పొద్దున్న దినపత్రిక తిరగేస్తావు
'ఆ..మామూలు వార్తలే..అక్కడేదో ప్రమాదం, ఇక్కడెవరో చంపుకున్నారు, ఇంకెక్కడో మానభంగం..ఇంతే..ప్చ్..' అనుకుంటావు..పేపర్ పక్కన పడేస్తావు..
మనసు మెత్తదనం కోల్పోయిందా
రోడ్డు మీద వెళ్తూ ఉంటావు..ఎవరో పడిపోయి వుంటారు, ఇంకెవరో కొట్టుకుంటూ ఉంటారు, ఆ పక్కనే ఓ తల్లి ఒడిలో పాపాయి
బోసినవ్వులు పూయిస్తూ ఉంటుంది..అన్నీఅలా కళ్ళప్పగించి చూస్తూనే ఉంటావు.
మనసు స్పర్శ ని కోల్పోయిందా..
నీ ఉనికి బయటపెట్టకుండా ముసుగేసుకుని నీకంటే తెలివయినవాళ్ళు, ఉద్ధరించేవాళ్ళు లేరన్నట్టుగా సాంఘిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా, చేతికొచ్చినట్టు రాతలు రాస్తావు
మూసుకున్న నోటితో గొంతు చించుకొని అరుస్తావు
ఆ ముసుగు తీసి ఇంకో ముసుగుతో బైటికి వస్తావు..
మనసు ఊసరవెల్లి గా మారిందా
వాళ్ళమీదా వీళ్ళమీదా చాడీలు చెప్తూ పైశాచికానందం పొందుతావు..మళ్లీ అందరూ నిన్ను అన్యాయం చేస్తున్నారని ఏడుస్తావు..అవకాశం దొరికితే నువ్వూ అదే పని చేస్తావని చెప్పే అంతరాత్మ గొంతు నొక్కేస్తావు..
మనసు చీకటిరంగు పులుముకుందా
కాలగర్భంలో నిన్ను సమాధిచేసుకున్నావా
పొరలు పొరలుగా మందంగా పేరుకుపోయి మొద్దుబారిన మనసు గోడలని పగలగొట్టు..నిన్ను నువ్వు బైటకి తెచ్చుకో..మనసుని స్పందించనీ..మళ్ళీ..