Tuesday, October 30, 2018

నిన్ను నువ్వు చేరుకో..


చూస్తుండగానే జారిపోయావు

అగాథంలోకి..నెమ్మది నెమ్మదిగా..

జారిపోతున్నావని తెలిసేలోగానే అట్టడుక్కి చేరిపోయావు..

పట్టుదొరికి మళ్లీ పైకి చేరేదాకా ప్రయత్నిస్తూనే  ఉండు..నేనిక్కడ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను..

ఎందుకో తెలీని ఉరుకులు పరుగులతో

నా ముందు నుంచే పరిగెత్తుకుంటూ

వెళ్లిపోయావు ..ఒక గమ్యం లేకుండా..

ఆయాసమొచ్చి పరుగు ఆపి చూస్కుంటే

ముందూ వెనుక శూన్యమే మిగిలిందని 

తెలుసుకున్నరోజు వెనక్కి రా..

నేనిక్కడే ఉంటాను..నీకోసం ఎదురు చూస్తూ..

మొదలూ చివరా లేని ఒక వలయంలో పడిఅలా తిరుగుతూ నే ఉన్నావు..

ఒక్కోసారి నీ చుట్టూ నువ్వే గిరికీలు కొడుతున్నావు..అయోమయంగా..

ఒక్కసారి వలయం దాటు..

నీ చేయిపట్టి దాటించటానికి నేనిక్కడే  ఉన్నాను..నీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తూ..

నీలోని నన్ను పూర్తిగా మరిచిపోకముందే ..నీకోసం ఎదురుచూసే నీలోని నిన్ను ను మళ్లీ చేరుకో..


Friday, October 26, 2018

Ageing

మనసేమో లావాలా ఉప్పొంగుతూ ఉంటుంది
పికేమో జావలా పలుచనవుతూ ఉంటుంది

Don't worry

Mix them up
Make 'some Kichidi'
Enjoy the ageing

Tuesday, October 23, 2018

అలా..అలా..

చక్కని చుక్కవే..మెరిసే చుక్కవే

అంబరమే నీ అంబరమౌను కదా
నీలాలే నీ నీలాలు కావా

అందాల చందమామ అందాల నీకు
అట్లతద్దినాడు అట్లా అట్లా

తెలుపు.. అతనికి నీ మనసు తెలుపు

రాయి కూడా కరిగేలా నీ ఊసులు  రాయి
చేయి చేయి కలిపి ప్రేమ బాసలు చేయి

నీ అడుగు తో అడుగేస్తాడేమో అడుగు

అలిగితే అలుగు..అవబోకు అలుగు



కలిసినడిచే మీ పాదాలు
సొగసైన తెలుగు పద్యపు పాదాలు

ఎన్నడూ అవకండి  వేరుగా
పెనవేసుకుపొండి ఒక్కటే వేరుగా

Saturday, October 20, 2018

నిన్ను నువ్వే..

అలలపై ఈదాలనీ నువ్వే కోరుకున్నావు
ఇప్పుడు ఒడ్డుకు చేరాలనీ నువ్వే తపిస్తున్నావు

నీ ప్రపంచంలోకి ఎవ్వరినీ అడుగుపెట్టనివ్వలేదు
ఇప్పుడు ఎవరితోనయినా నడవాలనుకుంటున్నావు

ఎవరికీ నీ తలుపులు తెరవలేదు
ఇప్పుడు బార్లా తెరిచిన తలుపులతో బావురుమంటున్నావు

స్వేచ్ఛావాయువుల కోసం ఎగిరిపోయావు
ఊపిరాడనట్టు గా ఆయాసపడుతున్నావు

ఎక్కడా ముడిపడకూడదనుకున్నావు
నీకు నువ్వే చిక్కుముడివయ్యావు

ఎవరికీ సమాధానం చెప్పక్కరలేదనుకున్నావు
నువ్వే ఒక ప్రశ్నలా మిగిలావు

దూరంగా సాగిపోయాననుకున్నావు
నీ మూలాలు నీతోనే వస్తాయని  మరచిపోయావు.

