భూమి నుంచి పుట్టిన చిన్న మొలక..
సుకుమారంగా,లేతగా ఉన్న మొక్కకి వాడి పోకుండా, పడి పోకుండా దన్నుగా నిలిచే వేళ్ళు.
చిట్టి మొక్క ఒకటొక్కటిగా మారాకులు వేస్తూ..నెమ్మదిగా పైకి ఎదుగుతూ..
తన చుట్టూ ప్రపంచాన్ని వింతగా, ఆసక్తిగా , ఉత్త్సాహం తో గమనిస్తూ, కొత్త కొమ్మలు తొడుగుతూ..
భూమి నుంచి పై పై కి ఎదుగుతూ..
తన నుంచి పుట్టిన మొక్క పెద్ద చెట్టు,వృక్షం గా మారటానికి ఇంకా శక్తి ని అందించే వేళ్ళు..ఆ శక్తిని అందిస్తూనే ఉంటాయి.
తాము శ్రద్ధగా, ప్రేమగా అందించిన పోషణతో బలంగా ఎంతో ఎత్తుకి ఎదిగి, కొమ్మలూ రెమ్మలూ కొత్త చిగుళ్లు వేస్తూ, తమకంటే ఎత్తులో ఉన్న చెట్టుని చూసి వేళ్ళు సంతోషిస్తాయి..గర్వపడతాయి.
చెట్టు భూమినుంచి దూరం అయినట్టు కనిపిస్తుంది..అంతే.....
కాని చెట్టు ఎంత పైకి వెళ్తుంటే అంత దృఢమయిన బంధాన్ని వేళ్ళతో కలిగివుంటుంది..
బంధం లోలోనికి వేళ్లూనుతూనే ఉంటుంది.
బలపడుతూనే ఉంటుంది.
(పిల్లలు దూరం గా వెళ్ళటాన్ని సానుకూల దృక్పధం తో రాశాను. ఇది ఒక కోణం మాత్రమే. అందరూ ఏకీభవించాలని లేదు)
No comments:
Post a Comment