Wednesday, October 8, 2014

నవనీత బాలకృష్ణ

నవనీత బాలకృష్ణ (part 1)



18-9-2014

పొద్దున్న సమయం 5.45 అయింది .. కాఫీ కప్ పట్టుకుని బయటికి వచ్ఛాను . చిన్న వర్షం జల్లు పడుతోంది . ఆకాశం మందపాటి కంబళి కప్పుకున్నట్టుగా వుంది దట్టమయిన మేఘాలతో .. విజయవాడ వాతావరణానికి భిన్నంగా చల్లగా, ఆహ్లాదంగా ఉంది . అబ్బొ.. పెద్ద వర్షమే వచేట్టుందే అనుకున్నా.. 

మా పూర్వీకులు, అంటే, నాకూ , శ్రీవారికీ కూడా   తాతగారి తాతగారు అయిన, చిలకలూరిపేట జామిందారులు 
శ్రీ రాజబహద్దూర్ రాజామానూరి కృష్ణా రావు గారు గుంటూరు జిల్లా , కొండవీడు లో (విజయవాడ నుంచీ సుమారుగా 50km )  కట్టిన గుడి నవనీత బాలకృష్నుడి  గుడిని చూద్దామని నేనూ శ్రీవారు బయలుదేరాము. 
సరిగ్గా 6 గంటలకి బయలుదేరాము .  హైవే మీదకు వచ్చేసరికి చిన్నజల్లు కుండపోత గా మారింది .  స్నేహితులు  చెప్పిన గుర్తుల ప్రకారం దారి వెతుక్కుంటూ వెళ్తున్నాము .  హైవే దిగిన తర్వాత సన్నని దారి ...దారికి అటూ ఇటూ ఒకవైపు పంటపొలాలు , ఒకవైపు కొండలు , చేట్టుచేమలు చిట్టడవిలా ఉంది  పైన భోరున వర్షం .. అద్భుతంగా వుంది ప్రకృతి .. 

చివరికి అలా అలా మొత్తానికి గుడిని చేరాము . కారు దిగి గుడిలోపలికి వెళ్ళేలోపే మొత్తం తడిసిపోయాము .  కృష్ణుడే సహజ సిద్ధమయిన నీటితో మమ్మల్ని  శుద్ధి చేసినట్టు అనిపించింది .  మా ముత్తాతగారు కట్టించిన గుడి కి వచ్చాము అనుకునేసరికి చాలా ఆనందంగా , గర్వంతో ఒళ్ళు పులకరించింది . 

ఇంకా గర్భగుడి తలుపు తీయలేదు .  కరెంటు లేదు . కానీ invertor వుందని చెప్పాడు కుర్ర పూజారి !  మమ్మల్ని కూర్చోమని అతను లోపలికి వెళ్లి నిర్మాల్యమ్ తీయటం .అవన్నీ కానిచ్చి , అలంకరణ చేసి  తెర తీసాడు!! 
ఒహ్..  ఎదురుగా ముద్దులొలికె పసిబాలుడి మోహన రూపం లో వెన్నముద్ద కృష్ణుడు !! అత్యద్భుతమయిన ఆ రూపం చూసి విభ్రాంతి తో తనువు , మనసు కంపించింది .  ఒక చేతిలో వెన్నముద్ద, ఒక చెయ్యి వెన్న చట్టి మీద, కుడికాలు ముందుకి మడిచి, ఎడమకాలు వెనక్కి వుండి ..పారాడుతున్న భంగిమలో దాదాపు రెండడుగులు ఎత్తులో ఉన్న బాల కృష్ణుడిని అలా చూస్తూనె వుండిపోవాలనిపించింది .  దోగాడుతున్న రూపం లో వున్న ఇలాంటి విగ్రహం ప్రపంచం లో ఇంకెక్కడా లేదుట . అలాగే , స్వామివారి మెడలో పులిగోరు పతకం, ఉంగరాల జుట్టు, భుజాల మీద శంఖు చక్రాలతో వున్న రూపం మరెక్కడా లేదుట !! గర్భాలయానికి అటూ ఇటూ రాజ్యలక్ష్మి అమ్మవారు, వేణుగోపాల స్వామీ వున్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాతా స్వామివారి సుందర రూపాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుంటూ తిరుగుప్రయాణం అవుతూ ఆలయ చరిత్ర చెప్పమని అడిగాం పూజారిని . తనకి అంత బాగా తెలీదు , వాళ్ళ నాన్నగారిని అడగమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు . అక్కడికి ఇంకో 2km  దూరం లో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుడి, కత్తుల బావి వుంటాయి ..కానీ ఈ వర్షం లో వెళ్ళలేరు ..ప్రమాదమ్ అని చెప్పాడు ... చిన్న పూజారి . పునర్దర్శన  ప్రాప్తి రస్థు  అని దీవించి పంపించాడు . అతని దీవెన వూరికే పోతుందా!!! కృష్ణుడు మళ్ళీ రప్పించుకున్నాడు  తన దగ్గరికి.. ఆదివారం నాడు !!

