Wednesday, November 8, 2017

Thursday, October 26, 2017

అంతే

మంచి పరిమళాన్ని ఆఘ్రాణించగలమే కాని అందుకోగలమా
చక్కటి పాటని విని ఆనందించగలమే కాని పట్టుకోగలమా
వెన్నెలని స్పృశించగలమా...
కొన్నిటిని భావనగా అనుభూతి చెందటమే..అంతే.

Friday, October 13, 2017

#అహోబిలం

అహోబిలం - కర్నూల్ జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న నరసింహ క్షేత్రం. విష్ణుమూర్తి నరసింహావతారం లో హిరణ్యకశిపుడిని వధించిన ప్రదేశం.ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే నరసింహ స్వామి తొమ్మిది రూపాలలో వెలిశారు.
నా చిన్నప్పుడు, అహోబిలం చూసిన ఒకాయన ఆ క్షేత్రం గురించి, ఆయన అనుభవాల గురించి, అక్కడి ప్రకృతి గురించి వర్ణించి చెప్తుంటే ఆ క్షేత్రం చూడాలనే చిగురించిన కోరిక..చిన్ననాటి కల.. చివరికి 2007 డిసెంబర్ లో తీరింది.
జీవితం లో మళ్ళీ అక్కడికి వెళ్తానని ఏ మాత్రం ఊహించలేదు  అప్పుడు.
 అనుకోకుండా మళ్ళీ పదేళ్ల తర్వాత ఈ విజయదశమి రోజు రెండోసారి అహోబిలం వెళ్ళటం అనేది స్వామి అనుగ్రహం తప్ప ఇంకోటి కాదు.
30 - 9 - 2017 , విజయదశమి
పొద్దున్న దేముడి పూజ, ఆయుధ పూజ చేస్కుని బయలుదేరేసరికి తొమ్మిది అయింది. వాతావరణం మబ్బుగా, చల్లగా, ఆహ్లాదం గా ఉంది. మధ్యలో మహానంది లో ఈశ్వరుడికి అభిషేకం, కామేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజ చేస్కుని అహోబిలం చేరుకునేసరికి సాయంత్రం 5 అయింది. తక్కువ వ్యవధి లో అనుకుని బయలుదేరటం, వరుసగా పండగ సెలవలు రావటం వలన మంచి రూమ్ దొరకలేదు.  ఊళ్ళో  రూమ్స్, ఆళ్ల గడ్డ లో రూమ్స్   అన్నీ బుక్ అయిపోయాయి.        చెన్నై నుంచి 1200 మంది ఒకే  గ్రూప్ గా రావటం తో ఎక్కడ చూసినా వాళ్ళ బస్సు లే . సరే..మేము స్నానం చేసి దిగువ అహోబిలం లో వెలసిన లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నాము. ఈ సారి పిల్లలతో రాకపోవటం వెలితిగా అనిపించింది. ప్రతినిమిషం వాళ్ళని మిస్ అయ్యాము. 

జమ్మి కొట్టటం
ఆ రోజు విజయదశమి కావటం వలన అనుకోకుండా ఒక మంచి దృశ్యం చూసే అదృష్టం మాకు కలిగింది . అదే.. స్వామి వారు వేటకి వెళ్ళటం. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా ఊళ్ళో జమ్మి చెట్టు ఉన్నప్రదేశానికి తీసుకు వచ్చారు. అంతకు ముందే అక్కడ అంతా శుభ్రం చేసి , ముగ్గులు పెట్టి ఉంచారు. . అప్పటికే అక్కడ  భక్తులు    స్వామివారికి స్వాగతం చెప్పటానికి సిద్ధంగా వున్నారు. స్వామివారు తనకి బావమరుదులు అయిన చెంచుల తో కలిసి(చెంచుల ఆడపడుచు అయిన చెంచు లక్ష్మిని వివాహం చేసుకున్నారు కదా!) వేటాడుతారట. పూజారులు, చెంచులు కలిసి నిజమయిన విల్లంబు, బాణాల తో జమ్మి చెట్టుని కొట్టటం...చాల సరదాగా అనిపించింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత హారతి అందుకుని స్వామివారు మళ్ళీ గుడికి బయలుదేరారు.

