Wednesday, October 8, 2014

navaneeta balakrishna (part 2)


నవనీత బాలకృష్ణ (part 2)

21-9-2014

వెన్నముద్ద కృష్ణుడిని మరోసారి చూడాలనే కోరిక, చారిత్రక కట్టడాలు చూడాలనే సహజమయిన ఆసక్తి తో , ఆ రోజు చూడలేకపోయిన శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుడిని చూడాలని మరోసారి కొండవీడు బయలుదేరాం .  ఆ రోజు కుంభవృష్టి గా వానపడుతుంటే  .. ఈ రోజు ఎండ చుర్రుమంటోంది .. విజయవాడ వాతావరణం అంటే ఇలాగే వుండాలి మరి!!

ఆలయ పూజారి శ్రీ పరుచూరి సత్యనారాయనాచారి గారికి ఫోన్ చేస్తే.. ప్రస్తుతం పూజలు జరుగుతున్న ఆలయ చరిత్ర గురించి టూకీగా చెప్పారు.  ఆలయ చరిత్ర ఆయన మాటల్లోనే క్లుప్తంగా ...:

శ్రీకృష్ణదేవరాయలు తన విజయ పరంపరలో భాగంగా తను సాధించిన విజయానికి గుర్తుగా కొండవీడు లో విజయ స్థూపాన్ని నిర్మించారు.  తన వంశాభివృద్ధి కోసం అక్కడే వెన్నముద్ద కృష్ణుడి ని ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించారు.  కొంతకాలానికి మహమ్మదీయుల దండయాత్రలో.. ఆలయాలను ధ్వంసం చేస్తుంటే  వారి బారినుంచి కృష్ణుడి మూలవిరాట్ ని రక్షించటానికి  విగ్రహాన్నిఅక్కడి రైతులు  ఒక పొలం లో దాచిపెట్టి పైన ఆకులు అలములతో కప్పేసారుట. అలా చాలా కాలమయిన తర్వాత చిలకలూరిపేట జమిందారు  గారు.. శ్రీ రావుబహద్దూర్ రాజామానూరి వెంకట కృష్ణ రావు గారు తమ జాగిర్దారులో భాగమయిన ఈ ప్రాంతం లో పొలం దున్నిస్తుంటే విగ్రహం బయటపడిందట . దానిని తన వూరు చిలకలూరిపేట కు తీసుకు వెళ్లి అక్కడ ఆలయం కట్టాలనుకున్నారుట .  విగ్రహాన్ని బండి లో పెట్టి దాదాపు 2km దూరం (అంటే ఇప్పుడు ఆలయం వున్న చోటు ) రాగానే ఒకచోట బండి ఆగిపోయిందిట . వేరే బండిలో విగ్రహాన్ని తీసుకు వెళ్లాలనుకున్నా ఆ బండి కూడా విరిగిపోయిందిట .  ఇలా ఎన్ని బండ్లు ప్రయత్నించినా లాభం లేకపోయిందిట .  సరే అని ఆ రాత్రికి అక్కడే విశ్రమించారుట .  ఆ రాత్రి ఆయనకి  స్వప్నం లో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి , తాను ఇక్కడే ఉంటాననీ , ఇక్కడే  తనకి గుడి కట్టించమని చెప్పారుట .  అలా ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందిట .  అప్పటినుంచీ తామే వంశపారంపర్యంగా పూజారులుగా ఉన్నామని ప్రస్తుత పూజారి శ్రీ సత్యనారాయణాచార్ చెప్పారు . ఆలయ చరిత్ర గురించి పుస్తకం ముద్రిస్తున్నట్టు చెప్పారు.  ప్రస్తుతం ఆలయాన్ని ISKON వాళ్ళు అధీనం చేసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.




 .  .
మళ్ళీ మా ప్రయాణం లోకి .. 