సమయాన్ని మించిపోయాననుకున్నావు
మించిపోయింది సమయమని ఇప్పుడు తెలుసుకున్నావు.






Saturday, September 15, 2018

ఏమైపోయావు

పొద్దున్న దినపత్రిక తిరగేస్తావు
'ఆ..మామూలు వార్తలే..అక్కడేదో ప్రమాదం, ఇక్కడెవరో చంపుకున్నారు, ఇంకెక్కడో మానభంగం..ఇంతే..ప్చ్..' అనుకుంటావు..పేపర్ పక్కన పడేస్తావు..
మనసు మెత్తదనం కోల్పోయిందా

రోడ్డు మీద వెళ్తూ ఉంటావు..ఎవరో  పడిపోయి వుంటారు,  ఇంకెవరో కొట్టుకుంటూ ఉంటారు, ఆ పక్కనే ఓ తల్లి ఒడిలో పాపాయి
బోసినవ్వులు పూయిస్తూ ఉంటుంది..అన్నీఅలా కళ్ళప్పగించి చూస్తూనే ఉంటావు.
మనసు స్పర్శ ని కోల్పోయిందా..

నీ ఉనికి బయటపెట్టకుండా ముసుగేసుకుని  నీకంటే తెలివయినవాళ్ళు, ఉద్ధరించేవాళ్ళు లేరన్నట్టుగా సాంఘిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా, చేతికొచ్చినట్టు రాతలు రాస్తావు
మూసుకున్న నోటితో గొంతు చించుకొని అరుస్తావు
ఆ ముసుగు తీసి ఇంకో ముసుగుతో బైటికి వస్తావు..
మనసు ఊసరవెల్లి గా మారిందా

వాళ్ళమీదా వీళ్ళమీదా చాడీలు చెప్తూ పైశాచికానందం పొందుతావు..మళ్లీ అందరూ నిన్ను అన్యాయం చేస్తున్నారని ఏడుస్తావు..అవకాశం దొరికితే నువ్వూ అదే పని చేస్తావని చెప్పే అంతరాత్మ గొంతు నొక్కేస్తావు..
మనసు చీకటిరంగు పులుముకుందా

కాలగర్భంలో నిన్ను  సమాధిచేసుకున్నావా
పొరలు పొరలుగా మందంగా పేరుకుపోయి మొద్దుబారిన మనసు గోడలని పగలగొట్టు..నిన్ను నువ్వు బైటకి తెచ్చుకో..మనసుని స్పందించనీ..మళ్ళీ..

Thursday, September 13, 2018

అంతా నువ్వే..

ఎప్పుడూ నాతోనే ఉంటే నా తోడువి అవుతావనుకున్నాను..
నేను నీకు వేడుక అవుతాననుకోలేదు

నీడలా వెన్నంటివుంటే దన్నుగా ఉంటావనుకున్నాను
కన్నెర్ర చేస్తావనుకోలేదు

ఎప్పుడయినా చల్లగా చూడకపోతావా అని
మెల్లిమెల్లిగా కరిగిపోతూఉంటాను

ఏ తప్పూ జరగకుండా
నీనుండీ తప్పించుకుందామనుకున్నా

అక్కరకు రాని నిన్ను
లెక్కచేయకూడదనుకున్నా

నా జీవితంతో ఆడుకోవద్దని
వేడుకుంటూనే ఉన్నాను..

అయినా..
నువ్వేమి చేసినా నాకు నువ్వంటే గౌరవం..

నిన్ను మార్చేయాలి అనుకున్న ప్రతిసారీ
నువ్వే నన్ను నీకు అనుకూలంగా మార్చుకున్నావు

నువ్వే కష్టపెట్టావు..ఆ కష్టాన్ని ఎదుర్కునే
గుండె ధైర్యాన్నీ నాకు నువ్వే ఇచ్చావు

నిన్ను ఎదిరించి గెలిచాను.. నిన్ను ఓడించాను అనుకున్నాను
కానీ..నా గెలుపుకి కారణం కూడా నువ్వే అని తెలుసుకున్నాను

ఊహకు అందని మలుపులతో వింత ఆటలాడే
ఓ విధీ..నీకు వందనం.