నవ నారసింహులు
నరసింహ స్వామి తన భక్తుల కోసం తొమ్మిది రూపాలలో      వెలసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత.   అలాగే స్వామివారి ఒక్కొక్క  రూపం ఒక్కొక్క గ్రహానికి అధిపతి గా ఉండటం కూడా ఇక్కడి ప్రత్యేకత. తొమ్మిది రూపాలు రమణీయమయిన ప్రకృతి లో , దట్టమైన నల్లమల అడవుల మధ్యలొ మొత్తం సుమారుగా పది కిలోమీటర్ల లోపు పరిధి లో వెలసి వున్నాయి. తిరుపతి నుంచి శ్రీశైలం వరకు ఆదిశేషువు రూపం లో ఉన్న పర్వాతాలలో తల భాగం తిరుపతి, మధ్య భాగం అహోబిలం, చివరి భాగం శ్రీశైలం క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. 7 , 8 శతాబ్దాలలో చాళుక్య రాజులు కట్టించిన గుడులని తర్వాత విజయనగరం శ్రీకృష్ణ దేవరాయలు కాలం లో పూర్తి చేశార ట. కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ఈ ఆలయానికి ఎంతో సేవ చేసాడట. తొమ్మిది గుడులలో కొన్నిటికి వెళ్ళటానికి కొంచం కష్టపడాలి, కొన్నిటికి తేలికగా వెళ్లచ్చు. ట్రెక్కింగ్ ఇష్టపడేవాళ్ళకి బాగుంటుంది.
నవ నరసింహులు వరసగా..
1 . జ్వాలా నరసింహ - కుజ గ్రహం
2 . అహోబిల నరసింహ - గురు గ్రహం.
3 . మాలోల నరసింహ - శుక్ర గ్రహం.
4 . వరాహ నరసింహ - రాహు వు
5 . కారంజ నరసింహ - చంద్రుడు
6 . భార్గవ నరసింహ - సూర్యుడు
7 . యోగానంద నరసింహ - శని
8 . చత్రవట నరసింహ - కేతు వు
9 . పావన నరసింహ - బుధుడు

దిగువ అహోబిలం
అహోబిలం ఊరిలో ప్రహ్లాద వరద లక్ష్మి నరసింహ స్వామి గా వెలసిన క్షేత్రం..దిగువ అహోబిలం గా పిలువబడుతోంది. ఇక్కడ స్వామివారు ఒడిలో లక్ష్మి దేవి తో కూర్చుని , శాంత రూపం లో దర్శనం ఇస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే ప్రతిష్ట చేసినట్టుగా పురాణాలలో చెప్పబడి ఉందిట. పక్కనే అమృతవల్లి అమ్మవారి మందిరం వుంది. విశాలమయిన ప్రాంగణం , అద్భుతమయిన శిల్పకళా సంపద తో ఈ ఆలయం అలరారుతోంది.  ఎగువ  అహోబిలం నుంచి ఒక గైడ్ ని వెంట పెట్టుకోవటం మంచిది. వాళ్ళు అన్నీ దగ్గర ఉండి చూపించటం, అడవి మార్గం లో సహాయం గా  ఉంటారు.

 ఎగువ అహోబిలం.
పొద్దున్న ఏడింటికి  గైడ్ ..చైతన్య కుమార్ని తీసుకుని ఎగువ అహోబిలం బయలుదేరాము. దిగువ అహోబిలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం లో వుంది ఎగువ అహోబిలం. ఎగువ అహోబిలం నుంచి నడక దారి మొదలవుతుంది. మోటార్ వాహనాలు కొంత వరకు వెళ్లిన తర్వాత పార్క్ చేసుకొటమే. అక్కడి నుంచి ఎగువ అహోబిలం గుడి ఒక కొండ పైన ఉంటుంది. చాలా వరకు మెట్లు, కొంత నడక తర్వాత పావుగంట లో గుడి చేరుకోవచ్చు. తొమ్మిది ఆలయాలలో ఇది ప్రధాన ఆలయం. ఇక్కడ స్వామి ఉగ్ర రూపం లో వుంటారు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడి కోసం ఇక్కడ ఒక గుహలో స్వయంభువుగా సాలగ్రామ రూపం లో స్వామి దర్శనం ఇచ్చారుట. గుహ మీదే గర్భగుడి కట్టబడి ఉంటుంది. జ్వాలా నరసింహ ఉత్సవ మూర్తులకి ఇక్కడ నిత్యా పూజ, కళ్యాణం జరుగుతాయి. మేము వెళ్లేసరికి కళ్యాణం జరుగుతోంది. కాని ఈ సారి మూలమూర్తి దర్శనం కాకపోటం కొంచం అసంతృప్తి గా అనిపించింది. గర్భగుడి గోపురానికి మరమ్మత్తులు చేస్తున్నందున బాలాలయం చేసి భక్తుల దర్శనార్ధం ఉత్సవ మూర్తులని పక్కనే ఉన్నమండపం లో పెట్టారు. వచ్చేసారి మూలమూర్తి దర్శనం కావాలని నమస్కారం చేసుకున్నాము. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం (?) లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి నెల స్వామివారి నక్షత్రం స్వాతి నక్షత్రం లో ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆదిశంకరాచ్యార్య ఇక్కడ సుదర్శన చక్రం ప్రతిష్టించి నృసింహ కరావలంబ స్తోత్రం రచించారుట. అహోబలేశ్వరుడి దర్శనం అయిన తర్వాత క్రోడ లేదా వరాహ నరసింహ స్వామి వద్దకు బయలుదేరాము.

