Sunday, September 21, 2008

వాళ్లిద్దరూ..

నీ కోసం.. నీ రాక కోసం..నువ్వెప్పుడు వస్తావా అని..అసలు వస్తావా రావా..

అనుకుంటూ ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో లెక్కలేదు..

అసలు ఈ జన్మలో నిన్ను చూడగలనో లేదో..అనుకుంటూ..

క్షణమొక యుగం లా గడిచింది నాకు..

ఆ రోజు..పన్నీటి జల్లు లాంటి వార్తా..నువ్వొస్తున్నావని..

ఆనందానికి హద్దులు లేకపోవటమంటే ఏమిటో తెలిసింది..

సంతోషం తో ఏమి చెయ్యాలో తోచలేదు..ప్రతిక్షణం నీ గురించిన ఆలోచనలే..

నువ్వెలా  ఉం టావో..

అసలు నిన్ను చూడగానే నేను ఆ ఆనందాన్ని భరించగలనా?

మనిద్దరం గడపబోయే జీవితాన్ని తలుచుకుంటుంటే మనసు తేలిపోతోంది..దూదిపింజలా..

మరి కొన్ని రోజులలో రాబోయే నీకు స్వాగతం ఎలా చెప్పాలీ..

ముందు నన్ను నేను చక్కగా తయారు చేసుకోవాలి..

ఇల్లంతా శుభ్రంగా, అందంగా అలంకరించాలి..

చివరికి ఆ రోజు వచ్చింది..కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన రోజు..

నా జీవితం లో కొత్త అధ్యాయం మొదలైన రోజు..వచ్చేసింది..

మొదటిసారి నిన్ను చూసిన అపురూపమైన ఆ క్షణాన్ని వర్ణించాలంటే

ప్రపంచంలోని ఏ భాషా సరిపోదేమో..మొదటిసారి నీ స్పర్శ..ఓహ్..ఒళ్ళు ఝల్లుమంది..

ఇంక మనిద్దరం ఒకటే..నువ్వు నాకే సొంతం..

ఇద్దరం ఎన్నో కబుర్లు..ఎన్నో ఊసులు..ఇన్నిరొజులూ దాచుకున్న మాటలన్నీ చెప్పుకుంటూ..

రోజులు ఎంత వేగంగా దోర్లిపోతున్నాయో ఇద్దరికీ తెలీలేదు..

ఆ రోజు..నా జీవితం లో ఇంకోరోజు..ఆ రోజు..తెలిసింది..అతను కూడా వస్తున్నాడని తెలిసింది..

అనుకోని అతిథి..నాకెంతో సంతోషం..కానీ నువ్వు? నీకేలా చెప్పాలి? నువ్వు అర్ధం చేసుకోగలవా?

ఎన్నో ఆలోచనలు..ఓ పక్క ఆనందం..ఓ పక్క నీకేమని చెప్పాలనే సంశయం..చివరికి చెప్పేశాను..నీకు.

నువ్వు విని ఊరుకున్నావు..అతనొస్తున్నాడని కోపమా..ఏమో తెలీదు..ఎలా ఉంటాడని అడిగావు.

నీలానే వుంటాడు అన్నాను. నువ్వు ఏమీ మాట్లాడలేదు. అతనొస్తున్నాడు అంటే నమ్మట్లేదేమో నువ్వు..

రోజురోజుకీ నాలో మార్పు..నీకు నచ్చలేదేమో..నువ్వు నాకు దూరమవుతున్న భావన..అతనొచ్చినా నాకు నీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదని చెప్పాలనిపించింది..కానీ నువ్వర్ధం చేసుకుంటావో లేదో..

అతనొచ్చే రోజు వచ్చింది..అతనొచ్చేశాడు..నా జీవితం లో ఇంకొక అపురూపమైన వ్యక్తీ..మధురక్షణాలు..

నువ్వొచ్చావు..అతన్ని చూశావు..ఆసక్తిగా..ఇంతకుముందులా నా దగ్గరికి రాలేదు..చాలా బాధనిపించింది..కానీ నాకు నేను సర్ది చెప్పుకున్నాను..నువ్వు అలా ప్రవర్తించడం సహజమేమో.. అసూయ..

నాకు నవ్వొచింది..నెమ్మదిగా నువ్వు అర్ధం చేసుకుంటావు లే అనుకున్నాను..నేను అనుకున్నది నిజమే అయింది..మీరు ఇద్దరూ దగ్గరయ్యారు..మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ..నేనంటే మీ ఇద్దరికీ ప్రాణం..

