Monday, September 7, 2026

ఒంటరి

కళ్లెదురుగా తల్లిదండ్రులు లేవలేని స్థితిని చూస్తూ, ఆ భావోద్వేగపు భారాన్ని పంచుకునే అన్న/తమ్ముడు/అక్క/చెల్లి లేక మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నప్పుడు 

తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో


అమ్మా నాన్నలిద్దరూ దూరమై

వారికి నువ్వొక్కటే సంతానమైనప్పుడు

తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో


ఏమ్మా/ఏరా.. కులాసానా.. తిన్నావా..ఏంచేస్తున్నావు అంటూ ఆత్మీయంగా కుశలమడిగే తోబుట్టులు లేనప్పుడు 

తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో


ఏ భేషజాలూ, ఎలాంటి అహాలూ 

లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడే తోబుట్టులు లేనప్పుడు

తెలుస్తుంది.. ఒంటరితనమేమిటో


ఎలాంటి సంకోచాలూ లేకుండా 

ఉబుసుపోని పిచ్చాపాటి కబుర్లు, పరాచికాలాడటానికి తోబుట్టులు లేనప్పుడు

తెలుస్తుంది..ఒంటరితనమేమిటో


'మా తర్వాత నువ్వు ఎలా' అన్న

అమ్మ బెంగ లోని అంతరార్ధం

అర్ధం ఐనప్పుడు

తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో


'అమ్మ అలా కోప్పడేది, నాన్న ఇలా ముద్దు చేసేవారు..అమ్మ ఆ వంట ఎంత బాగా చేసేదో.. నాన్న ఎంత కష్టపడేవారో'.. తోబుట్టులు మాత్రమే ఎరిగిన అమ్మానాన్నల తో ముడిపడిన జ్ఞాపకాలను పంచుకోడానికి ఎవరూ లేనప్పుడు

తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో


చిన్నతనపు చేష్టలు, ఆటలు, అమ్మానాన్నలతో గడిపిన క్షణాలు

తలచుకోవడానికి,  మరచిపోయినవి గుర్తు చేసేవారు ఎవరూ లేనప్పుడు,

ఆ జ్ఞాపకాలన్నీ నీలోనే అణిచిపెట్టుకుంటున్నప్పుడు   

తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో


తోబుట్టులు మాత్రమే కలిసి పంచుకోగల  అమ్మానాన్నల ఎడబాటు భారపు తీవ్రతని పంచుకునేందుకు ఎవరూ లేనప్పుడు

తెలుస్తుంది..ఒంటరితనమేమిటో


నీలోని లోటుపాట్లని ఎత్తి చూపకుండా

నిష్కల్మషంగా మాట్లాడి, సలహాలిచ్చే

తోబుట్టులు లేనప్పుడు 

తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో


కడుపున పుట్టినవారు తప్ప

నీకంటూ ప్రత్యక్ష రక్త సంబంధం ఇంకెవరూ  లేనప్పుడు,

నీకంటూ అండ, దన్ను లేనప్పుడు

తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో

 

( ఒంటరితనానికి చాలా కారణాలు ఉండచ్చు.  అందులో ఇదొకటి.   భావోద్వేగాల పరంగా అందరూ రకరకాలుగా ఉండచ్చు. జీవిత భాగస్వామి, పిల్లలు ఎంత emotional support ఇచ్చినా,  తల్లిదండ్రులు దూరమైన ఆ emotional burden తోబుట్టులు మాత్రమే పంచుకోగలరు.    చుట్టాల, స్నేహితుల సహకారం ఎంత ఉన్నా అది కొంతవరకే.)










Monday, July 6, 2026

అమ్మలందరి జోలపాట

అమ్మ నుంచీ వచ్చిన జోలపాట..అమ్మ నాకు పాడిన జోల..నేను నా పిల్లలకి జోకొట్టిన పాట..తరతరాలుగా అమ్మల నోటిపాట..