వరాహ (క్రోడ)నరసింహ
అహోబలేశ్వరుడి గాలి గోపురం పక్కనే ఉన్న దారి నుంచి అడవి లోకి ప్రవేశిస్తాము.. ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. అడవిలో నడవటానికి ఊతం కోసం చేతి కర్ర తీసుకోవాలి ఇక్కడ. నడిచి ఎక్కలేని వాళ్ళకోసం డోలీలు కూడా ఉంటాయి. డోలీలు మోసే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది..అంత బరువు మోస్తూ ఎలా ఎక్కుతారా అని. ఒక కిలోమీటర్ దూరం లో ముందుగా వరాహ నరసింహ గుడి వస్తుంది. ఇక్కడ స్వామి వరాహ రూపం లో లక్ష్మి దేవి తో కలిసి వుంటారు. వరాహ రూపం లో ఉన్న స్వామి నోటి పైన భూదేవి ఉంటుంది. హిరణ్యాక్షుడు నుంచి భూదేవి ని రక్షించటానికి ఈ అవతారం దాల్చారు. దర్శనం అయిన తరువాత జ్వాలా నరసింహుని వద్దకు బయలుదేరాము.

జ్వాలా నరసింహ
అన్నిటిలోకి ఎత్తయినది..వెళ్లేదారి exciting అయినది . ఇక్కడ పిల్లల్ని బాగా మిస్ అయ్యాము. క్రితం సారి వాళ్ళతో వచ్చినప్పటి అనుభవాలన్నీ గుర్తొచ్చాయి. పదేళ్ల క్రితం ఇవన్నీ ఎక్కుతుంటే ఏదో excitement , మూడు దశాబ్దాల నాటి కల నెరవేరుతోందన్న ఉద్వేగం, పిల్లల ఉత్సాహం చూసి సహజం గా మనకూ కలిగే ఉల్లాసం..ఇలా ఏవేవో భావావేశాలు . ఈసారి అవేవి లేవు కానీ అంతకు మించిన తృప్తి, ఒకరకమయిన ప్రశాంతతతో మనసు నిండుకుండలా అనిపించింది..తేలికగా ..(నిండుకుండ తేలిగ్గా ఉంటుందా? ! ఏమో మరి అలానే అనిపించింది  )
జ్వాలా నరసింహ దిగువ అహిబిలం నుంచి 4 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. జ్వాలా కి దారి పూర్తిగా రాళ్లు, గుట్టలు , అక్కడక్కడా నేల, అక్కడక్కడా మెట్ల తో ఉంటుంది. ఇనుము, చెక్కలతో చేసిన 3 , 4 చిన్న చిన్న వంతెనలు ఉంటాయి. కొన్ని చోట్ల దారి చాల సన్నగా..ఒకళ్ళిద్దరు పట్టేంత..ఒక వైపు లోయ తో కొంచం రిస్కీ గా , కాని థ్రిల్లింగ్ గా ఉంటుంది. అక్కడక్కడా రాళ్ళల్లోంచి పారే పిల్ల కాలువలతో , అక్కడక్కడా కనబడే చిన్న చిన్న వాటర్ఫాల్స్, చిన్న నీటి మడుగుల తో దారి అతి మనోహరం గా ఉంటుంది. ఎటు చూసినా ఎత్తయిన కొండలు, పచ్చటి ప్రకృతి..అప్పుడప్పుడూ వినిపించే పక్షుల కిలకిలలు. నల్లమల అడవుల అందాన్ని చూస్తుంటే సహజమయిన సౌందర్యం తో (raw beauty ) మెరిసిపోయే అడవి పిల్ల లా...చెంచు లక్ష్మి లా... అనిపిస్తుంది.
జ్వాలా నరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశించే ముందు, కొండల మీదనుండి సహజంగా పడే భవనాశిని నీటి ధారల కింద నుండి వెళ్ళటం వలన స్నానం చేసి పవిత్రంగా స్వామి వద్దకు వెళ్లినట్టవుతుంది. తడవకుండా పక్కకి ఒదిగి కూడా వెళ్ళచ్చు. కొండలపైనుండి ఎలాంటి కలుషితాలు లేకుండా పడతాయి కాబట్టి ధైర్యంగా ఆ నీళ్ళని తాగచ్చు. ఎంతో రుచి గా ఉంటాయి ఆ నీళ్లు.
హిరణ్యకశిపుడిని సంహరించిన అసలు చోటు ఇదే కాబట్టి స్వామి ఉగ్ర రూపం లో వుంటారు. ఒళ్ళో హిరణ్యకశిపుడిని వధిస్తూ మహోగ్రం గా వుంటారు. హిరణ్యకశిపుడిని సంహరించినట్టే మనలోని అహంకారాన్ని కూడా నరసింహమూర్తి వధిస్తున్నాడేమో అని ఒక భావన కలిగింది. అక్కడే కొంచం దూరం లో నీళ్లతో నిండిన చిన్న మడుగు ఉంటుంది. హిరణ్య సంహారం అయిన తర్వాత స్వామి ఈ మడుగులో చేతులు శుభ్రం చేసుకున్నారట. అందుకే అక్కడి నీళ్లు కొంచం ఎర్రగా, ఎప్పుడూ ఒకే లెవెల్ లో ఉంటాయట. దీనిని రక్త కుండం అంటారు. ప్రతిరోజూ ఈ కొండలు ఎక్కి (ముఖ్యంగా జ్వాలా, మాలోల) స్వామి కి నిత్యపూజ, నైవేద్యం చేస్తున్న పూజారులకు వందనాలు. వాళ్లకి ఆ శక్తీ భగవంతుడే ఇస్తాడు కాబోలు. పూజారులకు వంతుల ప్రకారం డ్యూటీ ఉంటుందిట.
