Saturday, September 15, 2018

ఏమైపోయావు

పొద్దున్న దినపత్రిక తిరగేస్తావు
'ఆ..మామూలు వార్తలే..అక్కడేదో ప్రమాదం, ఇక్కడెవరో చంపుకున్నారు, ఇంకెక్కడో మానభంగం..ఇంతే..ప్చ్..' అనుకుంటావు..పేపర్ పక్కన పడేస్తావు..
మనసు మెత్తదనం కోల్పోయిందా

రోడ్డు మీద వెళ్తూ ఉంటావు..ఎవరో  పడిపోయి వుంటారు,  ఇంకెవరో కొట్టుకుంటూ ఉంటారు, ఆ పక్కనే ఓ తల్లి ఒడిలో పాపాయి
బోసినవ్వులు పూయిస్తూ ఉంటుంది..అన్నీఅలా కళ్ళప్పగించి చూస్తూనే ఉంటావు.
మనసు స్పర్శ ని కోల్పోయిందా..

నీ ఉనికి బయటపెట్టకుండా ముసుగేసుకుని  నీకంటే తెలివయినవాళ్ళు, ఉద్ధరించేవాళ్ళు లేరన్నట్టుగా సాంఘిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా, చేతికొచ్చినట్టు రాతలు రాస్తావు
మూసుకున్న నోటితో గొంతు చించుకొని అరుస్తావు
ఆ ముసుగు తీసి ఇంకో ముసుగుతో బైటికి వస్తావు..
మనసు ఊసరవెల్లి గా మారిందా

వాళ్ళమీదా వీళ్ళమీదా చాడీలు చెప్తూ పైశాచికానందం పొందుతావు..మళ్లీ అందరూ నిన్ను అన్యాయం చేస్తున్నారని ఏడుస్తావు..అవకాశం దొరికితే నువ్వూ అదే పని చేస్తావని చెప్పే అంతరాత్మ గొంతు నొక్కేస్తావు..
మనసు చీకటిరంగు పులుముకుందా

కాలగర్భంలో నిన్ను  సమాధిచేసుకున్నావా
పొరలు పొరలుగా మందంగా పేరుకుపోయి మొద్దుబారిన మనసు గోడలని పగలగొట్టు..నిన్ను నువ్వు బైటకి తెచ్చుకో..మనసుని స్పందించనీ..మళ్ళీ..

Thursday, September 13, 2018

అంతా నువ్వే..

ఎప్పుడూ నాతోనే ఉంటే నా తోడువి అవుతావనుకున్నాను..
నేను నీకు వేడుక అవుతాననుకోలేదు

నీడలా వెన్నంటివుంటే దన్నుగా ఉంటావనుకున్నాను
కన్నెర్ర చేస్తావనుకోలేదు

ఎప్పుడయినా చల్లగా చూడకపోతావా అని
మెల్లిమెల్లిగా కరిగిపోతూఉంటాను

ఏ తప్పూ జరగకుండా
నీనుండీ తప్పించుకుందామనుకున్నా

అక్కరకు రాని నిన్ను
లెక్కచేయకూడదనుకున్నా

నా జీవితంతో ఆడుకోవద్దని
వేడుకుంటూనే ఉన్నాను..

అయినా..
నువ్వేమి చేసినా నాకు నువ్వంటే గౌరవం..

నిన్ను మార్చేయాలి అనుకున్న ప్రతిసారీ
నువ్వే నన్ను నీకు అనుకూలంగా మార్చుకున్నావు

నువ్వే కష్టపెట్టావు..ఆ కష్టాన్ని ఎదుర్కునే
గుండె ధైర్యాన్నీ నాకు నువ్వే ఇచ్చావు

నిన్ను ఎదిరించి గెలిచాను.. నిన్ను ఓడించాను అనుకున్నాను
కానీ..నా గెలుపుకి కారణం కూడా నువ్వే అని తెలుసుకున్నాను

ఊహకు అందని మలుపులతో వింత ఆటలాడే
ఓ విధీ..నీకు వందనం.

Sunday, September 9, 2018

జై కిసాన్

నీ రెక్కలు ముక్కలయినా
నీ డొక్కలు ఎండిపోయినా
నీ కడుపు మండిపోయినా
నీ కళ్లు గండిపడినా
నీ కష్టం కడగండ్లయినా
నీ చెమటను చిందించి
మా కడుపులు నింపావు

నమ్ముకున్న మట్టిని వీడలేక
నువ్వు దున్నిన నీ చేనుకే
రోజువారి కూలీవయావు

నకిలీ విత్తనాలు కల్తీ ఎరువులు
వ్యాపారుల మోసాలు
దళారీల దౌర్జన్యం
తిలా పాపం తలా పిడికెడు
నీ మెడకు ఉరితాడై బిగిశాయి

నీ భూమికి గర్వంగా కాపుకాచుకున్నావానాడు
తట్టనెత్తిన చేతితో
పొట్ట చేతపట్టుకుని
నగరానికి చేరావు..
ఆకాశహర్మ్యాల వాచ్ మాన్ గా మారావు...