Monday, May 11, 2020

తుఫాను పెళ్లి - మచిలీపట్టణం10 May 1990

8 May

అప్పటికి 2,3 రోజుల నుంచీ కొద్దిగా ముసురు పట్టింది. ఆరోజు కొంచెం వర్షం ఎక్కువయ్యింది.
దగ్గరి బంధువులు కొంతమంది వచ్చి ఉన్నారు. మర్నాడు పొద్దున్న కళ్యాణమండపానికి వెళ్ళాలి. ఆరోజు రాత్రి వైజాగ్ లో మగ పెళ్ళివారు ట్రైన్ లో బయలుదేరుతున్నారు. మర్నాడు పొద్దున్నకి గుడివాడలో దిగుతారు. అక్కడినుంచీ బందరుకి పెళ్ళివారిని తీసుకు రావటానికి RTCబస్ మాట్లాడాము.  కళ్యాణ మండపానికి తీసుకు వెళ్లాల్సిన సామానంతా సద్దుతున్నారు. అప్పటికి మా ఇంట్లో ఫోన్ కనెక్షన్ లేదు.
మా ఇంటికి 4km దూరంలో అమ్మ cousin  ఉండేవారు. రాత్రి పొద్దుపోయింది. వర్షం బాగా పడుతోంది. ఆ వర్షంలో అమ్మ cousin వచ్చి మగ పెళ్ళివారు నుంచీ ఫోన్ వచ్చిందని చెప్పారు..తుఫాను కారణంగా ట్రైన్ గుడివాడ కాకుండా బెజవాడకి divert చేస్తున్నారుట. బుక్ చేసిన బస్ వేస్ట్ అయిపోయింది. బెజవాడ కి బస్ బుక్ చేసే టైం లేదు. మర్నాడు పొద్దున్న మా కక్క (నాన్నగారి చిన్న తమ్ముడు) బెజవాడ వెళ్లి అక్కడ 4, 5 టాక్సీ లు మాట్లాడి పెళ్ళివారిని తీసుకు వచ్చేలా ప్లాన్ చేశారు.

9 May
వర్షం సన్నగా పడుతూనే ఉంది. అందరం కళ్యాణమండపానికి రిక్షాల్లో బయలుదేరాము. కక్క బెజవాడ వెళ్లారు. మొత్తానికి పొద్దున్న10 గంటలకు పెళ్ళివారు వచ్చారు. వర్షం పెద్దది అయింది. గాలి కూడా మొదలయింది. వచ్చే దారిలో చెట్లు పడిపోయి ఉన్నాయని చెప్పారు. ఎదుర్కోలు కార్యక్రమం, అల్పాహారం కార్యక్రమం అవగానే  ఇద్దర్నీ పెళ్ళికొడుకు, పెళ్లికూతురు చేశారు. స్నానాలు, పలకరింపులు, నవ్వులతో భోజనాల కార్యక్రమం కూడా అయిపోయింది. 3, 4 గంటలకి పరిస్థితి అర్ధమయింది. భయం, టెన్షన్ మొదలయ్యాయి. సాయంత్రం వరపూజ, ప్రదానం ఉన్నాయి. అవేవీ జరిగే పరిస్థితి లేదని అర్ధం అయిపోయింది.
వంటాయన అలానే రాత్రి బిస్రూటా భోజనం తయారు చేశారు. రాత్రి 7 దాటిన దగ్గరినుంచీ తుఫాను తన విశ్వరూపం చూపించటం మొదలయింది. కరెంట్ పోయింది. జనరేటర్ ఉంది కానీ అది వేసే మనిషి లేడు. వంటాయన పెళ్లి కోసం తెచ్చిన పాలికల్లో నూనె పోసి బట్టని ఒత్తిగా చేసి పెళ్లి మండపం చీకటిలో లేకుండా చూశారు. అందరం ఆ దీపం చుట్టూ చేరి భోజనాలు అయ్యాయి అనిపించాము.
నెమ్మదిగా కళ్యాణమండపం గదులలోకి నీళ్లు రావటం మొదలయింది. అందరం గబ గబా ఇనుప మడత కుర్చీల మీదకి పెళ్లి సామాను అంతా ఎక్కించాము.
హాల్ లో పైన ventilators, కిటికీలకి ఉన్న అద్దాలు (మూసిఉన్నవే)గాలికి భళ్ళున పగలటం మొదలయ్యింది. హాలంతా గాజుపెంకుల వర్షం. అందరం బిక్కు బిక్కు మంటూ హాల్ మధ్యలోకి చేరాము. కొంతమంది కుర్చీలు వరసగా వేసుకుని, కొంతమంది కింద పడుకుని..ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టుగా గడిపాము. ఆ రాత్రి లైటింగ్ కోసం చేసిన decoration  అంతా ఎప్పుడో కొట్టుకుపోయింది. ఇంకా రావాల్సిన బంధువులు అంతకు ముందురోజే ప్రయాణం క్యాన్సల్ చేసుకున్నారు..టీవీ లో వార్తలు చూసి. మా వాళ్లలో అంతకు ముందెప్పుడూ జీవితంలో తుఫానుని చూడని వాళ్ళు ప్రకృతి బీభత్సం, అది చేసిన విలయతాండవం కళ్లారా చూశారు.
ఆడపిల్ల తల్లిదండ్రులు గా మా అమ్మ నాన్నలు పడే టెన్షన్ చెప్పేదేముంది. మా పురోహితులు, (నా స్నేహితురాలి తండ్రి) శ్రీ లంకా సత్యనారాయణ గారు వాళ్ళకి ధైర్యం చెప్పారు..'బెంగ పడకండి. ఎట్టి పరిస్థితుల్లో నూ పెళ్లి ఆగదు, నేను పెట్టిన ముహూర్తబలం అలాంటిది' అని సముదాయించారు. ఆ కాళరాత్రి ఎప్పుడు గడుస్తుందా, తుఫాను ఎప్పుడు శాంతిస్తుందా అని అందరం దేముడిని ప్రార్ధిస్తూ గడిపాము.