జ్వాలా కి కొంచం ముందుగా ఒక దారి వస్తుంది. అది ఉగ్ర స్థంభం వెళ్లే దారిట. నరసింహ స్వామి అక్కడ స్థంబ రూపం లో వున్నపెద్ద కొండ నుంచి ఉద్భవించారు. పైకి వెళ్ళటం చాల శ్రమ తో కూడుకున్నది, అందులో వర్షాలు పడటం వలన జారుడుగా ఉంటుందని వెళ్ళలేదు. దారి బాగా steep గా, ఒక్కోచోట ఎక్కటానికి కాళ్లు చేతులతో కూడా ఎక్కాల్సి వస్తుందిట. నెమ్మదిగా ఎక్కేవాళ్ళకి ఎక్కి దిగటానికి మూడు గంటలు పడుతుందిట. వచ్చేసారి ఉగ్రస్థంభం ఎక్కే శక్తి , అవకాశం ఇవ్వమని దేముడిని కోరుకున్నాను.
జ్వాలా వెళ్ళేదారిలో గరుడాద్రి పర్వతం కనిపిస్తుంది. నిజంగానే గరుత్మంతుడు రెక్కలు విప్పుకున్న ఆకారంలో కనిపిస్తుంది. జ్వాలా నుంచి మాలొల బయలుదేరాము.
మాలోల నరసింహ
మా అంటే లక్ష్మీదేవి , లోల అంటే ప్రియమయినది..మహాలక్ష్మి కి ప్రియమయిన నరసింహుడు లేదా నరసింహునికి ప్రియమయిన మహాలక్ష్మి..ఎలా అయినా అర్ధం చేస్కోవచ్చేమో. ఎగువ అహోబిలం నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది. జ్వాలా నుంచి మాలొల కి దారి రాళ్లు, గుట్టల కంటే మెట్లు , నేల దారి ఎక్కువ. నాకెందుకో జ్వాలా దారి కంటే ఇదే కొంచం కష్టం గా అనిపించింది. కాని చుట్టూ అడవి అందాలు, భగవంతుని అనుగ్రహం తో శ్రమ మర్చిపోతాము. క్రిందటి సారి మాలొల వెళ్లే దారిలో లోయలో కెమెరా పడిపోయిన స్పాట్ ని గుర్తు పట్టాము. 
ఇక్కడ స్వామివారు లక్ష్మీదేవి అలక తీర్చటానికి వెలిశారు. ఒడిలో లక్ష్మీదేవి ని కూర్చోపెట్టుకుని ఎంతో సౌమ్యం గా కనిపిస్తారు. మాలొల నుంచి కొంచం దూరం లో ప్రహ్లాద బడి ఉంటుంది. ప్రహ్లాదుడు గురుకులం లో చదువు నేర్చుకున్న ప్రదేశం గా చెప్తారు. విశాలమయిన రాతి ప్రదేశం, చిన్న నీటి ధార, చుట్టూ చిక్కటి అడవి తో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మాలొల నుంచి మళ్ళీ కిందకి..అంటే ఎగువ అహోబిలానికి తిరుగు ప్రయాణం అయ్యాము. ఎగువ అహోబిలం లో చేతి కర్ర ఇచ్చేసి కిందకి..వెహికల్ దగ్గరికి వచ్చేసాము.
ఇక్కడ చైతు గురించి చెప్పాలి. పైకి వెళ్లేప్పుడు కొంచం కష్టమయిన దారి వచ్చినప్పుడల్లా మా ఇద్దరిని..ముఖ్యంగా నన్ను ఎంతో జాగ్రత్తగా , చేయిపట్టుకుని చాల ఆప్యాయంగా తీసుకెళ్లాడు. మే లార్డ్ నరసింహ బ్లెస్స్ హిం.
కారంజ నరసింహ
ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలం వెళ్లే దారిలో, రోడ్ పాయింట్ కి దగ్గరగా ఉంటుంది. కారంజ (గానుగ?) వృక్షం కింద వెలిశాడు కాబట్టి ఆ పేరుతోనే పిలుస్తారు. హనుమంతుడు తపస్సు చేసుకున్నప్పుడు స్వామి నరసింహ అవతారం లో ప్రత్యక్షం ఆయారుట. ఆంజనేయస్వామి తనకి రాముడు గానే కనిపించాలని కోరుకున్నారుట. అప్పుడు రామ, నరసింహ కలిసిన రూపాల్లో స్వామి దర్శనం ఇచ్చారుట. అందుకే ఇక్కడి స్వామివారు చేతిలో ధనుస్సుతో శాంతరూపం లో కనిపిస్తారు.
ఇక్కడితో ఆ రోజు 5 నరసింహ రూపాలని చూసినట్టు అయింది. ఎగువ అహోబిలం నుంచి బయలుదేరి మళ్ళీ అక్కడికి తిరిగి రావటానికి మొత్తం నాలుగు గంటలు పట్టింది. గబగబా ఎక్కగలిగే వాళ్లకి మూడు గంటలు చాలు. మర్నాడు పావన, భార్గవ, యోగానంద, చత్రవట నరసింహ స్వామిల వద్దకు ...

