Wednesday, January 4, 2012

జీవితం ఒలికిపోయింది

పొగమంచులా నెమ్మదిగా కమ్ముకున్న దూరం..
ఎప్పటికీ కరగని, దేనితోనూ పగలని మంచుగోడగా మిగిలింది..

నివురుకప్పిన నిప్పులా మనసులో ఉప్పొంగుతున్న లావా..

ఎంత తడిపినా చిగురించని తోట..రాలిపోతున్న ఎండుటాకుల్లాంటి ఆశలు..

అందమయిన చిత్రం వేద్దామనుకున్న కాగితం మీద ఒలికి పోయిన రంగులు..
అంతా రంగులమయమే..కానీ భావం లేని బొమ్మ మిగిలింది..జీవితం ఒలికిపోయింది..

చీకటిలో దీపం కోసం తడుములాట..అసలు దీపం వుంటే వెతుకులాటేందుకు..

దాహం కోసం వెళ్తే ఎండమావి మిగిల్చిన కన్నీళ్లు..

అందమయిన కొలను అనుకుంటే..బురద నిండిన ఊబి..
లోపలకు కూరుకుపోతూ కూడా నీటి కోసం అన్వేషణ..

పొదరిల్లుగా భ్రమపడిన సాలెగూడు..బయటకు రాలేక కృశించి..అందులోనే నశించి..

అలసిపోయి ఆగిన ప్రయాణం..ఏదో చల్లటి స్పర్శ..అనిర్వచనీయం ఆ సాంత్వన ..

ఏదో అర్ధమయిన భావన..దైవ నామ స్మరణ..

నీడలా వెన్నంటి వచ్చేది..అదే ప్రేరణ..అదే సాంత్వన..అదే పరమార్ధం..అదే నిత్య సత్యం..