Sunday, February 16, 2025

Emblems

ఆత్మీయుల మరణం తర్వాత వారు వాడిన వస్తువులలో వారిని తలచుకోవడం ఒక అసంకల్పిత చర్య.  వారు  భోజనం  చేసిన పళ్లెం కావచ్చు, కాఫీ తాగిన గ్లాస్ కావచ్చు, పాటలు, వార్తలు విన్న రేడియో కావచ్చు, రోజూ కూర్చున్న కుర్చీ, వాడిన బట్టలూ ..ఇలా ఏదైనా..
మొదట్లో కొంతకాలం వాటిని చూసినప్పుడల్లా కడుపులో సుళ్ళు తిరుగుతూ మొదలైన దుఃఖం ఉప్పెనలా కళ్లలో నుంచి దుముకుతూ ఉంటుంది.  కాలం గడుస్తున్న కొద్దీ కంటనీరు చెలమల్లాగా ఊరుతూ ఉంటుంది.  ఏదీ శాశ్వతం కాదని తెలిసినా జ్ఞాపకాలలో, వారికి చెందిన వస్తువులలో వారు బ్రతికే ఉన్నట్టు మనసు భ్రమిస్తూనే ఉంటుంది..ప్రియంగా వారిని తలుచుకుంటూనే ఉంటుంది.

ఫిలిప్స్ కంపెనీ కి చెందిన ఈ సైకిల్ మా నాన్నగారు 1950ల్లో కొన్నారుట.  తన చివరి వరకూ చాలా అపురూపంగా చూసుకునే వారు.  తనకి 88, 89 వయసు వరకూ కూడా అప్పుడప్పుడు సరదాగా తొక్కేవారు.  ఎప్పటికప్పుడు తుడవడం, గాలి కొట్టించడం చేసేవారు.  సైకిల్ బిగుసుకు పోకుండా ఉండటానికి వాచ్ మాన్ ని తొక్కమనేవారు.  

ఇప్పటికీ మంచి condition లో ఉంది కానీ తొక్కేవారు ఎవరూ లేరు.  Show piece లాగా తయారు చేద్దామని Cycle మీద ఉన్న company emblems పోకుండా వాటిని ముందు కవర్ చేసి, మొత్తం నల్ల రంగు వేయించాను.  నెట్ లో చూసిన ఐడియా తో చేయించి, బాల్కనీ లో పెట్టాను.

Sunday, February 2, 2025

అదే తత్త్వం

సత్త్వమా.. తత్త్వమా

వితండవాదమే తత్త్వవాదం

తత్త్వాన్వేషణ ని మించిపోయిన రంధ్రాన్వేషణ

పొంతన లేని చింతనలే అన్నీ

Sunday, October 20, 2024

సువర్ణకము

అర్ణవమై 

వివర్ణమై

సంకీర్ణమై

పూర్ణమైన

మదిలోని భావములు

సుపర్ణుని రెక్కల ధాటికి పర్ణికలై 

కీర్ణమైన వర్ణములైనవి కదా!

Thursday, October 17, 2024

బొమ్మలకొలువు 2024

బ్రతుకుని ఒక వేడుకగా జరుపుకొమ్మని చెప్పే 'బతుకమ్మ!'
బొమ్మలకొలువు, బతుకమ్మ పండుగ వైజాగ్ లో నాల్గవ సంవత్సరం..2024.

Wednesday, July 10, 2024

నేను కూడా రాయాలి కదా మరి!

కొన్ని 'అనివార్య కారణాల' వల్ల ఈరోజు కల్కి సినిమా చూడాల్సి వచ్చింది.  హాలంతా కలిపి 20/30 మంది ఉన్నారు హాయిగా.. air pollution లేదు.
చెడ్డ పాత్రలని elevate చేసి, విలన్ లని మంచి వారుగా, వీరులుగా, హీరోలుగా చూపించి ఇతిహాసాలని తప్పుగా చిత్రీకరించడం అనే trend ఎప్పటినుంచో వస్తోంది..ముఖ్యంగా తెలుగు సినిమాల్లో.  ఇది కూడా అంతే..అంతా కలి ప్రభావం కాబోలు! 
ఇంత కంటే చెప్పేదేం లేదు ఈ సినిమా గురించి.
ఈ మధ్యే వచ్చిన జై హనుమాన్ పూర్తిగా ఫాంటసీ చిత్రం.  అందులో విభీషణుడిని చూపించినా ఆ పాత్ర, character ఔచిత్యం దెబ్బతినకుండా హుందాగా చూపించారు. పెద్ద బడ్జెట్ సినిమా కాకపోయినా టెక్నికల్ గా కూడా బాగుంది.
కల్కి సినిమా కూడా పూర్తి ఫాంటసీ గా తీసివుంటే బాధ అనిపించేది కాదు.
అమితాబ్ బచ్చన్ గారి తెలుగు dubbing అందరికంటే బాగుంది.
విజయదేవరకొండ అర్జునుడుగా చక్కగా ఉన్నాడు.  
మన ఇతిహాసాలని, అందులోని పాత్రలను ఉన్నవి ఉన్నట్టుగా, నిజాయితీగా చూపించగలిగే సినిమాలు వచ్చే 
ఆ రేపటి కోసం...!

Monday, March 4, 2024

Real-state

2020 నుండీ 2023 వరకూ మా బాల్కనీ నుంచీ కనబడిన దృశ్యం...గత ఏడాది నుంచీ క్రమంగా మారుతూవస్తున్న చిత్రాలు.


'అయ్యో..క్రిందటేడాది వరకూ ఆ కొండ, సముద్రం ఎంత బాగా కనబడేవో కదా!' అని అసంతృప్తి.


మరి మా బిల్డింగ్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇలానే అనుకుని ఉండి ఉంటారు..'ఆ apartment రాకముందు ఆ కొండ, సముద్రం ఎంత బాగా కనబడేవో!'


ఎంతో కొంత చెట్టూ చేమా నష్టపోకుండా ఏ ఇల్లూ, ఏ భవంతీ లేవదు.  అలాగే రోడ్లూ..


మనం అనుభవిస్తున్న ఇళ్ళూ,  హైవేలూ, luxurious resorts,  అందమైన hill stations, యాత్రా స్థలాలలో సౌకర్యాలూ అన్నీ ప్రకృతినీ, పర్యావరణాన్నీ నష్ట పరచి వచ్చినవే.  లీటర్లు లీటర్లు పెట్రోల్ పోసుకుని, హైవే ల మీద షికార్లు చేస్తాం, ఇంకా విమానాల్లో విహరిస్తాం, అందమైన హిల్ స్టేషన్స్ లో vacations ని enjoy చెయ్యటానికి స్టార్ హోటల్స్ నుంచీ బడ్జెట్ హోటల్స్ లో ఉంటాం, యాత్రలకు వెళ్తాం..


ప్రకృతీ, పర్యావరణ నష్టాన్ని ప్రశ్నించే అర్హత హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువులకీ, మారుమూల అడవుల్లో నివసించే అడవి బిడ్డలకీ మాత్రమే ఉంది.