Saturday, November 18, 2023

ఆశంసన

ఆశంసన


ఘనీభవించిన మదిని మీటితే

రాగాంగములు పలికించనా

వ్యోమధునినై ఉరకలెత్తనా

రతనపువిల్లునై రంజిల్లనా

నీ వాకిట వర్ణకారికమవ్వనా



ఆ కోరిక

ఆ కోరిక...
సూర్యుడిలా వేడెక్కిస్తుంది..
చెమటలు పట్టి అలసిపోయినా
మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది..
ఎంత చేసినా దృష్టి మళ్లీ దానిమీదకే పోతుంది
మనసు నిలువనీయదు..
...
...
...
...
...
...

Shopping



Sunday, November 5, 2023

గొబ్బెమ్మలు - గొబ్బి పాటలు

ధనుర్మాసం లో నెలంతా చిట్టి ప్రాయపు, పడుచు ప్రాయపు కన్నె పిల్లలందరూ పాటించే సంప్రదాయం, వేడుక.  

ఆవుపేడని చిన్న చిన్న బంతుల్లా చేసి, వాటి పైన ముగ్గు, పసుపు, కుంకుమ, పువ్వులతో అందంగా అలంకరిస్తారు.  వాటినే గొబ్బెమ్మలు అంటారు. తల్లి గొబ్బెమ్మ కొంచెం పెద్దదిగా, దాని పక్కనే కొంచెం చిన్నదిగా పిల్ల గొబ్బెమ్మ , మిగతా గొబ్బెమ్మలన్నీ  ఒకే సైజులో చేస్తారు.  చక్కగా అలంకరించిన ఈ గొబ్బెమ్మలన్నింటినీ నెలగంటు పట్టిన దగ్గరనుంచీ ప్రతిరోజూ వేకువ ఝామునే వేసే ముగ్గులో  అందంగా అమర్చుతారు.  మధ్యలో తల్లి గొబ్బెమ్మ, పక్కనేపిల్ల గొబ్బెమ్మ, వాటి చుట్టూ మిగతా అన్ని గొబ్బెమ్మలనూ పేర్చుతారు.  సంక్రాంతి పండుగ వరకూ రోజూ ఇంటి ముంగిట ముగ్గూ, ఆ ముగ్గులో ముచ్చటైన గొబ్బెమ్మలతో వాకిలి కళకళలాడుతూ ఉంటుంది. 

సందె గొబ్బెమ్మ:

ఆడపిల్లలు ఒక్కొక్కరూ ఒక్కోరోజు తమ ఇంట్లో 'సందె గొబ్బెమ్మ' పేరంటం చేస్తారు.  సందె గొబ్బెమ్మ పేరంటం సాయంత్రాలు చేస్తారు.  సందె గొబ్బెమ్మ పేరంటం  చిట్టి పొట్టి ఆడపిల్లలూ, పడుచు కన్నెలతో  జరుగుతుంది.  ఇంటి వాకిలి ముందు సాయంత్రం  చిన్న పీట మీద కృష్ణుడి బొమ్మ లేదా పటం పెట్టి, దాని ముందు తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ, వాటి చుట్టూ నాలుగు  గొబ్బెమ్మలు పెట్టి, పసుపు కుంకుమలు పూలతో అర్చించి నైవేద్యం పెడతారు.  తరువాత అమ్మాయిలందరూ సరదాగా ఒకరికొకరు చేతులు తడుతూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడుతూ  వేడుక చేస్తారు. ఈ వేడుకని గొబ్బి తట్టడం అంటారు. 

గొబ్బి పిడకలు:

ప్రతిరోజూ పొద్దున్న పెట్టిన గొబ్బెమ్మలన్నింటినీ సాయంత్రయానికి తీసి గోడకి పిడకలుగా కొడతారు.  మాఘ మాసంలో వచ్చే రధసప్తమి కి ఆ గొబ్బి పిడకలన్నీ శుభ్రంగా ఎండిపోయి ఉంటాయి.  ఆ పిడకలతో దాలి చేసి దానిమీద సూర్యనారాయణ మూర్తి కి సమర్పించే పరమాన్నం వండుతారు.  దాలి మీద వండిన ఆ పాయసం రుచే వేరు!  

గొబ్బి పాటలు:

గొబ్బి పాటలు ప్రధానంగా కృష్ణుడి మీదే ఉంటాయి. నాకు కొద్దిగా గుర్తున్నవి నాలుగు పాటలే.  