Sunday, September 9, 2018

జై కిసాన్

నీ రెక్కలు ముక్కలయినా
నీ డొక్కలు ఎండిపోయినా
నీ కడుపు మండిపోయినా
నీ కళ్లు గండిపడినా
నీ కష్టం కడగండ్లయినా
నీ చెమటను చిందించి
మా కడుపులు నింపావు

నమ్ముకున్న మట్టిని వీడలేక
నువ్వు దున్నిన నీ చేనుకే
రోజువారి కూలీవయావు

నకిలీ విత్తనాలు కల్తీ ఎరువులు
వ్యాపారుల మోసాలు
దళారీల దౌర్జన్యం
తిలా పాపం తలా పిడికెడు
నీ మెడకు ఉరితాడై బిగిశాయి

నీ భూమికి గర్వంగా కాపుకాచుకున్నావానాడు
తట్టనెత్తిన చేతితో
పొట్ట చేతపట్టుకుని
నగరానికి చేరావు..
ఆకాశహర్మ్యాల వాచ్ మాన్ గా మారావు...

Friday, August 10, 2018

తెలుగే...

ఏ భాషకైనా వెళ్లు
కానీ..తెలుగుకే మళ్ళు.

ఎక్కడయినా నివసించు..
కానీ..
తెలుగులోనే శ్వాసించు

బతుకు తెరువుకై ఎంచుకున్న భాష ఏదైనా
బతుకు అర్ధాన్ని తెలిపేది నీ తెలుగు భాష.

Tuesday, July 31, 2018

ఒక్కసారి..

పొగ చూరిన మనసుని తెరిచి చూడు
మసిపట్టిన ఆశలని తుడిచి చూడు
ఎండి చారికలయిన కోరికలని కడిగిచూడు
కరడుగట్టిన భావాలను కరిగించి చూడు
మూగవోయిన మమతని మాటాడించి చూడు
మోడుగా మారిన మేనిని తడిపి చూడు
బూజుపట్టిన బుద్ధిని దులిపి చూడు
నిట్టూర్పులయిన శ్వాసకి ఊపిరి పోసి చూడు
నిరాశతో మసకేసిన ఆశయాన్ని తరచి చూడు
నిర్వేద నీరద యవనికని తొలగించి చూడు
పూర్ణ చంద్రిక నీదేగా....నిండు జీవితం నీదేగా..

Friday, July 27, 2018


 మల్లెల నుంచీ మంకెన్నలయ్యాయి
..నా కళ్ళు
నీ కోసం చూసి చూసి

Wednesday, July 25, 2018

కఠినమైన పరిస్థితులకి రాయిలా ఎదురొడ్డు
కానీ..
పువ్వులాంటి హృదయంలో మృదుత్వాన్ని వీడనివ్వకు..
మనసు లోని చెమ్మని ఆరనివ్వకు.


Thursday, June 21, 2018

జూన్ నెల తెలుగు వెలుగు మాసపత్రికలో అచ్చయిన నా కవిత 😊

Tuesday, May 15, 2018

ఒకదాని వెంట ఒకటి పరిగెడుతూనే ఉంటాయి..

గుండ్రంగా తిరుగుతూ మొదలయిన చోటికే వస్తాయి..

ఈ మూల నుంచీ ఆ మూలకి సాగుతూ ఉంటాయి

గజిబిజిగా అల్లుకుంటాయి..చిక్కుపడుతూ ఉంటాయి

తికమక పెడతాయి..ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

ఒక దాంట్లోంచి ఒకటిగా వస్తూనే ఉంటాయి

ఒక దగ్గర మొదలయ్యి ఇంకెక్కడికో చేరుతాయి

ఒక రకం గా మొదలయ్యి వేరే రకంగా మారతాయి

ఒక్కోసారి ముంచేస్తూ ఉంటాయి..తేలేలా కూడా చేస్తాయి

ఒక్కోసారి గంతులు వేయిస్తాయి.. ఒక్కోసారి భారం గా అనిపిస్తాయి

వాఘీర లా దూకుతాయి..నిండు గోదారిలా నిదానం గా ప్రవహిస్తాయి

వయసుని బట్టి రూపాంతరం చెందుతాయి

వేడెక్కిస్తాయి.. శీతల పవనాలవుతాయి

స్థిరత్వం లేకుండా నిరంతరం చలిస్తూనే ఉంటాయి

మన మస్తిష్కాన్ని ఎప్పుడూ చేతనలో ఉండేలా చేస్తాయి...