ల్ల్ ల్ల్ ళ్ల...హాయీ...
హాయి హాయి హాయి ఆపదలూ కాయీ..
చిన్న వాళ్ళను కాయీ శ్రీ వెంకటేశా

వెంకటేశుని కొండా ఎక్కుండావలెనూ
ఎప్పటికీ పుట్టిల్లూ కలిగుండావలెనూ
శ్రీ వెంకటేశయ్యా దిక్కూ నీ వయ్యా
చిన్నారీ పాపలనూ కాపాడావయ్యా

ల్ల్..హాయీ
ల్ల్ ల్ల్ హాయీ..

ఏడవకూ ఏడవకూ వెర్రి నా తల్లీ/తండ్రీ
ఏడిస్తే నీ కళ్ళా నీలాలూ కారే
నీలాలూ కారంగా నే చూడలేనూ 
పాలైనా కారవే బంగారూ కళ్ళా

ల్ల్ ల్ల్ హాయీ

పిల్లి పిల్లి రావే పిల్లలకూ తల్లీ
పిల్లలకూ పాలిచ్చి పల్లెలకూ పోవే
పిల్లెమ్మా కన్నులు బీర పువ్వుల్లూ
అబ్బాయి/అమ్మాయి కన్నుల్లూ కలువరేకుల్లు

ల్ల్ ల్ల్ హాయీ

రామ రామనియేవూ రాము దలచేవూ
రామేమీ కావాలే లక్ష్మణుడా నీకు
సీత సీతనియేవూ సీత దలచేవూ
సీతేమీ కావాలే శ్రీ లక్ష్మణుడా

ల్ల్ ల్ల్ హాయీ

అయోధ్యా రామూడన్న కావలెనూ
వాలు కన్నుల సీతా వదినమ్మా మాకూ

ల్ల్..ల్ల్..హాయీ

అందరీ మామల్లూ చందమామల్లూ
అబ్బాయీ/అమ్మాయి మామల్లూ రామ లక్ష్మణులు

ల్ల్..ల్ల్..హాయీ..

అబ్బా/మ్మాయీ మామల్లూ ఎటువంటీ వారూ
అంచు పంచెల వారూ అంగీలా వారూ
పట్టు పంచెలా వారూ పగడాలా వారూ
చెవి చెవికీ చారేడూ పోగుల్లా వారూ
మిరపకాయలవంటీ మీసాలా వారూ
పెసర కాయలవంటీ పెదిమల్లా వారూ
కంది కాయల వంటీ కనుబొమలా వారూ
వారు మా అబ్బా/మ్మాయి మేన మామల్లూ

ల్ల్..హాయీ..

చిన్నారీ పొన్నారీ చిలుక ఏడవకూ
పొన్నంగీ తొట్టెలో పాప ఏడవకూ

ల్ల్..హాయీ

హాయమ్మా నెవ్వరే కొట్టిన్నా వారూ
కొట్టి గోవుల పాలూ కొనిపోసినారూ
హాయి వారిళ్లకూ పోయి వద్దామా
అరటిపళ్ళ గెలలూ అందుకొద్దామా

ల్ల్..హాయీ
హాయివారిళ్లకూ ఆడుకోబోతే
ఆడెవరో కట్టారు కాళ్ళగజ్జెల్లు

ల్ల ల్ల.. హాయీ..

(Google image)

Saturday, October 4, 2025

అమ్మ

2018 లో మొదటిసారిగా ఎందుకో బతుకమ్మని పెట్టాలనిపించింది.  కొన్నేళ్ల నుంచీ హైదరాబాద్ లో ఉంటున్నా ఎప్పుడూ అలా అనిపించలేదు.  బహుశా నా చెయ్యి పట్టుకుని, రాబోయే పరిస్థితులకు నన్ను సిద్ధం చెయ్యడానికి వచ్చిందేమో ఆ అమ్మ!  అందుకేనేమో హైదరాబాద్ నుంచీ వైజాగ్ కి మారినా నా వెన్నంటే వచ్చింది.  కన్నవాళ్ళు దూరమైన దుఃఖం ప్రతి నిమిషం నిశ్శబ్దంగా కడుపులో మెలిపెడుతుంటే, మాటి మాటికీ ఉబికి వచ్చే కన్నీటిని, ఆ వేదనని, శోకాన్ని పంచుకొనే  తోబుట్టువయింది బతుకమ్మ.  వెళ్లినపని పూర్తి అయినట్టు మళ్ళీ హైదరాబాద్ కి తీసుకొచ్చింది.


