Tuesday, October 30, 2018

నిన్ను నువ్వు చేరుకో..


చూస్తుండగానే జారిపోయావు

అగాథంలోకి..నెమ్మది నెమ్మదిగా..

జారిపోతున్నావని తెలిసేలోగానే అట్టడుక్కి చేరిపోయావు..

పట్టుదొరికి మళ్లీ పైకి చేరేదాకా ప్రయత్నిస్తూనే  ఉండు..నేనిక్కడ నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను..

ఎందుకో తెలీని ఉరుకులు పరుగులతో

నా ముందు నుంచే పరిగెత్తుకుంటూ

వెళ్లిపోయావు ..ఒక గమ్యం లేకుండా..

ఆయాసమొచ్చి పరుగు ఆపి చూస్కుంటే

ముందూ వెనుక శూన్యమే మిగిలిందని 

తెలుసుకున్నరోజు వెనక్కి రా..

నేనిక్కడే ఉంటాను..నీకోసం ఎదురు చూస్తూ..

మొదలూ చివరా లేని ఒక వలయంలో పడిఅలా తిరుగుతూ నే ఉన్నావు..

ఒక్కోసారి నీ చుట్టూ నువ్వే గిరికీలు కొడుతున్నావు..అయోమయంగా..

ఒక్కసారి వలయం దాటు..

నీ చేయిపట్టి దాటించటానికి నేనిక్కడే  ఉన్నాను..నీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తూ..

నీలోని నన్ను పూర్తిగా మరిచిపోకముందే ..నీకోసం ఎదురుచూసే నీలోని నిన్ను ను మళ్లీ చేరుకో..


Friday, October 26, 2018

Ageing

మనసేమో లావాలా ఉప్పొంగుతూ ఉంటుంది
పికేమో జావలా పలుచనవుతూ ఉంటుంది

Don't worry

Mix them up
Make 'some Kichidi'
Enjoy the ageing

Wednesday, October 24, 2018

అలా..అలా..

చక్కని చుక్కవే..మెరిసే చుక్కవే

అంబరమే నీ అంబరమౌను కదా
నీలాలే నీ నీలాలు కావా

అందాల చందమామ అందాల నీకు
అట్లతద్దినాడు అట్లా అట్లా

తెలుపు.. అతనికి నీ మనసు తెలుపు

రాయి కూడా కరిగేలా నీ ఊసులు  రాయి
చేయి చేయి కలిపి ప్రేమ బాసలు చేయి

నీ అడుగు తో అడుగేస్తాడేమో అడుగు

అలిగితే అలుగు..అవబోకు అలుగు



కలిసినడిచే మీ పాదాలు
సొగసైన తెలుగు పద్యపు పాదాలు

ఎన్నడూ అవకండి  వేరుగా
పెనవేసుకుపొండి ఒక్కటే వేరుగా

Saturday, October 20, 2018

నిన్ను నువ్వే..

అలలపై ఈదాలనీ నువ్వే కోరుకున్నావు
ఇప్పుడు ఒడ్డుకు చేరాలనీ నువ్వే తపిస్తున్నావు

నీ ప్రపంచంలోకి ఎవ్వరినీ అడుగుపెట్టనివ్వలేదు
ఇప్పుడు ఎవరితోనయినా నడవాలనుకుంటున్నావు

ఎవరికీ నీ తలుపులు తెరవలేదు
ఇప్పుడు బార్లా తెరిచిన తలుపులతో బావురుమంటున్నావు

స్వేచ్ఛావాయువుల కోసం ఎగిరిపోయావు
ఊపిరాడనట్టు గా ఆయాసపడుతున్నావు

ఎక్కడా ముడిపడకూడదనుకున్నావు
నీకు నువ్వే చిక్కుముడివయ్యావు

ఎవరికీ సమాధానం చెప్పక్కరలేదనుకున్నావు
నువ్వే ఒక ప్రశ్నలా మిగిలావు

దూరంగా సాగిపోయాననుకున్నావు
నీ మూలాలు నీతోనే వస్తాయని  మరచిపోయావు.

సమయాన్ని మించిపోయాననుకున్నావు
మించిపోయింది సమయమని ఇప్పుడు తెలుసుకున్నావు.