10 May
అతి నెమ్మదిగా తెల్లారింది. బైట తుఫాను వదిలి వెళ్లిన బీభత్స దృశ్యాలు..చుట్టూ మొలలోతు నీటిలో ..ద్వీపంలా ఉన్న కళ్యాణమండపం. రాత్రి హాల్ లో  పడిన గాజు పెంకులన్నీ బక్కెట్లలోకి ఎత్తిపోశారు పనివారు. రాత్రి కురిసిన గాజు పెంకుల వర్షంలో గాజు ముక్క ఒకటి వచ్చి వంటాయన చేతికి తగిలి పెద్ద గాయం అయింది. పాపం ఆయన ..ఏం పర్లేదు ..అని తనే, కండువాతో కట్టు కట్టేసుకుని అలానే పనిలోకి దిగిపోయాడు. ఇంకా ఎన్నెన్నో ఇబ్బందులు. పొద్దున్న కోసం రావాల్సిన పాలు రాత్రి తుఫానులో కొట్టుకుపోయాయి. పాలు ప్యాకెట్స్ తట్టలో పెట్టుకుని తెస్తుంటే ఏకంగా తట్ట ఎగిరిపోయిందిట. అతను కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్లి తలదాచుకున్నాడుట పాపం.  వంటాయన ముందు చూపుతో పాల పొడి cans తెచ్చిపెట్టుకోటం కొంతవరకు సరిపోయాయి. కొంతమంది బ్లాక్ కాఫీ, టీ తాగారు. వాతావరణం మాత్రం తుఫాను చాయలేవీ లేకుండా ప్రశాంతంగా అయిపోయింది. కొద్దిగా ఎండ కూడా వచ్చింది. రెండు రోజుల్లో తీరికగా అవుతాయనుకున్న పెళ్లి కార్యక్రమాలు ఒక్క రోజులో అవగొట్టాలి. గబ గబా మంగళ స్నానాలతో మొదలై కులదేవత, స్నాతకం, వరపూజ, ప్రదానం, కాశీ యాత్ర చక చకా అయిపోయాయి. మా ఇంకో కక్క లారీ, బస్, ట్రాక్టర్..ఇలా ఇన్ని వాహనాలు ఎక్కి కష్టపడి ముహూర్తం సమయానికి వచ్చారు. సాయంత్రం గౌరీపూజ, పెళ్లి. ఊళ్ళో పెళ్లికి పిలిచిన స్నేహితులు, బంధువులు.. వారెవ్వరూ రాలేని పరిస్థితి. కాకపోతే నాన్నగారిది పెద్ద కుటుంబం,  నా (మేన)అత్త గారి ఫామిలీ కూడా పెద్దది అవటం వలన ఉన్న వాళ్ళతోనే చాలా సందడిగా, చాలా సంతోషంగా జరిగింది పెళ్లి. మా దొడ్డప్పలు, దొడ్డమ్మలు, కక్కలు, కక్కిలు ఎంతో అండగా నిలబడ్డారు. నా cousins అందరూ నాకు తోబుట్టువులు లేని లోటు తెలీకుండా ప్రేమగా నా పక్కనే ఉండి పెళ్లి జరిపించారు.
ముందు అనుకున్న ప్రకారం మర్నాడు పొద్దున్న అందరం మా ఇంటికి వెళ్లి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. కానీ రోడ్లు ఇంకా మోకాలి లోతు నీళ్లలో మునిగి ఉండటం, రిక్షాలు లేకపోటం, ఇంటి దగ్గర కూడా అల్లకల్లోలంగా ఉండటంతో మర్నాడు కూడా కళ్యాణ మండపం లోనే వ్రతం , భోజనాలు కానిచ్చి వెళదామనుకున్నాము.