ఆలోచనలు...

Saturday, May 5, 2018

Rangasthalam...
Is like any formula movie except that rustic look...
...
...

అని అనను...

చాలా హైప్ చేశారు...
..
..
అని కూడా అనను..

80' ల్లో అబ్బాయిలు అంతంత గడ్డం పెంచేవారని గుర్తులేదే..

కానీ బాగానే  'కవర్'  అయింది.

ఏదయినా మొత్తానికి హిట్ చేసేశాం.. కదా...

PS: 'RamaLakshmi' is so cute..😋

Sunday, April 29, 2018

ముఖ్యమంత్రి కొడుకుగా ముఖ్యమంత్రి అయ్యే 'హక్కు' ఉందా..?! మన రాజ్యాంగం లో ?  🤔
బహుశా 'ఆయనకి' అందుకే తెగ నచ్చేసి ఉంటుంది సినిమా..

నిన్నటితరం లో వాంప్  (పాపం) హుందా పాత్రలో (చిన్నదే అయినా) హుందాగా ఉంది.

'నీతో పాటూ ఇంట్లోనే ఉంటా..నీతోపాటూ ఒడియాలు పెట్టుకుంటూ'  దేముడా... ఈ మైండ్సెట్ మారదా..

ఎన్ని మంచి పనులు చేసినా చేసిన చిన్న తప్పుని (?) అందరూ 'భూతద్దం' లో చూస్టారని చెప్పటం symbolic గా బాగుంది.

8 నెలల 13 రోజులు పదవిలో ఉంటే అన్నీ అలా(చిటికె వేస్తూ) చేసేయచ్చు....ఫౌల్ language కూడా  మాట్లాడేయచ్చు..

మొత్తానికి 'ఫెయిరీ టేల్' బాగుంది. ఇంకో వెరైటీ రోల్ easy గా చేసేశారు..ఎంతయినా ఫ్యాన్ ని కదా..

ఇంతకీ ఆయనకి వయసు పెరగదా అసలు ఎప్పటికీ..😱

Sunday, April 22, 2018

దూరమైన స్నేహితులు

మొన్నో రోజు బాల్కనీ లో పూల కుండీలు సద్దుతుంటే ఓ కుండీ కింద నుంచి  జర్రి జర జరా పాక్కుo టూ ఇంకో కుండీ కిందకి వెళ్ళిపోయింది.
దాన్ని చూడగానే చిన్నప్పటి మా పెరటి లోకి వెళ్లినట్టనిపించి ఇంకా అలాంటి స్నేహితులందరూ గుర్తొచ్చారు.
ఆకుల్లో కలిసిపోయే గొల్లభామలు, సాయంత్రం అయేసరికి ఎగురుతూ వచ్చే తూనీగలు, ఝంమ్మనే తుమ్మెదలు, వర్షాకాలం వచ్చిందంటే ప్రత్యక్షమయ్యే రోకలిబండలు, గాజు పురుగులు, గొంగళీలు.,(వీటిని చూస్తే కంపరంగా అనిపించేది అప్పుడు..కానీ పాపం అవి హర్మ్లెస్స్ ) గొంగళిపురుగులు గోడల మీద గూళ్ళు కట్టటం..కొన్ని రోజుల తర్వాత చూస్తే అందులో ఏమీ వుండకపోటం, అప్పుడప్పుడూ వచ్చి దడిపించే తేళ్లు, జర్రులు..ఒకోసారి చిన్నా పెద్దా పాములు, వాటిని చూసి పారిపోటం.. మళ్లీ ఆసక్తిగా తొంగితొంగి చూడటం.. నవ్వొస్తుంది తలుచుకుంటే. ఇంకా నలికిల పాములు అని వచ్చేవి, రంగుల బల్లుల్లా ఉండేవి. తొండలు, ఉడుతలు మామూలే. ఉడుతలని observe చేయటం బాగుండేది.
నవంబర్ /డిసెంబర్ వచ్చిందంటే పూసే రంగురంగుల డిసెంబర్ పూలు, ముళ్లగోరింట, బంతులు, చామంతులు, ఎప్పుడూ పూసే మందారాలు, గులాబీలు,  కాశీరత్నం, మధ్యాహ్నమంకెన్నలు ..తోట అంతా రంగురంగుల నక్షత్రాలు పరిచినట్టుండేది..వాటి కోసం వచ్చే చిన్నా పెద్దా వన్నెవన్నెల సీతా కోక చిలుకలు..ఎగిరే నక్షత్రాల్లా..
చూరుకి కట్టిన వడ్ల కంకుల కోసం వచ్చిపోయే పిచ్చుకలు, జెముడు పక్షులు, గోరింకలు, జామకాయలని కొట్టేసే రామ చిలుకలు..ఇలా ఇంకా బోల్డంతమంది నేస్తాలు.
ఫ్లాట్స్ లోకి వచ్చి నేలకు దూరమై ఈ స్నేహితులందరికీ కూడా దూరమైపోయాం. నగరాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి వీటిల్లో కొన్నిటి పేర్లు కూడా తెలీదు పాపం.
ఇంతకీ బాల్కనీ లోకి వచ్చిన జర్రి మళ్లీ కనిపించలేదు..వీళ్ళందర్నీ గుర్తు చేయటానికి వచ్చిందేమో..

