళ్ళిళ్ళకి ఒక రకం, టీనేజ్ అమ్మాయిల బ్యాగులు ఒక రకం, ఉద్యోగం చేసేవాళ్లకయితే ఇంకొక రకం బ్యాగులు, ఇంక చంటి పిల్లలున్న తల్లుల బాగ్ ల గురించి అయితే చెప్పక్కర్లేదు పాపం..పాల సీసాలు మొదలుకుని మొత్తం సంసారం బ్యాగులో ఉండక తప్పదు.

ఒక్కోసారి ముఖ్యమైన కాగితాలు, వస్తువులూ ఏ బ్యాగులో, ఏ పర్సులో పెట్టామో మర్చిపోవటం, అన్నింటిలోనూ వెతుక్కోవటం..ప్చ్..ఎన్ని కష్టాలో!  (ఇవన్నీ వెతుకుతుంటే ఒక్కోసారి ఆకస్మిక ధనలాభం  కలిగే ఛాన్స్ కూడా ఉంది)

అదే మగవాళ్లయితే (ఏ వయసు వాళ్ళయినా) హాయిగా ఓ పర్సు జేబులో పడేసుకుంటారు.. అంతే..జాలీ గా, ఖాళీ చేతులు ఊపుకుంటూ తిరుగుతారు.

ప్చ్.. అసలు ఆడవాళ్ళ జీవితాలెప్పుడూ కాంప్లికేటెడ్డే!

Friday, June 14, 2019

శాడిస్ట్ బ్లౌజ్ లు

శాడిస్ట్ బ్లౌజ్ లు, డ్రెస్సులు: ఒకప్పుడు చక్కగా సరిపోయి ఇప్పుడు 'చిన్నగా మారిపోయినవి'.

బీరువా తియ్యగానే ఎంత చూడకూడదనుకున్నా ముందు వాటిమీదకే దృష్టి వెళ్తుంది ఎందుకో. అవేమో వెక్కిరిస్తూ దర్శనమిస్తాయి.

ఒకప్పటి సన్నజాజి తీగ నెమ్మదిగా బీరతీగలా తర్వాత గుమ్మడి తీగలా.. ఇప్పుడేమో అన్నీ కలిపిన ఒకటే కాండంలా రూపాంతరం చెందటం చూసి శాడిస్టిక్ గా నవ్వుతూ ఉంటాయి.

అక్కడికీ చాలావాటిని ఎప్పటికప్పుడు దానం చేసేస్తూ ఉన్నా కొన్నిటిని ఏవో కారణాలతో వదలబుద్ధి కాదు. మళ్లీ ఎప్పటికయినా అవి పెద్దవయి సరిపోకపోతాయా అన్న అత్యాశ !!

మంచి ఫోటోలు

మంచి ఫోటోలు = మనం ఏ ఫోటోల్లో బాగా కనిపిస్తామో అవన్నీ.  మన పక్కన ఉన్నవాళ్లు పాపం ఎలా కనిపించినా పర్లేదు.

Friday, May 10, 2019

#29


పరవళ్ళతో మొదలై
ఉరకలెత్తిన ప్రయాణం
పిల్లపాయలతో నిదానించి
నిండుగా సాగుతున్న వైనం

సుతిమెత్తటి మందలింపులు
ఘాటైన తాలింపులు
ముచ్చట్లు మురిపింపులు
ఎత్తుపల్లాలు నిత్యసత్యాలు

ఒడిలోనే వరదగుడి
ఉన్నదొక్కటే గుండెసడి
ఎద తడి కుమ్మరించుకుని
నిమ్మళించిన హృదయభారాలు

మనసులు విప్పి చెప్పుకోవాలా?
ఒప్పయిన మనసులొక్కటేగా..!
కృతకం కాని శృతిలో సాగే
ఏకీకృతమే కదా అర్ధనారీశ్వరం!!

Saturday, May 4, 2019

కోపాలూ రకాలూ

కోపాల్లో (వ్యక్త పరచటంలో) రకాలు.
దూషించటం
కొట్టడం
చేతిలో ఉన్నవి విసిరేయటం
అక్కడినుంచి వెళ్లిపోటం/మాట్లాడ్డం మానేయటం
వేరేవాళ్ళ మీద చూపించటం
పక్కకెళ్లి తిట్టుకోటం
వేరేవాళ్ళ దగ్గర వ్యక్తపరచటం/తిట్టడం
వేరేవాళ్ళ దగ్గర indirect గా చెడుగా చెప్పటం
లోపల దాచుకుని సమయం వచ్చినప్పుడు దెప్పటం
నిస్సహాయంగా లోపల్లోపల కుమిలిపోవటం
తమని తాము నిందించుకోటం

ఇంకే మన్నా ఉన్నాయా?

Sunday, April 21, 2019

అర్జునా..పార్ధా.. కిరీటీ..

చిన్నపుడు ఉరుముల శబ్దం అంటే చాలా భయపడేదాన్ని..ఎక్కడ నా పక్కనే పిడుగు పడుతుందో అని. ఆ శబ్దానికి నేను దడుచుకున్నప్పుడల్లా మా అమ్మ నా వీపు మీద ఒక్కటిచ్చేది..అదే తట్టేది. అసలు పిడుగు పడటం అంటే భగ భగ మండుతున్న పెద్ద బండరాయి ఆకాశం నుండి పడుతుంది అనుకునేదాన్ని.
కానీ పెద్దదాన్ని అవుతున్నకొద్దీ ఉరుము రహస్యం తెలిసిపోయింది.  ఇప్పుడు నేను చాలా expert అయిపోయాను..ఎంత మెరుపుకి ఎంత ఉరుము వస్తుందో ..ఆ మెరుపుని బట్టి ముందరే గట్టిగా చెవులు మూసుకోటంలో.

(ఇంతకీ నా భయం ఉరుము శబ్దానికా లేక పిడుగు పడుతుందనా..? ఇప్పటికీ అర్ధం కాదు.)