Saturday, September 19, 2009

తీరం లేని సముద్రం

దూరం గా వుంటే దూరం గా వున్నావనే బాధ
దగ్గరకొస్తే మళ్ళీ దూరమయిపోతావనే భయం
మాట్లాడకపోతే మాట్లాడలేదనే దిగులు
మాట్లాడితే మాటలు అయిపోతాయేమోననే బెంగ
మాటలెందుకు ...మనసే మోహనరాగం అంటావా..?
కనురెప్ప మూద్దామంటే నీ రూపం కనుమరుగవుతుందేమో
తెరుద్దామంటే రెప్పల మాటు నుంచీ జారిపోతావేమో
కంటిపాపవే నువ్వు అయినప్పుడు..రెప్పలతో పనేముంది అంటావా..?
కలలో అయినా చూద్దామంటే
కల కరిగిపోయి ...కలగానే మిగిలిపోతావేమో ..
కలలూ...కల్లలూ ఎందుకు..మనసుతోనే చూడు ..అంటావా ?
కల్లోల సముద్రం లో గడ్డిపరక లాంటి ఆశని పట్టుకుని
లేని తీరం కోసం ..గమ్యం లేని ప్రయాణం.

Monday, September 7, 2009

రాలిన ఆశ

వేసవి మల్లె వాడిపోయింది
వానకారు మబ్బు నీరయింది
శరత్ చంద్రిక మసకేసింది
హేమంత తుషారం ఆవిరయ్యింది
వసంత కోయిల మూగపోయింది
శిశిరమే నీ తోడయ్యింది.

చిలకమ్మ కన్నులు

నిన్న రాత్రి కురిసిన కన్నీటి చెలమలలో తామరరేకులయ్యాయి
మధ్యాహ్న మంకేన్నలయ్యాయి
రేయి తాకని చెంగలువలయ్యాయి
చివరికి
కన్నీటి వరదలయ్యాయి.

పుట్టినరోజు పాపాయి..!!

ఈ రోజు నా ముద్దబంతి మొదటి పుట్టినరోజు!!!
ఏడాది క్రితం ఏదేదో..ఏమేమో..రాసెయ్యాలీ అనుకుంటూ మొదలుపెట్టాను. కానీ అనుకున్నట్టుగా రాయలేకపోయానేమో..మొదట్లో , నిజం చెప్పాలంటే, అందరూ ఆహా..ఓహో..అనాలి అనుకునే రాసేదాన్ని..కానీ తర్వాతర్వాత నాకోసమే రాస్కున్నాను..ఏవేవో భావాలూ వచ్చేవి. తర్వాత అర్ధమైంది..మనలో వుండే కొన్ని భావోద్వేగాల్ని అన్దరికీ చెప్పలేమని..ఒక్కోసారి అసలు ఎవ్వరికీ చెప్పలేమనీ..కొన్ని తలుపులు ఎవ్వరికీ తెరవలేము..!!
నేను రాసిన గడ్డిపూలల్లాంటి రాతలకే కొంత మంది గొప్ప గొప్ప బ్లాగర్ లు వాళ్ల వాళ్ల కామెంట్స్ తో నన్ను ప్రోత్సహించారు . వారన్దరికీ నా హ్రిదయపూర్వక కృతజ్ఞతలు..!!

Sunday, July 26, 2009

నీ తలపులు..

నిన్ను తలుచుకోగానే..
నా పెదవులపై నవ్వు..సంతోషం తో..
నా కళ్ళల్లో నీళ్లు..ఆర్ద్రతతో..
నా మనసంతా తడిసిపోతుంది ప్రేమతో..
అందమైన నా తోటలో వింత పరిమళం నువ్వు.

Tuesday, February 3, 2009

దొరుకుతుందా?

మనసు..సీతాకోక చిలుక లా ఎగురుతోంది..ఆనందం ఎక్కడుందా అని..
వెతుకుతోంది..సంతోషం ఎక్కడ దొరుకుతుందా అని..
పూల పరిమళం లో వెతికింది..
వాడిపోయే పూలతో పాటూ పరిమళం కూడా వీడి పోయింది..
రంగుల హరివిల్లు ఫై వాలింది..
వానతో పాటూ రంగులు కూడా వెలిసి పోయాయి..
చిరు జల్లులు కురిపించే మేఘమాల ని అడిగింది..
ఏదీ చెప్పకుండానే మబ్బు నీరైంది..
అన్నిటిలో చూసింది..అంతటా వెతికింది..ఎక్కడా దొరకలేదు..
ఆనందం..
చివరికి ..తనలోనే..తన మనసు లోపలే కనిపించింది..
సంతోషం..విచారం..అన్నీ తన లోలోపలే వున్నాయని అనుకుంది..
ఐనా..
ఏదో కావాలని ఆరాటం..దేనికోసమో పోరాటం..
దేనికోసమో ఆతృత..దొరకలేదని నిస్పృహ..