2018 లో మొదటిసారిగా ఎందుకో బతుకమ్మని పెట్టాలనిపించింది. కొన్నేళ్ల నుంచీ హైదరాబాద్ లో ఉంటున్నా ఎప్పుడూ అలా అనిపించలేదు. బహుశా నా చెయ్యి పట్టుకుని, రాబోయే పరిస్థితులకు నన్ను సిద్ధం చెయ్యడానికి వచ్చిందేమో ఆ అమ్మ! అందుకేనేమో హైదరాబాద్ నుంచీ వైజాగ్ కి మారినా నా వెన్నంటే వచ్చింది. కన్నవాళ్ళు దూరమైన దుఃఖం ప్రతి నిమిషం నిశ్శబ్దంగా కడుపులో మెలిపెడుతుంటే, మాటి మాటికీ ఉబికి వచ్చే కన్నీటిని, ఆ వేదనని, శోకాన్ని పంచుకొనే తోబుట్టువయింది బతుకమ్మ. వెళ్లినపని పూర్తి అయినట్టు మళ్ళీ హైదరాబాద్ కి తీసుకొచ్చింది.
అమ్మ దూరమై మూడు నెలలే అవడంతో, ఈసారి బొమ్మలు పెట్టడానికి మనస్కరించలేదు ముందు. కానీ అమ్మకి ఇష్టమైన బొమ్మలకొలువు పెట్టి, కొలువు పెట్టడంలో మెళకువలు నేర్పించిన తనని తలుచుకోవడమే సరైన పని అనిపించింది. నేను బొమ్మలకొలువు పెట్టినప్పుడు, అందరితో కలిసి బతుకమ్మ ఆడేటప్పుడు తన కళ్ళల్లో కనిపించే ఆ తృప్తి, సంతోషాలని తలుచుకోవడం, తన జ్ఞాపకాలని, వేడుకలను కొనసాగించడమే తనకి నేను ఇచ్చే నివాళి!
No comments:
Post a Comment