2 - 10 - 2017 , పావన నరసింహ
పైనవన్నీఒక ఎత్తయితే పావన ఒక్కటి ఒక ఎత్తు అని చెప్పచ్చు. అన్నిటికంటే కష్టమయినది. దీనిని క్షేత్రరత్నం అంటారుట. ఎగువ అహోబిలం నుంచి 7 కి. దూరం లో ఉంటుంది. 750 మెట్లు, తర్వాత మామూలు నడక ఉంటాయట. జ్వాలా కంటే తక్కువ మెట్లే అయినప్పటికి మెట్లు ఎత్తుగా ఉండటం వలన ఇక్కడ ఎక్కువ కష్టపడాలి.
పావన కి వెహికల్ లో కూడా వెళ్ళచ్చు. మేము అలానే వెళ్ళాము ఈసారి కూడా. దిగువ అహోబిలం లో బోల్డన్ని 'జీపులు' (అన్నీ మహీంద్రా వెహికిల్స్ ..నిజంగా వాటికి అవార్డు ఇవ్వచ్చు..ప్రపంచంలో అత్యంత స్ట్రాంగ్ వెహికల్స్, తుక్కు తుక్కు అయిపోయినా సురక్షితంగా పనిచేసేవాటి category కింద.,ఇంక అవి నడిపే డ్రైవర్ల ముందు ఏ ఫార్ములా రేసర్లు కూడా పనికిరారు)దొరుకుతాయి. వాళ్లకి యూనియన్ కూడా వుంది. డ్రైవర్లు అందరూ ఒక్క తాటి మీద ఐకమత్యం గా వుంటారు. పావన, భార్గవ కలిపి ట్రిప్ కి 2 ,500 తీసుకుంటారు.
పావన వెళ్లే దారి ..(దాన్ని 'దారి' అనటానికి లేదు)..ఆంతా పెద్ద పెద్ద బండరాళ్లు, ఎత్తయిన గుట్టలు, లోతయిన గుంతలతో ఉంటుంది. అందులో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి లోతయిన బురద గుంటలు. 'జీప్' ఏ క్షణం లో అయినా పక్కకి లేదా బోల్తా పడుతుందేమో లేదా జారిపోతుందేమో లేదా బురదలో కూరుకు పోతుందేమో అనేంత భయంకరం గా ఉంటుంది ప్రయాణం. ఒళ్ళు హూనమయి పోవటం అనేదానికి అసలయిన మీనింగ్ తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రమాదకరంగా అనిపిస్తుంది. జీప్ మధ్యలో ఆగిపోవటం చాలా సాధారణ విషయం. సహాయం కోసం ఇంకో జీప్ వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. మా జీప్ అలానే బురదలో కూరుకుపోయింది. చివరికి అరగంట తర్వాత వెనకాల వచ్చిన ట్రాక్టర్ కి తాడు కట్టి బయటికి లాగాల్సి వచ్చింది. ట్రాక్టర్ వచ్చేదాకా పక్కనే ఉన్న పిల్ల కాలువని ఎంజాయ్ చేసాము  .ఇంత ప్రమాదకరమయిన ప్రయాణమయినా ఎప్పుడూ ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకపోవటం దేముడి మహత్యం, డ్రైవర్ల చాకచక్యం . చూడటానికి రెండు కళ్లు సరిపోని అందమయిన , అద్భుతమయిన ప్రకృతి, దట్టమయిన అడవి మధ్యలో నుంచి ప్రయాణం..కాని అవి హాయిగా , ప్రశాంతంగా ఆస్వాదించే అవకాశం ఉండదు. జీప్ కుదుపుల వలన కలిగే అసౌకర్యం, ఒక్కోసారి భయం, జీప్ ఇంజిన్ చేసే భయంకరమయిన చప్పుడు.
అందుకే నాకు అనిపించింది కష్టమయినా నడిచి వెళ్లే దారిలోనే పావన కి వెళ్ళాలి . కొంచమయినా ఆ అడవి అందాన్ని, ప్రశాంతతని అనుభవించి ఆనందించాలని , తిరుగు ప్రయాణం లో జీప్ దిగి కొంచంసేపు నడిచి తృప్తి పడ్డాము.
సరే..మొత్తానికి గుడి చేరాము. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా ఆ మహోగ్రం నుంచి బయటికి రాకుండా ఉన్న నరసింహ స్వామిని శాంతింప చేయటానికి లక్ష్మి దేవి, చెంచుల ఇంట చెంచులక్ష్మి గా మారి ఆయనను శాంతింప చేస్తుంది. స్వామివారు చెంచులక్ష్మిని వివాహం చేసుకున్న ప్రదేశమే ఈ పావన గా చెప్తారు. చుట్టూ ఎత్తయిన పర్వతాలు, అత్యంత సుందరమయిన, ప్రశాంతమయిన ప్రకృతి నడుమ ఈ ఆలయం వుంది. స్వామివారు ఒడిలో చెంచు లక్ష్మి తో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. లక్ష్మీదేవి చెంచుల ఇంట చెంచులక్ష్మి గా పుట్టినందున చెంచుజాతి వారు ఆమెని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. శుక్రవారం రాత్రి గుడిలో నిద్ర చేసి శనివారం అమ్మవారికి బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకోటం వారి ఆచారం. ఈసారి ఎలా అయినా పావన కి నడుచుకుంటూనే వెళ్ళాలి అని అనుకుంటూ భార్గవ కి బయలుదేరాము.

