Monday, April 23, 2018

దూరమైన స్నేహితులు

మొన్నో రోజు బాల్కనీ లో పూల కుండీలు సద్దుతుంటే ఓ కుండీ కింద నుంచి  జర్రి జర జరా పాక్కుo టూ ఇంకో కుండీ కిందకి వెళ్ళిపోయింది.
దాన్ని చూడగానే చిన్నప్పటి మా పెరటి లోకి వెళ్లినట్టనిపించి ఇంకా అలాంటి స్నేహితులందరూ గుర్తొచ్చారు.
ఆకుల్లో కలిసిపోయే గొల్లభామలు, సాయంత్రం అయేసరికి ఎగురుతూ వచ్చే తూనీగలు, ఝంమ్మనే తుమ్మెదలు, వర్షాకాలం వచ్చిందంటే ప్రత్యక్షమయ్యే రోకలిబండలు, గాజు పురుగులు, గొంగళీలు.,(వీటిని చూస్తే కంపరంగా అనిపించేది అప్పుడు..కానీ పాపం అవి హర్మ్లెస్స్ ) గొంగళిపురుగులు గోడల మీద గూళ్ళు కట్టటం..కొన్ని రోజుల తర్వాత చూస్తే అందులో ఏమీ వుండకపోటం, అప్పుడప్పుడూ వచ్చి దడిపించే తేళ్లు, జర్రులు..ఒకోసారి చిన్నా పెద్దా పాములు, వాటిని చూసి పారిపోటం.. మళ్లీ ఆసక్తిగా తొంగితొంగి చూడటం.. నవ్వొస్తుంది తలుచుకుంటే. ఇంకా నలికిల పాములు అని వచ్చేవి, రంగుల బల్లుల్లా ఉండేవి. తొండలు, ఉడుతలు మామూలే. ఉడుతలని observe చేయటం బాగుండేది.
నవంబర్ /డిసెంబర్ వచ్చిందంటే పూసే రంగురంగుల డిసెంబర్ పూలు, ముళ్లగోరింట, బంతులు, చామంతులు, ఎప్పుడూ పూసే మందారాలు, గులాబీలు,  కాశీరత్నం, మధ్యాహ్నమంకెన్నలు ..తోట అంతా రంగురంగుల నక్షత్రాలు పరిచినట్టుండేది..వాటి కోసం వచ్చే చిన్నా పెద్దా వన్నెవన్నెల సీతా కోక చిలుకలు..ఎగిరే నక్షత్రాల్లా..
చూరుకి కట్టిన వడ్ల కంకుల కోసం వచ్చిపోయే పిచ్చుకలు, జెముడు పక్షులు, గోరింకలు, జామకాయలని కొట్టేసే రామ చిలుకలు..ఇలా ఇంకా బోల్డంతమంది నేస్తాలు.
ఫ్లాట్స్ లోకి వచ్చి నేలకు దూరమై ఈ స్నేహితులందరికీ కూడా దూరమైపోయాం. నగరాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి వీటిల్లో కొన్నిటి పేర్లు కూడా తెలీదు పాపం.
ఇంతకీ బాల్కనీ లోకి వచ్చిన జర్రి మళ్లీ కనిపించలేదు..వీళ్ళందర్నీ గుర్తు చేయటానికి వచ్చిందేమో..

3 comments:

sam said...

dear sir very good blog and very good content

Telugu News

విన్నకోట నరసింహా రావు said...

మీరిక్కడ అద్భుతంగా వర్ణించినది .... మరో ప్రపంచం 👍. అసలు ఒకప్పుడు అటువంటి ప్రపంచం ఉండిందని ఈ తరం వారికి చెప్పినా అర్థం అవదు. మీ పోస్ట్ చాలా నోస్టాల్జిక్ గా ఉంది 👌.

lakshmi ramarao vedurumudi said...

Thank you.