Emotional dependency - sharing emotions.

Sharing emotions is different from emotional dependency.

Emotional dependency లో ఒకరి మీద ఆధార పడటం వలన పోను పోను ఆ బంధం (అది ఎలాంటి బంధమయినా కావచ్చు) అవతలి వాళ్లకి విసుగ్గా, ఊపిరి ఆడనట్టుగా అనిపించి బంధం బలహీనపడే అవకాశం ఉంది. అలా ఆధార పడిన వాళ్ళు ఒకోసారి childish గా, impulsive గా, అప్పుడప్పుడూ possessive గా కూడా తయారవచ్చు. తన భావాలకు అవతలి వాళ్ళు తప్పనిసరిగా (చాలావరకు తమకు అనుకూలంగా మాత్రమే) స్పందించాలన్న expectation  ఉంటుంది. లేకపోతే వాళ్ళమీద కోపం, తమ మీద తమకు జాలి మొదలవుతాయి. అవతలి వాళ్ళ పరిస్థితి వీళ్లకు అవసరం ఉండదు, అర్ధం చేస్కోరు ఒక్కోసారి. దానివలన వీళ్ళ నుంచి తప్పించుకోటానికి చూస్తూ వుంటారు రెండోవాళ్ళు నెమ్మదిగా..వీళ్ళ మీద చులకన భావం కూడా ఏర్పడవచ్చు.

Wehereas ఎమోషన్స్ ని పంచుకోటం అనేది పూర్తిగా డిఫరెంట్ థింగ్. ఇందులో compulsions , expectations ఉండవు చాలా వరకు. Mutual respect ఉంటుంది. తమ ఎమోషన్స్ ని accept చేయాలి.. బలపరచాలి అని ఆశించటం ఉండదు. దానివలన అవతలి వాళ్లకి suffocating గా అనిపించదు. విషయాలు పంచుకోటానికి ఇలాంటి వాళ్ళతో hesitation ఉండదు. ఫ్రీ గా అనిపిస్తుంది. సాధారణంగా వీళ్ళు judge చేయరు.
ఏమయినా..మొత్తానికి రెండు రకాల్లోనూ ఆ ఇద్దరి లేదా ఆ కొంతమంది involvement తప్పనిసరిగా ఉంటుంది.. ..ఎమోషనల్గా ఆధారపడటానికి అయినా, ఎమోషన్స్ పంచుకోటానికి అయినా.  ఆఖరికి ఎమోషన్స్ ఎవరికీ పంచుకోకపోయినా ఇంకొకళ్ల ప్రభావం ఉంటుంది. అసలు ఎమోషన్ అనేది వేరొకరి ప్రమేయం, ప్రభావం లేకుండా వచ్చేది కాదు. ఆఖరికి అన్నీ వదిలేసి తపస్సు చేసుకునే ఋషులకి కూడా భగవంతుడితో ఎమోషన్ ఉంటుంది కదా..అలాంటిది మనం మామూలు మనుషులం..సంఘ జీవులం...షేరింగ్ ఎమోషన్స్ is not a bad thing after all.