        

తిరుగుప్రయాణం మర్చిపోలేని .. ఉద్వేగభరిత అనుభవాన్ని ఇచ్చింది !! కుండపోతగా కురుస్తున్న వర్షానికి , కొండల మీదనుండి పడే వర్షం నీరు జలపాతాలని తలపించింది .  కింద పొలాలూ , వాగులూ, పంట కాలువలూ అన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.  దారిలో రెండు అనుకుంటా causeway లు వున్నాయి. ఒకటి ఎలాగో ధైర్యం చేసి దాటేసాం .  రెండోది మాత్రం కొంచెం భయపెట్టే రీతి లో ప్రవహిస్తోంది . దాటటం రిస్క్ అనిపించింది .  దాదాపు 45 నిమిషాలు అలాగే కూర్చున్నామ్ .  చుట్టూ ఎటు చూసినా కొండలు , పొలాలు , చిట్టడవి .. కనుల విందుగా ఆకుపచ్చని ప్రకృతి . పైనుంచి హోరు మని శబ్దం తో వాన ,  కింద ఉరుకులతో గలగలా ప్రవహిస్తున్న వాగులు ... అయినా... ఆ శబ్దం లోనే అందమయిన నిశ్శబ్దం !! ప్రకృతి జోల పాడుతున్నట్టుగా వుంది!! హ్మ్మ్ ...కానీ అలా ఎంతో సేపు ఉండలేము కదా!! చివరికి మన చోటికి చేరుకోక తప్పదు !! మధ్యలో రెండు మోటార్ సైకిల్ వాళ్ళు కొట్టుకు పోయినంత పని అయింది ..ఎవరొ కార్ నీటి మధ్యలో ఆగిపోయింది .  ఇంకా వుంటే ప్రవాహం ఇంకా ఎక్కువయ్యేలా వుందనిపించి డ్రైవర్ కార్ ని ధైర్యం చేసి నీటిలో ఉరికించాడు !! అంతా కృష్ణ లీల.. ఆయన దయ!! క్షేమం గా causeway దాటాము . 

మొత్తానికి హైవే ఎక్కాము . ఇంకా వర్షం పడుతోంది .. అయినా ఇక్కడ పడుతున్న  ఈ వర్షం అక్కడ పచ్చని ..సహజ సిద్ధమయిన ప్రకృతి మధ్యలో పడుతున్న వర్షమంత అందంగా లేదు !! నగర జీవితం లా పేలవం గా , artificial గా అనిపించింది !!  అయినా వున్న చోటు , పడే చోటుని బట్టి వర్షం మారుతుందా ??!! నా పిచ్చి కానీ ... !!

కొన్ని ఫోటోలు : 



సశేషం ... 

No comments: