Tuesday, October 30, 2018

నిన్ను నువ్వు చేరుకో..


చూస్తుండగానే జారిపోయావు

అగాథంలోకి..నెమ్మది నెమ్మదిగా..

జారిపోతున్నావని తెలిసేలోగానే అట్టడుక్కి చేరిపోయావు..

పట్టుదొరికి మళ్లీ పైకి చేరేదాకా ప్రయత్నిస్తూనే  ఉండు..నేనిక్కడ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను..

ఎందుకో తెలీని ఉరుకులు పరుగులతో

నా ముందు నుంచే పరిగెత్తుకుంటూ

వెళ్లిపోయావు ..ఒక గమ్యం లేకుండా..

ఆయాసమొచ్చి పరుగు ఆపి చూస్కుంటే

ముందూ వెనుక శూన్యమే మిగిలిందని 

తెలుసుకున్నరోజు వెనక్కి రా..

నేనిక్కడే ఉంటాను..నీకోసం ఎదురు చూస్తూ..

మొదలూ చివరా లేని ఒక వలయంలో పడిఅలా తిరుగుతూ నే ఉన్నావు..

ఒక్కోసారి నీ చుట్టూ నువ్వే గిరికీలు కొడుతున్నావు..అయోమయంగా..

ఒక్కసారి వలయం దాటు..

నీ చేయిపట్టి దాటించటానికి నేనిక్కడే  ఉన్నాను..నీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తూ..

నీలోని నన్ను పూర్తిగా మరిచిపోకముందే ..నీకోసం ఎదురుచూసే నీలోని నిన్ను ను మళ్లీ చేరుకో..


No comments: