Saturday, June 22, 2019

భద్రమే!!

గుప్పెళ్లతో విసిరేసినట్టు
చెల్లాచెదరవుతున్న జ్ఞాపకాలు

నీళ్లింకిపోయిన నదిలా
బీటలువారుతున్న బంధాలు

వాసన వీడుతున్న పువ్వులా
మసకబారుతున్న ఆనందపు ఆనవాళ్లు

ఒక్కొక్కటిగా నేలకొరుగుతున్న పచ్చటి చెట్లల్లా..
కళ్ళవెనుక కరిగిపోతున్న దృశ్యాలు

కృష్ణ పక్షపు చంద్రుడిలా
మస్తిష్కంలో క్షీణిస్తున్న మధురానుభూతులు

మరి..

మనసు మరువగలదా మమతల మాధుర్యం
మంజూషమై భద్రం చేసుకోదా ..!

Thursday, June 20, 2019

ప్చ్..

ఆడవాళ్లు తమ బ్యాగులు, పర్సులతో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

వీధి చివర కిరాణా కొట్టుకి వెళ్ళటానికి ఒక పర్సు, 'సీరియస్' షాపింగ్ కోసం ఒక బాగ్, పార్టీలకి ఇంకో రకం పర్సు, పెళ్ళిళ్ళకి ఒక రకం, టీనేజ్ అమ్మాయిల బ్యాగులు ఒక రకం, ఉద్యోగం చేసేవాళ్లకయితే ఇంకొక రకం బ్యాగులు, ఇంక చంటి పిల్లలున్న తల్లుల బాగ్ ల గురించి అయితే చెప్పక్కర్లేదు పాపం..పాల సీసాలు మొదలుకుని మొత్తం సంసారం బ్యాగులో ఉండక తప్పదు.

ఒక్కోసారి ముఖ్యమైన కాగితాలు, వస్తువులూ ఏ బ్యాగులో, ఏ పర్సులో పెట్టామో మర్చిపోవటం, అన్నింటిలోనూ వెతుక్కోవటం..ప్చ్..ఎన్ని కష్టాలో!  (ఇవన్నీ వెతుకుతుంటే ఒక్కోసారి ఆకస్మిక ధనలాభం  కలిగే ఛాన్స్ కూడా ఉంది)

అదే మగవాళ్లయితే (ఏ వయసు వాళ్ళయినా) హాయిగా ఓ పర్సు జేబులో పడేసుకుంటారు.. అంతే..జాలీ గా, ఖాళీ చేతులు ఊపుకుంటూ తిరుగుతారు.

ప్చ్.. అసలు ఆడవాళ్ళ జీవితాలెప్పుడూ కాంప్లికేటెడ్డే!

Friday, June 14, 2019

శాడిస్ట్ బ్లౌజ్ లు

శాడిస్ట్ బ్లౌజ్ లు, డ్రెస్సులు: ఒకప్పుడు చక్కగా సరిపోయి ఇప్పుడు 'చిన్నగా మారిపోయినవి'.

బీరువా తియ్యగానే ఎంత చూడకూడదనుకున్నా ముందు వాటిమీదకే దృష్టి వెళ్తుంది ఎందుకో. అవేమో వెక్కిరిస్తూ దర్శనమిస్తాయి.

ఒకప్పటి సన్నజాజి తీగ నెమ్మదిగా బీరతీగలా తర్వాత గుమ్మడి తీగలా.. ఇప్పుడేమో అన్నీ కలిపిన ఒకటే కాండంలా రూపాంతరం చెందటం చూసి శాడిస్టిక్ గా నవ్వుతూ ఉంటాయి.

అక్కడికీ చాలావాటిని ఎప్పటికప్పుడు దానం చేసేస్తూ ఉన్నా కొన్నిటిని ఏవో కారణాలతో వదలబుద్ధి కాదు. మళ్లీ ఎప్పటికయినా అవి పెద్దవయి సరిపోకపోతాయా అన్న అత్యాశ !!

మంచి ఫోటోలు

మంచి ఫోటోలు = మనం ఏ ఫోటోల్లో బాగా కనిపిస్తామో అవన్నీ.  మన పక్కన ఉన్నవాళ్లు పాపం ఎలా కనిపించినా పర్లేదు.