నేను చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది..మీ ఇద్దరినీ చూస్తె.. కానీ ఎప్పుడన్నా మీ ఇద్దరూ పోట్లాడుకుంటే బాధగా అనిపిస్తుంది..కానీ అది సహజమే కదా అనుకుంటూ వుంటాను..
ఆ రోజు నా పుట్టినరోజు..మీ ఇద్దరూ కలిసి నా కోసం ఓ గ్రీటింగ్ కార్డు తయారు చేశారు..
మీ చిట్టి చిట్టి చేతులతో..మా ప్రియమైన అమ్మకి అంటూ..
ఎంతో అద్భుతంగా..అందంగా వుంది మీరు చేసిన కార్డు..మీ చిన్ని బుర్రల్లో నా మీద మీ ప్రేమ..ప్రపంచాన్ని జయించినట్లు గొప్ప భావం..నాలో..
అమ్మతనం..భగవంతుడు ఆడవాళ్ళకి మాత్రమె ఇచ్చిన అపురూపమయిన వరం అనిపిస్తుంది.
అందరిలోనూ తన పిల్లలని చూడగలిగిన మాతృ హృదయాలకు శతకోటి వందనములు..
శౌరీ ..నా పెద్ద కొడుకు..తొమ్మిదో తరగతి చదువుతున్నాడు..వాడే మా ఇంట్లో కంప్యూటర్ ఎక్స్పెర్ట్
నా బ్లాగ్ డిజైనర్ వాడే..మంచి మంచి బొమ్మలు అతికిస్తూ వుంటాడు..నా బ్లాగ్ లో..వాడికి బోల్డన్ని ముద్దులతో థాంక్స్ లు ..

ఇంక నా చిన్న కొడుకు ఎనిమిదో తరగతి..వాడో బాల గంధర్వుడని నా మాతృహృదయం ఫీల్ అయిపొతూ వుంటుంది..అదేనండీ..వాడు సంగీతం లో ఇప్పుడే అ, ఆ లు నేర్చుకుంటున్నాడు లెండి..నిజం చెప్పద్దూ..బానే పాడతాడు..వాడికి కుడా బోల్డన్ని ముద్దులు..లేకపోతె పాపం ఏడుస్తాడు..నీకు అన్న అంటేనే ఇష్టం అని..వీడూ ..కాదు..తమ్ముడంటేనే నీకు ఇష్టం అని వాడూ..మళ్ళీ కొట్టుకోవటం మొదలు..
ఇది అలానే సాగుతూ......నే ఉంటుంది...
అనుబంధాలకి అంతం వుండదు..
























Saturday, September 13, 2008

నువ్వే...


చిరుజల్లులా వచ్చావు..
ఏమైందో తెలిసే లోపు..
నన్ను పూర్తిగా తడిపేశావు..
నీ మాటల విరిజల్లులతో..
ఇంద్రచాపం లా వచ్చావు..
నాకు తెలియని రంగులెన్నో చూపించావు..
నా ప్రపంచాన్ని రంగులమయం చేశావు..

మల్లెపందిరి


మన స్నేహం

అందంగా అల్లుకున్న మల్లెపందిరి

ఎన్నడూ వాడిపోని

ఎక్కడా ఆగిపోని

మల్లెల మాలగా అల్లుతూనే వుందాం

మన స్నేహబంధాన్ని

ఎప్పటికీ..



నన్ను మళ్ళీ చిన్నపిల్ల గా మార్చేసిన నా లిటిల్ ఫ్రెండ్ గొపీ కి ..ప్రేమాశీస్సులతో ...

