Thursday, February 16, 2023

కోణార్క..నా ఆలోచనలు




కోణార్క..ఏదో ఇలా వెళ్లి అలా పైపైన చూసి వచ్చేసే  ప్రదేశం కాదు ఇది. . తక్కువలో తక్కువ, కనీసం పొద్దున్నే వెళ్లి సాయంత్రం  వరకు అక్కడ గడపగలిగితే ఓ మాదిరిగా కవర్ చేయచ్చు. ఆ శిల్పకళని ఆద్యంతం ఆస్వాదించాలంటే మాత్రం 2, 3 రోజులు పడుతుంది. కోణార్క వెళ్ళటానికి భుబనేశ్వర్ నుంచీ కంటే పూరీ నుంచీ  వెళ్ళే ప్రయాణం బంగాళాఖాతం పక్కనుండీ  ఆహ్లాదంగా సాగుతుంది . కోణార్క చూడటానికి నవంబర్, డిసెంబర్, జనవరి నెలలు అనువుగా ఉంటాయి.

కోణార్క సూర్యదేవాలయాన్ని చూడగానే నాకు కలిగిన మొదటి అనుభూతి సంభ్రమం. ఎంతో ఘనంగా, అద్భుతంగా, అందంగా, ఠీవిగా నిలబడి, రథం ఆకారంలో కట్టబడిన  సూర్యభగవానుడి  ఆలయం చూడగానే మాటలు రాక, అలా కళ్ళప్పగించి చూసే ఒక అచేతనావస్థ లోకి వెళ్లిపోయినట్టు అనిపించింది. 

అక్కడ గడిపిన 6, 7 గంటల్లో వీలైనంత వరకూ అంతా కవర్ చేశాము. అందమైన ఆ శిల్పకళని మాటల్లో వర్ణించటం అసాధ్యం. మనిషి జీవితంలో వచ్చే దశలు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యాలనూ, ఇంకా  రోజువారీ  చేసే పనులూ, వృత్తులూ ఇలాంటివన్నీ ఆ శిల్పాలలో చూడచ్చు.
 దేవుళ్ళూ, దేవతలూ,  పిల్లలూ, యువతీ యువకులు, రాజులూ, రాణులూ, వారి పరిచారకులు, జంతువులూ,  ఏవో నిఘాడార్ధాలు ఉన్న శిల్పాలు..ఇలా ఒకటేమిటి సమస్త ప్రపంచాన్నీ కోణార్క శిల్పాలలో పొందుపరిచారు. 

. కోణార్క గుడిలో మూల విగ్రహం లేక ఆ ప్రదేశం బోసిగా కనిపిస్తూ ఉంటుంది. పూరీ క్షేత్రం లో మనం చూసే సూర్యనారాయణుని విగ్రహం కోణార్క సూర్యదేవాలయానికి చెందిన మూల విగ్రహం అని చెప్తారు

సూర్యుడి రథాకారంలో ఉండే
కోణార్క ఆలయానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టినవి రథచక్రాలు. ఇవి 12 జతలు అంటే 24 చక్రాలు ఉంటాయి. ఆ రథ చక్రాల మీద పడే ఎండని బట్టి ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవచ్చు. గైడ్ ని పెట్టుకుంటే వివరంగా అన్నీ చెప్తారు. ప్రతీ చక్రం చాలా విలక్షణమైన, నిగూఢమైన, సునిశితమైన, సంక్లిష్టమైన చిన్న చిన్న శిల్పాలతో దేనికదే ప్రత్యేకం గా ఉంటుంది. అబ్బురపరిచే ఆ శిల్పుల చాతుర్యానికి, విజ్ఞానానికి తలవంచి నమస్కరించటం తప్ప ఏమీ చేయలేము. 

ఇంకో విశేషం ఏమంటే కొన్ని చక్రాల మీద  మనిషి ఉదయం నుంచీ రాత్రి వరకూచేసే పనులు ఓ వరుసలో చెక్కబడి ఉన్నాయి. 

ఇంక, ఈ కోణార్క ఆలయం శృంగార శిల్పాలకు కూడా పేరు పొందింది.  ఋషుల కాలం నుంచీ కూడా మనవాళ్ళు శృంగారాన్ని  పవిత్రకార్యంగా భావించేవారు అనటానికి ఇదో ఉదాహరణ. .  మన పూర్వీకులు ప్రతీ పనిని దైవంతో ముడిపెట్టి నట్టే శృంగారాన్ని కూడా  సత్సంతానం, తద్వారా వంశాభివృద్ధికోసం చేసే ఒక యజ్ఞంలాగా భావించేవారు. కోణార్క ఆలయం లో ఎన్నోరకాలైన శృంగార భంగిమలని అత్యంత రమణీయంగా చెక్కారు.


ప్రపంచంలో మరెక్కడా దొరకని, అనితర సాధ్యమైన ఇంత అపురూపమైన శిల్పసంపదని సృష్టించి, మనకు వెలలేని వారసత్వ సంపదగా అందించారు ఆనాటి మహారాజులు, శిల్పులు. మన దేశంలో ఉన్న ఇలాంటి అనేక అద్భుతమైన, అమూల్యమైన శిల్పసంపదను కాపాడుకుంటూ మన భావి తరాలు కూడా వాటిని చూసి ఆనందించేలా చేయటమే మనం చేయాల్సింది.

వందే మాతరం..జై హింద్.