Friday, July 5, 2019

నమో వెంకటేశాయ!!

"నీలోని అహంకారాన్ని, మోహాన్ని 'నెట్టిపడేయ్' "

-తిరుపతి వెంకన్న తన భద్రతా సిబ్బంది ద్వారా  'సామాన్య' భక్తులకు ఇచ్చే సందేశం.
🙏నమో వెంకటేశాయ!

                        *****

చాలా చిన్నతనం లో స్వామి తీర్థము, శఠగోపం తీసుకోటం ఛాయామాత్రంగా గుర్తుంది..
 
పెద్దవుతున్న కొద్దీ తిరుపతి వెళ్లిన ప్రతిసారీ ఎదురయిన రకరకాల అనుభవాలు, అనుభూతులూ, జ్ఞాపకాల తో పాటూ కొండపైన క్రమంగా వచ్చిన , ఇంకా వస్తూనే ఉన్న పెను మార్పులను చూస్తూవుంటే చాలా ఆశ్చర్యం గా ఉంటుంది.

పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, మైకుల్లో సన్నగా వినిపించే స్వామివారి అర్చనలు, మంగళంపల్లి, సుబ్బలక్ష్మి మొదలయిన వారి గాత్రం, వాయిద్యాలు వింటూ ప్రశాంతంగా కొండ మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే..ఆహా..ఆ అనుభూతిని వర్ణించగలమా! 

అంతంతసేపు క్యూ లో ఉన్నా స్వామివారిని 'ప్రశాంతంగా', దగ్గరగా దర్శించుకునేది కొన్ని నిమిషాలు మాత్రమే అయినా ఎంతో తృప్తిగా అనిపించేది.
(నిమిషాలు క్షణాలుగా.. ..క్షణంగా, దర్శనం 'మహా లఘు దర్శనం' గా మారింది.  'అది మహా లఘు దర్శనం కాదండీ..''మహాలాగు'' (pull)దర్శనం' అని TTD officer ఒకాయన జోక్ గా అన్నారు.)

దర్శనం అయిన తర్వాత మహాద్వారం ఎదురుగా ఉన్న మెట్ల వరుసలో కూర్చుని ఏదో తన్మయత్వంలో సేద తీరటం, ఆ తర్వాత అలా వెళ్లి ఇరువైపులా ఉన్న కొట్లు చూసుకుంటూ నడవటం, మధ్య మధ్య ఆగి ఏమయినా కొనుక్కోటం..అవన్నీ దివ్యమైన యాత్రానుభవాలు!! 

80ల్లో అనుకుంటా woodlands హోటల్ అని పెట్టారు. ఆ హోటల్ లో పూరీ కూర, పొంగల్..వాటి రుచి ఇప్పటికీ నోట్లోనే ఉంది. ఆ పక్కనే కొంచెం ముందుకి వెళ్తే పెద్ద తోట..రకరకాల పువ్వులతో రమణీయంగా ఉండేది. అసలు కొండ అంతా సంపంగి సువాసనతో ఆహ్లాదంగా ఉండేది. ఆ గార్డెన్ దగ్గరే అనుకుంటా రాతి మంటపం ఉండేది. ఆ చివర ఒక వ్యూ పాయింట్ .  అక్కడ నుంచీ చూస్తే పాత కాలిబాట (ఇప్పుడు శ్రీవారి మెట్లు ట) కనిపిస్తూ ఉండేది. ఇప్పుడక్కడ అలాంటివేమీ లేవు అని ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు డ్రైవర్ చెప్పాడు.
1991 లో వెళ్ళినప్పుడు తోమాలసేవ, అర్చన (ముందురోజు విజయా బాంక్ లో సేవల కోసం టికెట్లు కొనుక్కోటమే..సో సింపుల్) అయినతర్వాత హుండీ ఎదురుగా ఉన్న మంటపం మెట్ల మీద కూర్చుని ఉన్నాము. ఒక పూజారిగారు తమలపాకులో స్వామివారి నవనీత ప్రసాదం మా చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అది స్వామివారి చల్లటి దీవెనే కదా!!
అంగప్రదక్షిణ చేసిన వాళ్ళందరూ సుప్రభాత సేవ అయేవరకూ క్యూ లో వేచివుండాలి. ఆ బ్రహ్మ ముహూర్తపు ఘడియలలో, ఆహ్లాదకరమైన ప్రకృతిలో, ప్రశాంతమైన వాతావరణంలో ఎదురుగా అంతెత్తున ధ్వజ స్థంబపు చిరుగంటలు చేసే సవ్వడి తప్ప ఇంకేమీ శబ్దం లేకుండా..ఆహా..దేముడు ఆ గంటల చిరు సవ్వడి లోనే ఉన్నాడా అన్నట్టుగా..అనుభవిస్తే తప్ప తెలియని అద్భుతమైన భావం!!