గుడి లో కృష్ణుడిని దర్శించుకుని, స్తోత్రాలతో ముద్దులాడి, కృష్ణదేవరాయలవారు కట్టించిన గుడి కి బయలుదేరాం.  సుమారు 2km ప్రయాణం తర్వాత దూరం గా కనిపించింది గుడి.  పంట పొలాల మధ్యలో దూరం నుంచీ ఎంతో అందంగా ఉంది.  'వాచ్ మాన్' కం గైడ్ మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు .  ఏదేదో చెప్తున్నాడు కానీ ఏమీ అర్ధం కాలేదు .  సరే .. ముందుగా రాయలవారి విజయస్థూపం కనిపించింది . గుడి కి ఎదురుగా వుంది అది .  22 అడుగుల ఏకరాతి స్థూపం .  దాని మీద ఏదో శాసనం కూడా చెక్కి వుంది .  తెలుగు లిపి లానే వుంది . 



అక్కడి నుంచీ గుడి ప్రాంగణం లోకి నడిచాం .  లోపల ముందుగా తల నరికివేయబడిన నంది విగ్రహం కనిపించింది .  విష్ణాలయం లో నంది ఉంది ఏంటబ్బా అని ఆశ్చర్యం అనిపించింది .  ప్చ్ .. ఆ కథ ఏంటో మరి !!?? చాలా విశాలమయిన గుడి .... లోపల మండపం కూడా పెద్దదిగా వుంది .  పారాడే కృష్ణుడు, చేప , ఇంకా కొన్ని మూర్తులు చెక్కి వున్నాయి గుడి గోడల మీద.  ఒకచోట ఏదో శాసనం కూడా వుంది తెలుగు లిపి లోనే .  కానీ స్పష్టం గా లెదు.  గర్భగుడి చీకటి మయం .  అసలు ఏమాత్రం వెలుతురు లేదు .  పైగా భరించలేని దుర్గంధం .  ఒక్క నిమిషం కూడా వుండలేకపోయాం లొపల.  ఒకప్పుడు ఈ గుడి లోకృష్ణుడికి  వైభవంగా పూజలు జరిగేవి అని ఊహించుకుంటే ఎంతో అద్భుతంగా ... ఇప్పటి స్థితి ని చూసి అంతకంటే బాధగా అనిపించింది .  ఏ  చారిత్రిక   కట్టడం చూసినా ... అది గుడి అయినా కావచ్చు ,  కోట అయినా కావచ్చు , ఇంకేదయినా కావచ్చు ... ఏదో తెలీని సంతోషం ,ఆశ్చర్యం ,  ఉద్వేగం, విషాదం అన్ని భావాలూ ఒకేసారి వస్తాయి ఎందుకో .!!  










గుడి కి ఎదురుగా వున్న కొండమీద కోట కనిపిస్తోంది .  అదే కొండవీటి కోట ట.  అక్కడ సినిమా షూటింగులు కూడా జరిగాయని చాలా ఉత్సాహంగా చెప్పాడు watchman కం గైడ్ !! ఎక్కాలనిపించింది కానీ దానికి తగ్గ preparation తో రాలేదు .  



అన్నట్టు ఇంతకీ  కత్తుల బావి అంటే ఏంటో ... దాని చరిత్ర ఏంటో తెలీలేదు .   పూజారి గారిని అడిగితే  'అది అంతా వేరే చరిత్ర లేమ్మా !'  అన్నారు అంతే .. ఇంకేం చెప్పలేదు .  ఇక్కడ మా 'గైడ్' మాత్రం గుడిలో గర్భగుడి ముందు ప్రదేశం చూపించి ఇదే కత్తుల బావి .. ఇప్పుడు పూడ్చేశారు  .. అన్నాడు . ఇంకా ఏంటో చెప్పాడు .. రెడ్డిరాజులు .. అంటూ ఏదేదో చెప్పాడు ... ఒక్క ముక్క అర్ధం కాలేదు . గర్భగుడి ముందు బావి ఏమిటో  ... అందులో కత్తులు ఏమిటో  .. ఆ కథ ఏమిటో మరి !!!

ఇంక మళ్ళీ తిరిగి వెళ్ళే సమయమయింది .  దారిలో వెన్నదొంగ కి బయటినుంచే నమస్కారం చేసి .. ఇంటి దారి పట్టాము !!

No comments: