Saturday, October 25, 2008

నీలో నేను

నీ మెలకువలో సుప్రభాతాన్ని..
నీ సంతోషం లో చిరునవ్వుని..
అలసిన నీ మనసుకి చల్లని స్పర్శని..
నీ ఆకలికి అమ్మని..
వాలిన నీ కనులలో నిద్రని..
నీ కమ్మని కలని..

Wednesday, October 22, 2008

అంతా కలేనా..?

'మహీ..ఏయ్ మహేష్' ఇలియానా అరిచిన అరుపుకీ, గట్టిగా అంటించిన చురకకీ మహేష్ బాబు అదిరిపడి నిద్రలేచాడు.
'పెళ్ళికి ముందు ఎలా వుండేదీ..ఇప్పుడు రాక్షసిలా తయారయింది'
పైకి అనే ధైర్యం లేక, మనసులోనే గొణుక్కున్నాడు, మహేష్ బాబు.
'నువ్వు అనుకునేది ఏంటో నాకు తెలుసులే కానీ..పెళ్ళికి ముందు పోకిరి వేషాలు వేసినట్టు ఇప్పుడేస్తే కుదరదు..రోజు మన నాని గాడి కోసం స్కూల్ చూడటానికి వెళ్తున్నాం ..గుర్తుందా అసలు నీకు?' వురిమింది ఇలియానా.
ఎందుకు లేదు తల్లీ..నాలుగు రోజుల నుండీ మనకు అదే పని కదా..ఒక్క స్కూలూ నచ్చదు నీకు..మళ్ళీ మహేష్బాబు స్వగతం..
'అది కాదే ఇలీ.. రోజు ఏదో ఒక స్కూల్ సెటిల్ చేసేద్దాం..వాడింకా ఒకటో క్లాస్సే కదే.. స్కూల్ అయితే ఏంటీ..' భయపడుతూనే అన్నాడు.
'ఏంటీ..వాడిని ఏదో ఒక స్కూల్ లో జాయిన్ చెయ్యాలా..ఏదో చెత్త స్కూల్ లో చదివిస్తే వాడు రేపు టి అవ్వాలంటే
ఎలా అవుతాడు..వాడు టి చదవాలనే నా కోరిక ఎలా తీరుతుంది..?' మళ్ళీ వురుము..
'మన కలలూ, కోరికలూ వాడి మీద ఎందుకే రుద్దటం.. టి ఒక్కటే వుందా చదవటానికి..వాడికి ఏది ఇష్టమో అదేచదువుతాడు..' మాటలన్నీ పైకి అంటే ఏమవుతుందో తెలుసు కాబట్టి , ధైర్యం చేయలేదు మహేష్ బాబు.
"విద్యా నిలయం" పేరు చక్కగా వుంది..హడావిడి లేకుండా..స్కూల్ పేరు చూడగానే అనుకున్నాడు. ఇలియానా పెదవివిరిచింది..
స్కూల్ లోపలికి వెళ్ళగానే పిల్లలందరూ యూనిఫాం లో ముచ్చటగా కనిపించారు..కానీ ఏదో తేడా కనిపించిందిఇద్దరికీ..పరీక్షగా చూసారు పిల్లలని..
మామూలుగా పిల్లల మెడలు బిగించేసి, బంధించేసినట్టుగా వుండే టై లేదు..ఇంకా ..చిట్టి చిట్టి పాదాలకి గాలితగలకుండా మూసేసే షూస్ లేవు..మంచి చెప్పులు వేసుకుని హాయిగా కనిపించారు పిల్లలందరూ..
మహేష్ బాబు కి పిల్లల ని అలా చూడగానే ఎంతో ఆనందం గా అనిపించింది..
'ఇదేమీ స్కూల్ బాబూ..' ఇలియానా పెదవి విరుపు..
ఇద్దరూ ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్ళారు. తెల్లటి చీరలో, చిరునవ్వు తో పిల్లలని వుద్ధరించటానికి వచ్చిన దేవతలా , ప్రశాంతం గా కనిపించింది..ప్రిన్సిపాల్ ..మహేష్ బాబుకి .
ఇలియానా వెంటనే టై, షూస్ గురించి అడిగేసింది..ఆగలేక..
ప్రిన్సిపాల్ చిరునవ్వుతో చెప్పింది..'మన దేశపు వాతావరణానికి అవన్నీ నప్పవు..పిల్లలని ఎందుకు ఇబ్బంది పెట్టటంవాటితో..అందుకే మేము అవన్నీ వద్దనుకున్నాము.'
సిలబస్, పరీక్షలూ, మార్కులూ, టీచర్లూ వగైరా గురించి అడిగాడు మహేష్ బాబు..
ఇలియానా కి అప్పటికే స్కూల్ మీద ఆసక్తి పోవటం తో ఏమీ మాట్లాడ లేదు..
ప్రిన్సిపాల్ , మహేష్ బాబు అడిగిన వాటికి సమాధానం చెప్పటం మొదలు పెట్టింది..
ప్రస్తుతం మా స్కూల్ లో ఐదోక్లాసు వరకే వుంది కాబట్టి, సిలబస్ మేము మా స్వంతంగా, వయసు పిల్లలకి ఆసక్తికలిగేలా, అర్ధమయ్యే సులభమైన పద్ధతిలో తయారు చేసుకున్నాము.
ఇంటర్ వరకూ చదువుకుని , ఆర్ధిక స్తోమత లేక చదువు ఆపేసిన వాళ్ళని టీచర్లు గా పెట్టుకుంటాము. వాళ్ళకి మేముప్రత్యేకంగా, మా పద్ధతులూ, విధానాలకు తగినట్లు బోధించేందుకు శిక్షణ ఇస్తాము.
ఇంక పరీక్షలూ, మార్కులూ..అసలు మేము పిల్లలకి పరీక్షలే పెట్టముఇంక మార్కుల ప్రసక్తే లేదు ..
ఒక లెసన్ చెప్పిన తర్వాత, అందులో వున్నవిషయం , పిల్లలు వాళ్ళకి వాళ్ళే అర్ధం అయ్యేలా, వాళ్ల చేతే , వాళ్ళకిఅర్ధం ఐనది, అలానే చెప్పమంటాము..దాదాపు అందరూ చక్కగా చెప్తారు,,వాళ్ల మాటలలో. చెప్పలేని వాళ్ళకి, చెప్పగలిగిన పిల్లల చేతే మళ్ళీ చెప్పిస్తాము. దానివలన పిల్లలందరికీ కూడా విషయం బాగా గుర్తుండిపోతుంది..పధ్ధతి వలన పిల్లల్లో సొంతగా ఆలోచించే శక్తి, విశ్లేషించి చూడటం అలవాతవుతాయి అని మా నమ్మకం. హోం వర్క్కూడా రోజుకి రెండు సబ్జక్ట్స్ నుండీ మాత్రమె ఇస్తాము. రోజు చెప్పిన పాఠం , వాళ్ళకి అర్ధం ఐనమాటల్లో రాయమనిప్రోత్సహిస్తాము.
వారం లో నాలుగు రోజులు
ఆటల పీరియడ్ తప్పనిసరి..ఎవరికీ ఇష్టం ఐన ఆట వాళ్లు నేర్చుకోవచ్చు. వారం లో ఒకరోజు తోట పని పీరియడ్ వుంటుంది. పిల్లల చేత విత్తనాలు నాటించటం, మొక్కలకి నీళ్లు పోయటం నేర్పిస్తాము. పిల్లలకిప్రక్రుతి ని పరిచయం చేయటం కోసం.
ఇంక అన్నిటికంటే ముఖ్యం ఐన రోజు, ప్రతి శనివారం రెగ్యులర్ క్లాసెస్జరగవు. రోజు ని పిల్లలకి మానవ సంబంధాలు, మానవతా విలువలు ..ఇలాంటి విషయాలు చెప్పటానికి..అదీ వాళ్ళకి అర్ధమయ్యేలా , పిల్లల చేతే చిన్న చిన్ననాటకాలు వేయించటం ద్వారా , వాళ్ళకి విసుగు లేకుండా, ఆసక్తి కలిగేలా చెప్తాము..
ప్రతి శనివారం , వృద్ధ ఆశ్రమం నుండీ ఓపికా, ఆసక్తి ఉన్న పెద్దవాళ్ళు వచ్చి పిల్లల చేత ఇలా నాటకాలు వేయించటం, కధలు చెప్పటం చేస్తారు. న్యూక్లియర్ ఫామిలీస్ పెరిగిపోతున్న రోజుల్లో ఇలా చేయటం వలన పిల్లల్లో పంచుకోటం, శ్రద్ధ, గౌరవించటం, ఒంటరి భావన లేకుండా వుండటం..ఇవన్నీ నేర్చుకుంటారని మా నమ్మకం..
మహేష్ బాబు కి అన్నిటి కంటే కాన్సెప్ట్ చాలా నచ్చింది..
నానిగాడిని ఎలా ఐనా స్కూల్ లోనే చేర్పించాలని ఉత్చ్చాహ పడిపోయాడు..
ఇలియానా ప్రమాదాన్ని పసిగట్టింది..మహేష్ బాబుని మోచేత్తో పొడిచింది..చాల్లే, నీ ఆవేశం అనుకుంటూ..
మహేష్ బాబు బిక్కు బిక్కు మంటూ చూశాడు ఇలియానా వంక..అర్ధం ఐపోయింది ..ఇలీ కి అస్సలు నచ్చ లేదుస్కూల్..
చేసేది లేక, ప్రిన్సిపాల్ వైపు చూసి వెర్రి నవ్వు నవ్వి, మళ్ళీ వస్తామని చెప్పాడు.
ప్రిన్సిపాల్ కి విషయం అర్ధం అయింది..తమ దగ్గరికి వచ్చే
పేరెంట్స్ తొంభయ్ తొమ్మిది శాతం ఇలాంటివాళ్ళే..నవ్వుకుంది..తమ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళే చేరుతారు..నెమ్మది మీద ఐనా తమ స్కూల్ గురించితెలుస్తుంది..అందరికీ..
మహేష్ బాబు, ఇలీ బయటకి వచ్చారు..
స్కూల్ లో చదివితే మనవాడు తోటమాలో, నాటకాలు ఆదేవాడో అవ్వటం ఖాయం..మూతి తిప్పింది ఇలియానా.
"దేముడా.." తల పట్టుకున్నాడు మహేష్ బాబు..

"ఓయ్ , మహీ, లే ఇంక..స్కూల్ కి వెళ్ళాలనుకున్నాం కదా..నానిగాడి ని మంచి స్కూల్ లో వెయ్యాలి మహీ రోజుఐనా..మంచి స్కూల్ దొరికితే బాగుండు..నీకసలు పట్టదా ఏమీ..లే నువ్వసలు..." మహేష్ బాబుని ఒక్కటిచుకుందిఇలియానా..
వులిక్కిపడి లేచాడు మహేష్ బాబు..
"ఇదంతా కలేనా!!!!!!!!!!!!!" అని తెగ ఆశ్చర్య పోయాడు..

Sunday, October 19, 2008

ఎత్తిపోతల జలపాతం



జలపాతం జోల పాడుతుండగా నిద్ర లోకి జారుకోవాలనే నా కోరిక వచ్చేసారి తీరుతుందేమో చూడాలి!!

Friday, October 17, 2008

కోరిక తీరిన ఆనందం



జలపాతం లో తడవాలనే చిన్నప్పటి కోరిక ఇప్పటికి తీరింది..ఎంతసేపు తడిసినా తనివితీరని ఆనందం..ఎంత సంతోషం అంటే..అసలు ఏ భావమూ లేని వింత అనుభవం..

Wednesday, October 15, 2008

తెలుగు సామెతలు

మొన్న ఓ పుస్తకం చదివాను. అన్నీ సామెతలే అందులో..అందులో నుండి కొన్ని..
అదును చూసి పొదల్లో చల్లినా పండుతుంది
అపనింద అవతలికి పోతే, నింద వచ్చి నెత్తిమీద పడ్డది.
అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు.
అరవై ఏండ్లు నిండిన వాణ్ని ఆలోచన అడక్కు, ఇరవై నిండని వాడికి పెత్తనమీయకు.