1
గొబ్బీయళ్ళో గొబ్బీయళ్ళో

దుక్కీ దుక్కీ దున్నారంటా 
ఏమి దుక్కీ దున్నారంటా
రాజావారి తోటలో జామ దుక్కీ దున్నారంటా
ఔనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలాగిరీ గొబ్బిళ్ళో

గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో

విత్తూ విత్తూ నాటారంటా 
ఏమి విత్తూ నాటారంటా
రాజావారి తోటలో జామ విత్తూ నాటారంటా
ఔనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలగిరీ గొబ్బిళ్ళో

గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో

మొక్కా మొక్కా మొలిచిందంటా 
ఏమి మొక్కా మొలిచిందంటా
రాజావారి తోటలో జామామొక్కా మొలిచిందంటా
ఔనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలగిరీ గొబ్బిళ్ళో

గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో

పువ్వూ పువ్వూ పూసిందంటా
ఏమి పువ్వూ పూసిందంటా
రాజావారి తోటలో జామాపువ్వూ పూసిందంటా
ఔనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలగిరీ గొబ్బిళ్ళో

గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో

పిందే పిందే వేసిందంట 
ఏమి పిందే వేసిందంట
రాజావారి తోటలో జామ పిందే వేసిందంట
ఔనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలగిరీ గొబ్బిళ్ళో

గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో

కాయా కాయా కాసిందంటా 
ఏమి కాయా కాసిందంటా 
రాజావారి తోటలో జామాకాయా కాసిందంటా
ఔనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలగిరీ గొబ్బిళ్ళో

గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో

పండూ పండూ పండిందంటా
ఏమీ పండూ పండిందంటా
రాజావారి తోటలో జామపండూ పండిందంటా
ఔనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలగిరీ గొబ్బిళ్ళో

గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో
(ఈ పాటలో దుక్కి దున్నటం.. విత్తనం నాటడం..ఇలా ఒక చెట్టు పండు ఇచ్చే క్రమాన్ని చిన్న పిల్లలకు అర్ధమయ్యేలాగా ఎంత బాగా చెప్పారో కదా!)

2.
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనూ
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనూ

ఉట్టి మీద పాలుపెరుగు ఎట్లు దించెనూ
కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడూ

చీరలన్ని మూటకట్టి చిన్ని కృష్ణుడూ
పొన్నచెట్టు మీద పెట్టి పంతమాడెనూ

కాళింది మడుగులోన దూకినాడమ్మా
బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా

ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనూ
(కృష్ణ లీలలు వర్ణించే ఈ పాట ఇంతవరకే గుర్తుంది)

3. 
సుబ్బీ గొబ్బెమ్మా శుభమూలివ్వావే
తామర పువ్వంటీ తమ్ముణ్ణివ్వావే
చామంతి పువ్వంటీ చెల్లెల్నివ్వావే
మొగలీపువ్వంటీ మొగుణ్ణివ్వావే
(ఈ పాట ఆఖరి లైన్ పాడేటప్పుడు అందరం కిసుక్కు మని నవ్వుకుంటూ, సిగ్గుతో మెలికలు తిరిగిపోయేవాళ్ళం..ఎంతటి అమాయకత్వమో!)

4.
గొబ్బీయళ్ళో సఖియా వినవే 
చిన్నీ కృష్ణుని సోదరి కనవే
కృష్ణుని చరితము వినవే

గొబ్బీయళ్ళో చందామామ 
చందామామకు పిల్లాలెందరు
నీలగిరి కన్నెలు

గొబ్బీయళ్ళో నీలగిరి కన్నెలకు
నిత్యా మల్లే తోటా

గొబ్బీయళ్ళో నిత్యామల్లె తోటలో
నిమ్మల్ల బావి

గొబ్బీయళ్ళో నిమ్మల్లా బావికి
గిలకల్ల తాడు

గొబ్బీయళ్ళో గిలకల్లా తాడుకు
బుడ్డీ రాగి చెంబూ

గొబ్బీయళ్ళో బుడ్డీ రాగి చెంబును
బుడుగు బుడుగు ముంచంగా

గొబ్బీయళ్ళో బుడుగు బుడుగు ముంచంగానూ 
వచ్చీనవీ పాలు

గొబ్బీయళ్ళో పాలల్లోనా ఉన్నదీ
పగడాల చేరు

గొబ్బీయళ్ళో పగడాలా చేరును
అత్తవారికిచ్చే

గొబ్బీయళ్ళో అత్తావారు పెట్టినారూ
అళ్లమళ్ళా చీరా

గొబ్బీయళ్ళో అళ్లమళ్ళా చీరకు
చిలకల్ల రవికె

గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో
(ఈ పాట కొంచమే గుర్తుంది నాకు..మిగతాది అమ్మ రాసుకున్న పాటల్లో ఉంటే చూసి రాశాను.)