భార్గవ నరసింహ
దిగువ అహోబిలం నుంచి 2 కి. దూరం లో ఉంటుంది. ఓపిక ఉంటే నడవచ్చు. ఆటో లు కూడా వెళ్తాయి. దారి అక్కడక్కడా గుంటలు, రాళ్లతో ఉంటుంది కాని పర్వాలేదు. సుమారు వంద..నూట ఇరవై మెట్లు ఎక్కితే గుడి వస్తుంది. స్వామివారి ఉగ్ర రూపం చూడాలన్న పరశురాముడి కోరిక తీర్చటానికి ఇక్కడ నరసింహ స్వామి హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్టుగా దర్శనం ఇచ్చారు. కాని ఇక్కడ హిరణ్య కశిపుడి తలభాగం స్వామివారి ఒడిలో కుడివైపున ఉంటుంది. నాలుగే భుజాలతో , స్వామి ఉగ్ర రూపం లో వుంటారు. గుడి మెట్ల కింద పరశు రాముడు నిర్మించినట్టుగా చెప్పబడే కోనేరు ఉంది. అందులో నీటిమట్టం ఏ కాలం లో అయినా తగ్గటం, పెరగటం అంటూ ఉండకుండా ఒకేలా ఉంటుందిట. అక్కడి నుంచి యోగానంద కి బయలుదేరాము.

యోగానంద నరసింహ
దిగువ అహోబిలం నుంచి 2 కి. దూరం లో వెళ్ళటానికి అనువుగా ఉంటుంది. గుడి వరకు వెహికల్ వెళ్తుంది. ఇక్కడ నరసింహస్వామి యోగాసనం లో కూర్చున్నట్టుగా శాంతంగా వుంటారు. హిరణ్యకశిప వధ తర్వాత ప్రహ్లాదుడికి స్వామివారు యోగ రహస్యాలు బోధించిన ప్రదేశం. అక్కడి నుంచి చత్రవట నరసింహ కి బయలుదేరాము.