అవివేకితో చెలిమి కంటే వివేకితో విరోధం మేలు.
ఆశ్లేష వాన అరికాలు తడవదు.
ఎద్దు ఎండకు లాగితే , దున్న నీడకు లాగిందట.
ఓడ ఎక్కేదాకా ఓడమల్లయ్య, దిగగానే బోడిమల్లయ్య.

కంచి లో దొంగిలించేదానికి కాళహస్తి నుంచీ వంగిపోయినట్లు.
కర్ణునితో భారతం సరి, కార్తీకం తో వానలు సరి.
కలిగిన వారింటికి కడపటి కోడలయ్యే కంటే , పేదవారి ఇంట పెద్ద కోడలయ్యేది మేలు.
గడ్డం కాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పిమ్మని వెంట పడ్డాడుట.

చిత్త చిత్తగించి , స్వాతి చల్ల చేసి , విశాఖ లో విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అంటుంది భూదేవి.
బాలల తుమ్ము, బాలింత తుమ్ము మంచివి.
భోజనానికి ముందూ, స్నానానికి వెనుకా వుండాలి.
మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా వుంటుందా.
మహారాజా వారని మనవి చేసుకుంటే మరి రెండు వడ్డిన్చమన్నాడట.

వచిపోతూ వుంటే బాంధవ్యం, ఇచ్చి పుచ్చుకుంటే వ్యవహారం.
సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు.

Sunday, October 12, 2008

మా ఇంటి బొమ్మల కొలువు .......


మా పుట్టింట్లో సంక్రాంతి కి బొమ్మల కొలువు పెట్టేవాళ్లము. అత్తవారింట్లో దసరా కి పెట్టటం ఆనవాయితీ..
యేడాది ఎందుకో వుత్శాహం అనిపించలేదు. అందుకే ఈసారి పెద్ద హడావిడి చెయ్యలేదు..ఏదో శాస్త్రానికి పెట్టినట్టు
పెట్టాను.
మొన్న రెండు రోజులు నాగార్జున సాగర్ వెళ్లి వచ్చాము... విశేషాలు తరువాతి టపాలో..కంప్యూటర్
తెఱ పైన త్వరలో
విడుదల..

Monday, October 6, 2008

నీ స్పర్శ...


మనిద్దరం ఒకటి కాబోతున్నామనే ఆనందాతిశయంతో నా చేయి అందుకున్న నీ చేతి మొదటి స్పర్శ..
ఇంక ఇద్దరమూ ఒక్కటిగా వుందామంటూ జీలకర్రా బెల్లం తో ఒట్టు పెట్టిన స్పర్శ...
కన్యాదానం అందుకుని..పాణిగ్రహణం చేసిన స్పర్శ..
మంగళసూత్రం తో మెడ ఫై నీ ముని వేళ్ళ స్పర్శ..
తలంబ్రాల వేడుకలో ఆడుకున్న చేతుల స్పర్శ..
అగ్నిసాక్షిగా ప్రదక్షిణలో నీ చిటికెన వేలి స్పర్శ..
మట్టెలు
తొడుగుతూ నా పాదాలు తాకిన గిలిగింతల నీ స్పర్శ..
బిందెలో వుంగరం తీస్తూ అల్లరి చేసిన స్పర్శ..
అరుంధతి ని చూపిన స్పర్శ..

అప్పగింతలలో నీకు నేనున్నాననే భరోసా స్పర్శ..
నా సంతోషాలని పంచుకున్న స్పర్శ..
కృషి లో వెన్నుతట్టిన స్పర్శ..
దుఖం లో ఓదార్చిన, ధైర్యం చెప్పిన నిండు స్పర్శ..
నా ఆత్మను తాకిన నీ అనురాగపు స్పర్శ..
పద్ధెనిమిది వసంతాలుగా సాగుతున్న మన ప్రేమ ప్రయాణం లో
నా ప్రాణం గా మారిన నీ స్పర్శ..
అది నా శ్వాస ...