Thursday, November 7, 2019

నాణానికి రెండోవైపు

   తల్లితండ్రులదేమీ తప్పు లేనట్టు, పిల్లల్ని దుర్మార్గులుగా project చేసే కథలు, సుభాషితాలు చూసీ చూసీ విసుగొచ్చి నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించి వ్రాశాను. నాణానికి  రెండో వైపు కూడా ఉంటుందని చెప్పటమే నా ఉద్దేశం.

పిల్లలందరూ చెడ్డవాళ్ళు (?) కాదు. అలాగే వృద్ధాప్యం వచ్చినంత మాత్రాన అందరికీ పెద్ద బుద్ధులు ఉంటాయనీ, మానసిక పరిపక్వత ఉంటుందనీ లేదు.

తల్లిదండ్రులు ఎంత స్వార్ధపరులైనా, అహంభావులైనా, సద్దుబాటు ధోరణి లేనివారైనా,  తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేక ఒకరినొకరు ద్వేషించుకుంటూ తద్వారా ఇంటి వాతావరణాన్ని unpleasantగా కలుషితం చేస్తున్నా, వయసుకు తగ్గ సంయమనం, సామరస్య ధోరణి లేకపోయినా  వాళ్ళ మూలంగా తాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, వాళ్ళ ప్రవర్తన వలన  మానసిక ఒత్తిడితో సతమతమవుతూ ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ  కూడా వాళ్ళు తమ తల్లిదండ్రులు అన్న గౌరవంతో తల్లితండ్రులను తమతోనే ఉంచుకునే కొడుకులు/కూతుళ్ళూ కూడా ఉన్నారు.

ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయి పోయాయని గగ్గోలు పెడుతూ ఈ తరం (20/30 వయసు వారు)పిల్లల్ని విమర్శించటం ఎంతవరకూ సమంజసం? ఈ మార్పేమీ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. దశాబ్దాలనాడే 70, 80 ల్లోనే మొదలయింది. ఏ జనరేషన్ దీనికి కారణం?

గతం తో పోల్చుకుంటే ఇప్పుడు సగటు ఆయుర్దాయం పెరిగింది. అలాగే చిన్న వయసులోనే రకరకాల ఆరోగ్య సమస్యలూ పెరిగాయి.

 ఒకరకంగా చూస్తే ఇప్పుడు 40, 50, 60 వయసుల్లో ఉన్నవారు  ఇంటా బయటా  చాలా ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తోంది. తమ ఓపిక నెమ్మదిగా తగ్గిపోతున్నా తమ తల్లిదండ్రులను చూసుకోక తప్పని పరిస్థితి. ఏవో కారణాలతో తమ పిల్లల వద్దకు కూడా వెళ్లలేని నిస్సహాయత. 

కొంతమంది:

ఇప్పటి తల్లిదండ్రులు చాలామంది (50,60,70 వయసువారు) తమ space , privacy, freedom కోల్పోటానికి ఇష్టపడటం లేదు. పిల్లల దగ్గర ఉండటం కన్నా 'రిటైర్మెంట్ హోమ్స్' లో ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. పిల్లలు మనస్ఫూర్తిగా తమ దగ్గర ఉండమన్నా వీళ్ళుమాత్రం ఇష్టపడకుండా 'ఆ..పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనీ' అంటూ నెపం పిల్లల మీదకి నెట్టేయటం ఎంతవరకూ కరెక్ట్?
కలిసి ఉన్నప్పుడు సద్దుకునే ధోరణి ఇద్దరిలోనూ ఉండాలి.

కొంతమంది genuine గానే తమంతట తామే హోమ్స్ లో వెళ్తున్నారు.

ఇంకొంతమంది పరిస్థితి:

వీళ్ళకి కొడుకో, కూతురో ఒక్కరే సంతానం. ఆ ఉన్న ఒక్క కొడుకు లేదా కూతురూ కూడా అరవైల్లోనో, డభైల్లోనో ఉండి వాళ్ళకే వేరొకరి సహాయం కావాల్సిన స్థితిలో ఉంటారు. వాళ్ళ పిల్లలేమో తమ దగ్గరికి తీసుకెళ్లిపోతామంటారు.
పిల్లల దగ్గర ఉండి హాయిగా మనుమలతో కాలక్షేపం (ఎలాగైతే తమ తల్లిదండ్రులు తమ దగ్గర ఉండి ఇన్నాళ్లుగా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారో అలాగ)చేద్దామని ఉంటుంది. అప్పుడు వాళ్లేమి చెయ్యాలి? ఒకవేళ ఉన్న ఆ ఒక్కకొడుకో , కూతురో మరణిస్తే వారి భాగస్వామి 80, 90 దాటిన వీళ్ళని ఏమి చేయాలి? వాళ్ళని చూసుకోటానికి ప్రత్యేకంగా మనిషిని పెట్టే స్తోమత ఉండకపోతే ఏమి చెయ్యాలి? 

తల్లితండ్రులను వృద్దాప్యంలో జాగ్రత్తగా చూడాలనీ మనవాళ్లే చెప్పారు..వానప్రస్థం గురించి కూడా వాళ్లే చెప్పారు.

మానవ సంబంధాలు, పరిస్థితులు, మార్పులు.. social మీడియాల్లో చెప్పినంత , కథలు, సినిమాల్లో చూపించినంత సులువుగా ఉండవు. అవి ఎంత complicated అనేది స్వయంగా అనుభవించేవాళ్లకే తెలుస్తుంది.
 
నాణానికి ఎప్పుడూ రెండో వైపు కూడా ఉంటుంది. అది కూడా మంచిది కావచ్చు.

Sunday, November 3, 2019

ఆవిడ..

ఎలాంటి పరిస్థితులోనయినా అలవోకగా ఒదిగిపోగలదు 
ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనూ  మనోనిబ్బరం, సంయమనం కోల్పోని ధీమంతురాలు
ఓర్పు, సహనం, క్షమ ఆడవాళ్ళకి బలహీనతలు కాదు..అవే వాళ్ళ బలం అని చెప్పిన మూర్తీభవించిన స్త్రీత్వం
ముఖం చూసి ఎదుటి వారి మానసికావస్థని పసిగట్టి దానికి తగ్గట్టుగా తనని తాను మలుచుకోగల మానసిక నిపుణురాలు..
స్త్రీత్వానికి నిలువుటద్దం..
ఆవిడ..
మా అత్త(గారు).
Missing you so much Atha..