చత్రవట నరసింహ
ఇది కూడా దిగువ అహోబిలానికి రెండు కి. మీ. దూరం లో వెళ్ళటానికి అనువుగా ఉంటుంది. గుడి వరకు కార్ లో వెళ్లిపోవచ్చు. ఛత్రం లా ఉన్న వట వృక్షం కింద స్వామి దర్శనం ఇచ్చారు కాబట్టి చత్రవట నరసింహ అయింది. ఇద్దరు గంధర్వులు తమ గానం తో తనని సంతోష పరచినందుకు స్వామి ఆ ఇద్దరికీ దర్శనం ఇచ్చారు. ఎడమ చేయి తాళం వేస్తున్నట్టుగా ఎడమ తొడ మీద, కుడి చేయి అభయ హస్తం తోనూ కూర్చుని ఉండి స్వామి వారు అత్యంత ప్రసన్న వదనం తో, నగుమోము తో దర్శనం ఇస్తారు. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మిగతా ఎనిమిది మూర్తులూ రెండు-రెండున్నర అడుగులు మించవు. ఈ మూర్తి మూడు అడుగులు మించిన ఎత్తుతో అన్నిటికంటే పెద్దదిగా ఉంటుంది.
ఇక్కడితో నవ నరసింహ యాత్ర పూర్తి అయింది. మన దేశం లో ఇంతకంటే అందమయిన ప్రదేశాలూ, ఇంకా గొప్ప పుణ్యక్షేత్రాలూ ఉండచ్చు.(పుణ్య క్షేత్రాలకి కూడా grades ఉంటాయా?!) . కానీ నాకు అహోబిలం ఎప్పటికి ప్రత్యేకమయినది..ప్రియమయినది.. అందరిని శ్రీ లక్ష్మీనరసింహుడు దీవించు గాక.
నేను గమనించిన కొన్ని విషయాలు:-
- అహోబిలం చూడటానికి రెండు రోజులు ఉంటే బాగుంటుంది. AP టూరిజం వాళ్ళ గెస్ట్ హౌస్ లో రూమ్స్ online లో బుక్ చేసుకోవచ్చు. ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి.
-అక్టోబర్ నుంచి జనవరి వరకు యాత్ర కి మంచి సమయం. వారాంతపు సెలవులు, పండగ సెలవుల్లో కాకుండా వారం మధ్యలో వెళ్తే గుడి, అడవి అంతా మనదే..ఎవ్వరూ వుండరు. వీకెండ్స్ లో కూడా మిగతా ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ మందే ఉంటారని చెప్పచ్చు.
-ఇక్కడ హోటల్స్, restaurants మంచివి ఏవి వుండవు. ఒక కన్నడ మధ్వ బ్రాహ్మణ నడుపుతున్న చిన్న హోటల్ (4 టేబుల్స్ ఉంటాయి అంతే) మాత్రం బాగుంటుంది. సింపుల్ భోజనం, పొద్దున్న సింపుల్ బ్రేక్ఫాస్ట్, రాత్రి ఫలహారం మాత్రమే ఉంటుంది. కాని చాలా రుచిగా ఉంటాయి.
-జ్వరం, తలనొప్పి , వాంతులు, మొదలయినవాటికి మందులు దగ్గర పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మందుల దుకాణం ఒక్కటే ఉంటుంది..అది లేట్ గా తెరుస్తారు, అన్ని మందులు దొరకవు. RMP డాక్టర్ మాత్రమే వున్నారుట.
-ఇది (దిగువ అహోబిలం) చాలా చిన్న ఊరు. పరిశుభ్రంగా ఉండదు. వూళ్ళో ఎక్కడ చూసినా పందులు షికార్లు చేస్తూ ఉంటాయి. వర్షాలు పడితే చెప్పక్కర్లేదు. సరిగా చూసుకుని నడవక పోతే రోడ్ మీద మన అడుగు 'ఎక్కడ' పడుతుందో తెలీదు. మరి ఊరి పంచాయితీ/మున్సిపాలిటీ/MLA ఏమి చేస్తున్నారో తెలీదు. మిగతా చిన్న/పల్లెటూళ్లలో ఏమి చేస్తున్నారో ఇక్కడా 'అదే' చేస్తూ ఉండి వుంటారు.
-దిగువ అహోబిలం దాటి ఎగువ అహోబిలం నుంచి ఆ పైన ఇంకా అంతా స్వర్గమే. దిగువ అహోబిలం చాలా డెవలప్ అవ్వాలి. కాని పైన అహోబిలం మాత్రం అలా వదిలేస్తేనే ఆ పవిత్రత, ప్రశాంతత, ఆ వన సౌందర్యం అలా నిలిచివుంటాయనిపిస్తుంది. ఎందుకంటే development తో పాటే నానా రకాల కాలుష్యాలు మొదలవుతాయి.
-పైకి ఎక్కేటప్పుడు మంచినీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. పైన ఏమీ వుండవు. చిన్నపిల్లలు ఉంటే biscuits లాంటివి పెట్టుకుంటే, అది కూడా ఎక్కువ weight లేకుండా, మంచిది.
-షూస్ (socks వేసుకోకపోటమే మంచిది..ఎందుకంటే చిన్న కాలువలు వచ్చినప్పుడు తడిసిపోతాయి, తర్వాత ప్రతి గుడిలో socks వేయటం,తీయటం చాలా అసౌకర్యం) కాకపోయినా స్పోర్ట్స్ సాండల్స్ అయినా సరిపోతాయి. చాలామంది మామూలు చెప్పులతో కూడా ఎక్కేస్తున్నారు. కొంతమంది హీల్స్ తో కూడా..వాళ్లకి hatsoff . కొంతమంది నిష్టాపరులు (ఎక్కువగా తమిళ వైష్ణవులు) అసలు చెప్పులు లేకుండా, మగవాళ్ళు పంచ గోచిపోసి కట్టి ఎక్కుతున్నారు.
-ఫోటోలు తీసుకోటానికి సెల్ కంటే కెమెరా సౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే సెల్ మాటిమాటిక్కీ జేబు/బాగ్ లోంచి తియ్యటం విసుగ్గా అనిపిస్తుంది. అదే కెమెరా అయితే మెడలో వేస్కొవచ్చు. సెల్ కూడా మెడలో  వేసుకునే వీలుంటే పర్వాలేదు. చేత్తో ఏదయినా పట్టుకుని ఎక్కటం కుదరదు. backpack సులువు .
-పొద్దున్నే పైకి బయలుదేరితే భోజనం టైం కి ఎగువ అహోబిలం మెట్లు దిగిన తర్వాత అక్కడ ఉన్నబ్రాహ్మణ అన్నదానం సత్రంలో భోజనం చేయచ్చు.
                                            ***శ్రీ కృష్ణార్పణమస్తు***

Tuesday, June 20, 2017

the Truth :P



How to flatter a woman:

Praise her looks
(Works 80%)

Praise her children
(Works 100%)

😝

Friday, June 2, 2017

లలిత సంగీతం ..మరుగున పడిన జ్ఞాపకం..

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు ఎనభయిల్లో పొద్దున్న 7 . 15  కి లలిత సంగీత శిక్షణ కార్యక్రమం ప్రసారం చేసేవారు. ఇప్పుడు కూడా చేస్తున్నారేమో మరి తెలీదు. గురువు ఎదురుగా కూర్చుని చెప్తున్నట్టే నేర్చుకోటానికి ఎంతో సులువుగా ఉండేది.
అప్పట్లో ఆ ప్రోగ్రామ్మ్ ద్వారా నేను కూడా కొన్ని పాటలు నేర్చుకుని ఏదో వచ్చిరాక  ..నాకు తోచినట్టుగా ఫామిలీ gatherings లో పాడుతూ ఉండేదాన్ని. నేను నేర్చుకున్న పాటల్లో గుర్తున్నవి కొన్ని..