11 May
పొద్దున్నే కబురు..కళ్యాణమంటపాన్ని తుఫాను బాధితులకు వసతి చెయ్యాలని కలెక్టర్ గారి ఆదేశం. వీలయినంత త్వరగా ఖాళీ చేయమని చెప్పారు. అప్పుడే తుఫాను బాధితుల కోసం వంటలు కూడా మొదలు పెట్టేశారు. ఈ లోగా బెజవాడ వరకు కొన్ని బస్సులు వెళ్తున్నాయని తెలిసింది. హైదరాబాద్ నుంచీ వచ్చిన బంధువులు, వైజాగ్ నుంచీ వచ్చిన మగ పెళ్ళివారు పాపం అలానే నీళ్లలోనే బస్ స్టాప్ కి వెళ్లిపోయారు. అందరికీ విజయవాడ నుంచీ ట్రైన్స్ రిజర్వేషన్ అయింది మరి.
ఇక్కడ మా చేత వ్రతం అయిందనిపించేశారు.
అప్పటికే జనాలు ఒక్కసారిగా రావటం, పాపం ఆకలి మీద ఉన్న వాళ్ళని ముందు భోజనాల హాల్ లోకి తీసుకువెళ్లారు. మెయిన్ హాల్ లోకి వాళ్ళొచ్చే లోగా మేము బైట పడ్డాము. సగం చక్రాలు మునిగిన రిక్షాల్లో నెమ్మదిగా ఇంటికొచ్చాము. కరెంట్ రావటానికి 10 రోజులు పట్టింది. 'most memorable marriage' గా అందరికీ ఇప్పటికీ గుర్తుండిపోయింది.
ముహూర్తబలం అంటే ఇదేనేమో! ఆ ముహూర్తానికి అవ్వాల్సిన పెళ్లిళ్లు కొన్ని ఆగిపోయాయనీ, కొన్ని బస్ స్టాండుల్లో కూడా పెళ్లిళ్ళు చేశారని తర్వాత  అందరూ అనుకుంటుంటే తెలిసింది.
అన్నిటికంటే చెప్పుకోవాల్సింది మా ఆఖరి ఆడపడుచు నిండు చూలాలు. రిస్క్ తీసుకుని తమ్ముడి పెళ్లికి వచ్చింది. తిరిగి వెళ్లేప్పుడు విజయవాడ స్టేషన్లో ఒక్కసారి వచ్చి పడిన జన ప్రవాహం లో తనని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించటానికి తన చుట్టూ ఒక వలయంలా అందరూ నుంచుని తీసుకు వెళ్లారుట. Reservation ఉన్నా జనాలు ఎక్కేయటంతో తన బెర్త్ ఒక్కటీ ప్రొటెక్ట్ చేశారు. ట్రాక్స్ దెబ్బతిన్నాయని ట్రైన్స్ రాజమండ్రి లో ఆపేశారు. మళ్లీ రైళ్లు నడవటం మొదలయ్యేదాకా అందరూ రాజమండ్రి లో ఉన్న కొంతమంది బంధువుల ఇళ్లల్లో 2,3 రోజులు గడపాల్సి వచ్చింది. వైజాగ్ స్టేషన్ నుంచీ  సరాసరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు ఆడపడుచును. దేముడి దయవలన అంతా శుభమే జరిగింది.
మొత్తానికి  మే10 1990 నాడు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక వింత పరిస్థితి. 30 ఏళ్ల తర్వాత ఈరోజు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే  ఇదో వింత పరిస్థితి...లాక్ డౌన్.