ఎన్ని సార్లు చూసినా, అల్లంత దూరం నుంచీ చూసినా, లిప్తపాటు దర్శనమయినా ఆత్మానందాన్ని కలిగించే ఆ దివ్య మంగళరూపం..!!

2 comments:

విన్నకోట నరసింహా రావు said...


// "నెట్టిపడేయ్" //

ఇదే తిరుమలలో పద్ధతి. ఆ సోకాల్డ్ భద్రతా సిబ్బంది ఎంత అహంకారపూరితులంటే ... వారి చెయ్యి తగలకుండా తన మానాన తను ముందుకు కదులుతున్న వారిని కూడా పదడుగులు దాటినా వెనక నుండి వచ్చి తొయ్యడం నేను చూశాను ఒకసారి చాలా యేళ్ళ క్రితమే. ఇప్పుడు ఇంకా పెచ్చుమీరి పోయుంటారేమో ఆ సిబ్బంది?

నాకు గుర్తున్నంత వరకు కూడా ఈ నెట్టివేయడం అన్నది ఒకప్పుడు ఇంత దారుణంగా లేదు. కానీ "అన్నమయ్య" సినిమాలో గుడి దండనాయకుడు (తనికెళ్ళ భరణి) భక్తులతో "ఏం, తోయించుకోవాలనుందా" అంటాడు. 600 సంవత్సరాల క్రితపు అన్నమయ్య కాలానికే ఈ తోపుడు ఉందనుకోవాలా? లేదేమో? అసలు ఇంత జనాభా, సౌకర్యాలు ఎక్కడున్నాయి ఆ రోజుల్లో? ఈ కాలపు పద్ధతినే ఆ నాటి పద్ధతుల మీద superimpose చేసి సినిమా నిర్మాతలు చూపించారని నా అనుమానం.

ఇప్పుడు జనం, తిరుపతి ప్రయాణాలు బాగా ఎక్కువయ్యాయి. అయినప్పటికీ ఆలయ సిబ్బంది కాస్త మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే బాగుంటుంది. నేను కేరళలోని పెద్ద పెద్ద ఆలయాలలో కూడా గమనించాను - క్యూ లైన్ ను నియంత్రించే పోలీస్ సిబ్బంది తమ చేతిలో ఖాళీ అగరొత్తుల పెట్టె మాత్రం పట్టుకుని దాన్ని గాల్లో ఊపుతూ ముందుకు కదలండని అంటుంటారు, భక్తులను ముట్టుకుని తొయ్యడం కనబడలేదు.

ఒకప్పటి తిరుపతి వాతావరణం, పరిసరాలకు ఇప్పటి తిరుపతికి తేడా బాగా వర్ణించారు. ఆహ్లాదకరంగా ఉండడం గణనీయంగా తగ్గిందనిపిస్తుంది.

lakshmi ramarao vedurumudi said...

ఇప్పుడు తిరుపతిలో పిట్ట భక్తుడు/రాలు లేదు. ఇప్పుడు వెళ్తే గంటలు గంటలు స్వామిని దర్శించుకోవచ్చు. కానీ వెళ్లే పరిస్థితి లేదు. Irony కదా!
భక్తి సినిమాలు గురించి, అందులో ఇప్పటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 😄