ఒదిగిన మనసున (దేవులపల్లి), అద్దమే చూసితినా (దాశరధి అనుకుంటా ) అలికిడైతే చాలు (దేవులపల్లి ) నిన్ను పిలిచాను (కరుణ శ్రీ ?) ఏ ఊహ వేసిన బొమ్మలో (దేవులపల్లి) మురళిధరా నిను గానక

సంగీతం ఎవరు కూర్చారో గుర్తుంచుకోవాలన్న జ్ఞానం అప్పట్లో లేకపోయింది.

తరువాత దూరదర్శన్ వారు కూడా లలిత సంగీతం ప్రసారం చేసేవారు. అందులో రెండు పాటలు నేర్చుకున్నాను. పూవులేరి తేవే చెలి పోవలె కోవెలకు..(దేవులపల్లి). ఈ పాట ద్వారం లక్ష్మి పాడారు. ఆ పాటలాగే ఆమె కూడా వాలు కళ్ళతో, ముద్ద మందారం లా..చిరునవ్వుతో ఎంతో అందం గా ఉండేవారు. ఇప్పుడు ఆమె గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసురాలు. తర్వాత రెల్లు పూలా పాన్పు పైనా ..ఈ పాట కూడా దేవులపల్లి వారిదే..కాని ఎవరు పాడారో గుర్తులేదు..ద్వారం లక్ష్మి గారా లేక ఇంకెవరైనానా..

కొన్ని పాటలు మన జీవితాలలో మరిచిపోలేని తీపి గుర్తులుగా, సంఘటనలుగా ఉండిపోతాయి. ఒక్కో పాట  ఒక్కో అనుభూతిగా మిగిలిపోతాయి.

అలాంటి జ్ఞాపకాల్లో నా మనసుకి ఎంతో స్వాంతన గా అనిపించే ఒక జ్ఞాపకం..
మా అత్త (గారు) పూవులేరి తేవే ..పాట సాహిత్యం అంటే చాలా ఇష్టపడేవారు. ఆ పాటని తరచూ నాతో పాడించుకుంటూ వుండే వారు. దానికి సింబాలిక్ గా ..తన గుర్తుగా తన వెండి పూలసజ్జని  నాకు బహుమతి గా ఇచ్చారు.

చాలా వరకూ ప్రతి ఒక్కరికి ఇలానే ఏవో పాటలతో ముడిపడిన మధుర జ్ఞాపకాలు వుంటాయేమో!!

Sunday, April 9, 2017

వంటింట్లో జాత్యహంకారం ...

వంటింట్లో గిన్నెలు  కూడా racism కి, body shaming కి గురికాక తప్పట్లేదు పాపం..గుండు గిన్నె, బుంగ గిన్నె, గొట్టం గిన్నె, తెల్ల (సిల్వర్ ) గిన్నె, నల్ల బాళీ (ఏళ్ళ తరబడి వాడీ వాడీ మాడీ మాడీ ) నల్ల పెనం (cast iron ), ఇలా..ఒక్కో ఇంట్లో ఒక్కో రకంగా..

Monday, February 20, 2017

మార్పు... మంచిదే..

వయసు మీద పడేకొద్దీ వచ్చే పరిణామాలలో కొన్ని..

వయసులో వున్నప్పుడు ఝామ్ ఝామ్ అంటూ చేసిన రోజువారీ  పనులు  ఇప్పుడు చేస్తుంటే పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తాయి...

చిన్న చిన్న ఆనందాలు కూడా ఇప్పుడు గొప్ప సంతోషాన్నిస్తాయి..

అప్పట్లో కంటికి ఆనని 'చిన్న మనుషులు'  ఇప్పుడు  కనిపించి, గుర్తింపబడతారు.


సర్దుబాటు :  చివరి పాయింట్ అందరికీ వర్తించదు..(వర్తించినవారు గుర్తించవద్దని మనవి)

Tuesday, February 14, 2017

My Siblings

That awesome moment when you realize that your kids have become your siblings..your kids filling that void in your life.
That happy moment when you realize they are supporting you without judging, loving you, making jokes on you, playing pranks on you, fighting with you, arguing with you, just chilling with you, surprising you with lovely gifts, asking for your advise, sharing their views, sharing their secrets ...the list goes on .. just like a sibling.
Being a single child is actually a tough thing. Every one thinks, as a single child you are a pampered brat. But the truth is they are the most accommodating. They know the value of sharing because they know that painful feeling of left alone..when every one supports their siblings ( which is very natural of course) they feel lost with no one is there with them..feeling lonely in family gatherings. (Not that every single child face these things). So they learn to love each and everyone around them equally without any partiality. They are compassionate.
They know the actual meaning of sharing and loving.
Dedicated to all those born single.