Monday, April 9, 2018

Freedom is...

Conquering your fears.
Not bothering anymore about the issues bothering you.
Accept those problems which have no solutions and facing the reality.

Tuesday, March 6, 2018

నీకు అందంగా కనపడాలి అనుకుంటాను
తయారవ్వటానికి అద్దం ముందుకొస్తాను
అద్దంలో నన్ను నేను చూసుకుంటాను
ప్రత్యేకంగా అలంకరించుకునే అవసరం కనిపించదు..అదేమిటో..
నీ తలపులే నా అలంకారాలు...కదా మరి!!

Monday, March 5, 2018

మన మనసులు అద్వైతం
మన బంధం అద్వితీయం.

నీ ఊసులే నా ప్రేరణ
నీ ఊపిరే నా ప్రాణాధారం

మమతను పంచే నీ చెంత
చింతలేదు నా జీవితమంతా

మకరంద మొలికే నీ హృదయానికి
కదంబ మాలనై అల్లుకుపోనీ

ఎప్పటికీ..

Tuesday, February 27, 2018

Be positive..always..😛

Last year..
Bought a dress..double  my size..
Thought that it would shrink after washing..
But..It didn't..to my disappointment..
Threw it in the wardrobe in frustration..
Today found it in the excavation..
Whoa.. now It fitted pretty well..
I thank God..
It didn't go waste after all..

Monday, February 5, 2018

వేళ్ళు..

భూమి నుంచి పుట్టిన చిన్న మొలక..
సుకుమారంగా,లేతగా ఉన్న మొక్కకి వాడి పోకుండా, పడి పోకుండా దన్నుగా నిలిచే వేళ్ళు.
చిట్టి మొక్క ఒకటొక్కటిగా మారాకులు వేస్తూ..నెమ్మదిగా పైకి ఎదుగుతూ..
తన చుట్టూ ప్రపంచాన్ని వింతగా, ఆసక్తిగా , ఉత్త్సాహం తో గమనిస్తూ, కొత్త కొమ్మలు తొడుగుతూ..
భూమి నుంచి పై పై కి ఎదుగుతూ..
తన నుంచి పుట్టిన మొక్క పెద్ద చెట్టు,వృక్షం గా మారటానికి ఇంకా శక్తి ని అందించే వేళ్ళు..ఆ శక్తిని అందిస్తూనే ఉంటాయి.
తాము శ్రద్ధగా, ప్రేమగా అందించిన పోషణతో బలంగా ఎంతో ఎత్తుకి ఎదిగి, కొమ్మలూ రెమ్మలూ కొత్త చిగుళ్లు వేస్తూ, తమకంటే ఎత్తులో ఉన్న చెట్టుని చూసి వేళ్ళు సంతోషిస్తాయి..గర్వపడతాయి.
‎చెట్టు భూమినుంచి దూరం అయినట్టు కనిపిస్తుంది..అంతే.....
‎కాని చెట్టు ఎంత పైకి వెళ్తుంటే అంత  దృఢమయిన బంధాన్ని వేళ్ళతో కలిగివుంటుంది..
‎బంధం లోలోనికి వేళ్లూనుతూనే ఉంటుంది.
బలపడుతూనే ఉంటుంది.

(పిల్లలు దూరం గా వెళ్ళటాన్ని సానుకూల దృక్పధం తో రాశాను. ఇది ఒక కోణం మాత్రమే. అందరూ ఏకీభవించాలని లేదు)

Monday, January 29, 2018

ప్రేమ

చూపుతో మొదలవుతుంది

మాటతో ముడిపడుతుంది

స్పర్శతో జతకడుతుంది

మనసుతో ఏకమౌతుంది

...ప్రేమ..