అమ్మ దూరమై మూడు నెలలే అవడంతో,  ఈసారి బొమ్మలు పెట్టడానికి మనస్కరించలేదు ముందు.  కానీ  అమ్మకి ఇష్టమైన బొమ్మలకొలువు పెట్టి, కొలువు పెట్టడంలో మెళకువలు నేర్పించిన తనని తలుచుకోవడమే సరైన పని అనిపించింది. నేను బొమ్మలకొలువు పెట్టినప్పుడు, అందరితో కలిసి బతుకమ్మ ఆడేటప్పుడు తన కళ్ళల్లో కనిపించే ఆ తృప్తి, సంతోషాలని తలుచుకోవడం, తన జ్ఞాపకాలని, వేడుకలను కొనసాగించడమే తనకి నేను ఇచ్చే నివాళి!


Sunday, February 16, 2025

Emblems

ఆత్మీయుల మరణం తర్వాత వారు వాడిన వస్తువులలో వారిని తలచుకోవడం ఒక అసంకల్పిత చర్య.  వారు  భోజనం  చేసిన పళ్లెం కావచ్చు, కాఫీ తాగిన గ్లాస్ కావచ్చు, పాటలు, వార్తలు విన్న రేడియో కావచ్చు, రోజూ కూర్చున్న కుర్చీ, వాడిన బట్టలూ ..ఇలా ఏదైనా..
మొదట్లో కొంతకాలం వాటిని చూసినప్పుడల్లా కడుపులో సుళ్ళు తిరుగుతూ మొదలైన దుఃఖం ఉప్పెనలా కళ్లలో నుంచి దుముకుతూ ఉంటుంది.  కాలం గడుస్తున్న కొద్దీ కంటనీరు చెలమల్లాగా ఊరుతూ ఉంటుంది.  ఏదీ శాశ్వతం కాదని తెలిసినా జ్ఞాపకాలలో, వారికి చెందిన వస్తువులలో వారు బ్రతికే ఉన్నట్టు మనసు భ్రమిస్తూనే ఉంటుంది..ప్రియంగా వారిని తలుచుకుంటూనే ఉంటుంది.

ఫిలిప్స్ కంపెనీ కి చెందిన ఈ సైకిల్ మా నాన్నగారు 1950ల్లో కొన్నారుట.  తన చివరి వరకూ చాలా అపురూపంగా చూసుకునే వారు.  తనకి 88, 89 వయసు వరకూ కూడా అప్పుడప్పుడు సరదాగా తొక్కేవారు.  ఎప్పటికప్పుడు తుడవడం, గాలి కొట్టించడం చేసేవారు.  సైకిల్ బిగుసుకు పోకుండా ఉండటానికి వాచ్ మాన్ ని తొక్కమనేవారు.  

ఇప్పటికీ మంచి condition లో ఉంది కానీ తొక్కేవారు ఎవరూ లేరు.  Show piece లాగా తయారు చేద్దామని Cycle మీద ఉన్న company emblems పోకుండా వాటిని ముందు కవర్ చేసి, మొత్తం నల్ల రంగు వేయించాను.  నెట్ లో చూసిన ఐడియా తో చేయించి, బాల్కనీ లో పెట్టాను.

Sunday, February 2, 2025

అదే తత్త్వం

సత్త్వమా.. తత్త్వమా

వితండవాదమే తత్త్వవాదం

తత్త్వాన్వేషణ ని మించిపోయిన రంధ్రాన్వేషణ

పొంతన లేని చింతనలే అన్నీ

Sunday, October 20, 2024

సువర్ణకము

అర్ణవమై 

వివర్ణమై

సంకీర్ణమై

పూర్ణమైన

మదిలోని భావములు

సుపర్ణుని రెక్కల ధాటికి పర్ణికలై 

కీర్ణమైన వర్ణములైనవి కదా!

Thursday, October 17, 2024

బొమ్మలకొలువు 2024

బ్రతుకుని ఒక వేడుకగా జరుపుకొమ్మని చెప్పే 'బతుకమ్మ!'
బొమ్మలకొలువు, బతుకమ్మ పండుగ వైజాగ్ లో నాల్గవ సంవత్సరం..2024.