Tuesday, January 3, 2012

జీవితం ఒలికిపోయింది

పొగమంచులా నెమ్మదిగా కమ్ముకున్న దూరం..
ఎప్పటికీ కరగని, దేనితోనూ పగలని మంచుగోడగా మిగిలింది..

నివురుకప్పిన నిప్పులా మనసులో ఉప్పొంగుతున్న లావా..

ఎంత తడిపినా చిగురించని తోట..రాలిపోతున్న ఎండుటాకుల్లాంటి ఆశలు..

అందమయిన చిత్రం వేద్దామనుకున్న కాగితం మీద ఒలికి పోయిన రంగులు..
అంతా రంగులమయమే..కానీ భావం లేని బొమ్మ మిగిలింది..జీవితం ఒలికిపోయింది..

చీకటిలో దీపం కోసం తడుములాట..అసలు దీపం వుంటే వెతుకులాటేందుకు..

దాహం కోసం వెళ్తే ఎండమావి మిగిల్చిన కన్నీళ్లు..

అందమయిన కొలను అనుకుంటే..బురద నిండిన ఊబి..
లోపలకు కూరుకుపోతూ కూడా నీటి కోసం అన్వేషణ..

పొదరిల్లుగా భ్రమపడిన సాలెగూడు..బయటకు రాలేక కృశించి..అందులోనే నశించి..

అలసిపోయి ఆగిన ప్రయాణం..ఏదో చల్లటి స్పర్శ..అనిర్వచనీయం ఆ స్వాంతన..

ఏదో అర్ధమయిన భావన..దైవ నామ స్మరణ..

నీడలా వెన్నంటి వచ్చేది..అదే ప్రేరణ..అదే స్వాంతన,.అదే పరమార్ధం..అదే నిత్య సత్యం..

Monday, September 12, 2011

నువ్వుంటే..

నువ్వుంటే బాధలన్నీ మరచిపోతాను..

నువ్వు పెట్టిన బాధ కూడా....

Wednesday, February 23, 2011

Sunday, January 2, 2011

అవసరాల కోసం అనుబంధాలా?
ప్రాధాన్యతని బట్టి మారే ఆత్మీయతల సమీకరణాలు.

Saturday, January 1, 2011

జ్ఞాపకాలు

వసంత కోయిల పంచమ స్వరంలా వినిపించే జ్ఞాపకాలు
గ్రీష్మం లా మండే జ్ఞాపకాలు
మనసును తడిపే చిరుజల్లుల జ్ఞాపకాలు
శరత్ వెన్నెల లా తెల్లని, చల్లని జ్ఞాపకాలు
హేమంతపు చలిలో వెచ్చటి దుప్పటిలా హత్తుకునే జ్ఞాపకాలు
కొత్త ఆశల చిగుళ్ళకు చోటు ఇస్తూ
జ్ఞాపకాలుగా మారిపోయి ..రాలిపోయే అనుభవాలు.

Saturday, September 19, 2009

తీరం లేని సముద్రం

దూరం గా వుంటే దూరం గా వున్నావనే బాధ
దగ్గరకొస్తే మళ్ళీ దూరమయిపోతావనే భయం
మాట్లాడకపోతే మాట్లాడలేదనే దిగులు
మాట్లాడితే మాటలు అయిపోతాయేమోననే బెంగ
మాటలెందుకు ...మనసే మోహనరాగం అంటావా..?
కనురెప్ప మూద్దామంటే నీ రూపం కనుమరుగవుతుందేమో
తెరుద్దామంటే రెప్పల మాటు నుంచీ జారిపోతావేమో
కంటిపాపవే నువ్వు అయినప్పుడు..రెప్పలతో పనేముంది అంటావా..?
కలలో అయినా చూద్దామంటే
కల కరిగిపోయి ...కలగానే మిగిలిపోతావేమో ..
కలలూ...కల్లలూ ఎందుకు..మనసుతోనే చూడు ..అంటావా ?
కల్లోల సముద్రం లో గడ్డిపరక లాంటి ఆశని పట్టుకుని
లేని తీరం కోసం ..గమ్యం లేని ప్రయాణం.

Monday, September 7, 2009

రాలిన ఆశ

వేసవి మల్లె వాడిపోయింది
వానకారు మబ్బు నీరయింది
శరత్ చంద్రిక మసకేసింది
హేమంత తుషారం ఆవిరయ్యింది
వసంత కోయిల మూగపోయింది
శిశిరమే నీ తోడయ్యింది.