అలలపై ఈదాలనీ నువ్వే కోరుకున్నావు
ఇప్పుడు ఒడ్డుకు చేరాలనీ నువ్వే తపిస్తున్నావు
నీ ప్రపంచంలోకి ఎవ్వరినీ అడుగుపెట్టనివ్వలేదు
ఇప్పుడు ఎవరితోనయినా నడవాలనుకుంటున్నావు
ఎవరికీ నీ తలుపులు తెరవలేదు
ఇప్పుడు బార్లా తెరిచిన తలుపులతో బావురుమంటున్నావు
స్వేచ్ఛావాయువుల కోసం ఎగిరిపోయావు
ఊపిరాడనట్టు గా ఆయాసపడుతున్నావు
ఎక్కడా ముడిపడకూడదనుకున్నావు
నీకు నువ్వే చిక్కుముడివయ్యావు
ఎవరికీ సమాధానం చెప్పక్కరలేదనుకున్నావు
నువ్వే ఒక ప్రశ్నలా మిగిలావు
దూరంగా సాగిపోయాననుకున్నావు
నీ మూలాలు నీతోనే వస్తాయని మరచిపోయావు.
సమయాన్ని మించిపోయాననుకున్నావు
మించిపోయింది సమయమని ఇప్పుడు తెలుసుకున్నావు.
No comments:
Post a Comment