10 comments:

నీహారిక said...

బిస్రూటా భోజనం అంటే ఏమిటండీ ?

విన్నకోట నరసింహా రావు said...

వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు 🌹🌹🌼.

నీహారిక said...

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు !

sarma said...

చిన్నప్పుడు తలంటులో నలుగు పిండి తింటే పెళ్ళినాడు వర్షం వస్తుంది లే అనేవారు పెద్దాళ్ళు. మీ జాయ పతి సున్నిపిండి బొక్కి నట్టున్నారు అందుకే తుఫానొచ్చింది. :) Take it easy :)
Wish you many happy returns of the day

lakshmi ramarao vedurumudi said...

Thank you శర్మ గారూ. జాయ అంటే అర్ధం తెలీలేదు ముందు. డిక్షనరీ లో చూసి తెలుసుకున్నాను. ఇంకోటి కూడా అంటూ ఉండేవారు, ఆడపిల్లలు బియ్యం ఏరేటప్పుడు బియ్యం తింటే పెళ్లినాడు వర్షం పడుతుందని. మీరు చెప్పిన సామెత ప్రకారం ఇద్దరి వలనా రావచ్చు అన్నమాట..బాలన్స్ అయిపోయింది.

lakshmi ramarao vedurumudi said...

Thank you నీహారిక గారూ. బిస్లూటా (బిస్రూటా కాదు పొరపాటు రాశాను) అనేది కన్నడ పదం. బిసి-వేడి, ఊట-భోజనం. వాడుకలో క్రమంగా బిస్లూటా గా మారిపోయింది.
పెళ్లి ముందు రోజు సాయంత్రం ప్రదానం అని చేస్తారు. ఒక రకంగా నిశ్చితార్థం. ఆ రాత్రి భోజనంలోకి అన్నీ తెల్లగా ఉండే పదార్ధాలే వండుతారు. Dress code కూడా ఉంటుంది. ఆడవాళ్లు, మగవాళ్ళు అందరూ తెల్లబట్టలే వేసుకుంటారు. అదొక వేడుక.
అవటానికి అది కన్నడ పదమే అయినా తెలుగు మాధ్వ పెళ్లిళ్లలోకి ఈ పద్ధతి ఎలా వచ్చిందో తెలీదు.

lakshmi ramarao vedurumudi said...

ధన్యవాదాలు నరసింహారావు గారు. 🙏

విన్నకోట నరసింహా రావు said...

// “ అవటానికి అది కన్నడ పదమే అయినా” //

మధ్వాచార్యుల వారు కన్నడ దేశస్థులు కదండీ (ఉడిపి). భారతదేశంలో విస్త్రుతంగా పర్యటించారు కూడా. మరి వారి ద్వైత మత విస్తరణ ప్రభావాన కొన్ని కొన్ని కన్నడ భాషా పదాలు కూడా తెలుగుదేశంతో సహా ఇతర ప్రాంత మధ్వులకు అలవడుంటాయి, శ్రీవైష్ణవులకు తమిళ ప్రభావం లాగా ... అని నా అంచనా సుమండీ లక్ష్మీ రామారావు గారూ.
——————————
మొత్తానికి మీ “తుఫాను పెళ్లి” మా డిగ్రీ కోర్సు ఆఖరి సంవత్సరాంతాన జరిగిన తుఫాను ప్రాక్టికల్స్ పరీక్షలను గుర్తుకు తెచ్చింది 🙂.

lakshmi ramarao vedurumudi said...

అయిఉండచ్చు అండీ..ఇంకో prejudice కూడా ఉంది..తెలుగు మాధ్వులు కంటే కన్నడ మాధ్వు లే అసలైన, స్వచ్ఛమైన మాధ్వులు అని. ��. ఏమిటో..

విన్నకోట నరసింహా రావు said...

కన్నడ దేశంలో పుట్టింది కదండీ, కాబట్టి వారికి ఆ మాత్రం superiority complex ఉండడం మానవనైజం కదా.