Tuesday, September 9, 2008

ఓ పిట్ట కథ


మా ఫ్లాట్స్ లో బోల్డన్ని పావురాళ్ళు కాపురం వుంటాయి. అవి బాల్కనీ లోకి వచ్చి అప్పుదప్పుదూ హడావిడి చేస్తుంటాయి. వాటిని చూడటం సరదాగా నే వున్నా ఒక్కోసారి అవి చేసే అల్లరి పనులకి.. అదేనండీ రెట్టలు వెయ్యటం అలాంటివి.. విసుగొస్తూ వుంటుంది. అలా మొన్నోరోజు ఏమయిందంటే ..
ఓ పిల్ల పావురం మా పిల్లల గది బాల్కనీ లోకి ఎలా వచ్చిందో వచ్చింది..గ్రిల్ కి సన్నటి మెష్ వున్నా కానీ..ఎక్కడో వున్నా చిన్న కన్నం లో నుండీ దూరిపోయింది. ..మరి చిన్నది కదా..సరే..వచ్చింది..బానేవుంది.. కానీ మళ్ళీ వచ్చిన దారి కాస్తా మర్చ్చిపోయింది ..పాపం..ఇంక దాని అవస్థా.. మా పిల్లల హడావుడి చూడాలీ.. నా చిన్న కొడుకు..పిల్లిని చుస్తే ఆమడ దూరం పారిపోతాడు.. వాడు పేద్ద మొనగాడిలా పావురాన్ని బయటికి పంపించటానికి , తన రూమ్ తలుపు వేసుకుని మరీ ట్రై చెయ్యటం మొదలు పెట్టాడు. అదేమో బాల్కనీ లోనే అలా ఎగురుతూ ...దాని బన్ధువులూ, అమ్మానాన్నలూ అన్దరూ బయట గ్రిల్ దగ్గర ఎగురుతూ.. దానికి ధైర్యం చెప్తున్నాయి.. వాటి భాషలో..
అయ్యో పిచ్చి తల్లీ ఎంత కష్టం వచ్చిందే నీకు ..
సరే , ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే..ఓ గొప్ప ఐడియా వచ్చింది నాకు..ఆహా..లక్ష్మీ..నీకెంత గొప్ప ఐడియా వచ్చిందీ..అని నన్ను నేనే భుజం తట్టుకుని.. పావురం వచ్చిన మెష్ గ్యాప్ ని కొంచెం పెద్దగా చేశాను..రావే చిట్టి తల్లీ అన్నాను..చాలా ఫీల్ అయిపొతూ..అప్పుడు అది నా వేపు మా ఇద్దరికీ అర్ధం కాని ఓ బ్లాంక్ లుక్కిచ్చింది...
దారి చూపించాను కదే.. రావే బాబూ అని బతిమాలాను..ఉహు.. రాదే..
కంగారులో దాని చిట్టి బుర్ర పనిచెయ్యటం మానేసిందేమో.. మనుషుల్లాగే..
ఇంక మా వల్ల కాదని, వాచ్మన్ రెడ్డి ని పిలిచాను..
యుద్ధం లోకి దిగే సైనికుడిలా ఓ పోజిచ్చి.. బాల్కనీ లోకి వెళ్ళాడు..అక్కడినుంచీ చూడాలి ..నిజంగా యుద్ధమే.. తనని ఏమి చేసేస్తాడో ఈ దుష్ట మానవుడు అని అది తెగ కంగారు పడిపోయి అటు ఇటు ఎగరటం మొదలెట్టింది..చిక్కకుండా..అయ్యో నా పిచ్చి తల్లీ నిన్ను వదిలెయ్యటం కోసమే పట్టుకున్తున్నామే అని చెప్పాలనిపించింది.. ప్చ్.. లాంగ్వేజ్ ప్రాబ్లం..ఏమి చేస్తాం..
సరే చివరికి ఎలాగోలా పట్టుకుని పెద్ద హీరో లా పోజిచాడు ..రెడ్డి..
హమ్మయ్య అనుకున్నాం అందరం..కానీ పావురం కళ్ళల్లో మాత్రం ఇంకా భయం..ఈ మనుషులు తననేమీ చేస్తారో అని. దాన్ని అలానే పట్టుకుని బయటకు తీసుకు వచ్చి వదిలేసాడు..అదేమో హాయిగా స్వేచా వాయువులు పేల్చుకున్తూ ఎగిరింది...హాయిగా..దాని నేస్తాలన్దరూ చుట్టూ చేరి దాన్ని పరామర్సించటం చూస్తుంటేమనుషులూ, జన్తువులూ, పక్షులూ.. అందరికీ బన్ధాలూ,.. అనుబన్ధాలూ..మమకారాలూ..అభిమానాలూ..ఒకటేనేమో...ఎవరికీ అయినా...
అదండీ , పిట్టకధ.. ఇంత ఓపికగా చదివినందుకు ...ధన్యవాదములు..

Monday, September 8, 2008

ముద్దబంతి...తెలుగింటి ముంగిట


ముద్దబన్తులూ, పారిజాతాలూ.. ఇలా కొన్ని పువ్వుల పేర్లు వింటుంటే అవి తెలుగు వాళ్ళకే సొంత మైన పువ్వుల్లా అనిపిస్తుంటాయి..ఇప్పుడే పుట్టిన నా బ్లాగ్ కి పేరేమి పెట్టాలా అని ఆలోచిస్తుంటే..ఎందుకో నాకు ముద్దబంతి గుర్తొచింది.. ముద్దబంతి లో వున్న బోల్డన్ని రేకుల్లాగానే నాలొనూ ఎన్నో వూహలూ.. మరెన్నో భావాలూ..
నా తోటలో ..అదేనండీ..నా బ్లాగ్ లో గులాబిలూ, దాలియాల హడావిడి వుండకపోవచ్చు.. అప్పుదప్పుదూ గడ్డిపూలు కూడా వుండచ్చు.. కానీ ప్లాస్టిక్ పువ్వులు మాత్రం వుండవని చెప్పగలను..
నా తోటలోకి అన్దరూ రావాలనీ.. పారిజాతాల పరిమళాన్ని ఆస్వాదిన్చాలనీ aఅశిస్తూ..
ఈ చల్లని లోగిలిలో.. ఈ బంగారు కోవెలలో..ఆనందం నిండాలీ..
వచ్చే పోయే అతిథులతో ఈ వాకిలి కళకళ లాడాలీ...