కళ్లెదురుగా తల్లిదండ్రులు లేవలేని స్థితిని చూస్తూ, ఆ భావోద్వేగపు భారాన్ని పంచుకునే అన్న/తమ్ముడు/అక్క/చెల్లి లేక మానసికంగా, శారీరకంగా అలసిపోతున్నప్పుడు
తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో
అమ్మా నాన్నలిద్దరూ దూరమై
వారికి నువ్వొక్కటే సంతానమైనప్పుడు
తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో
ఏమ్మా/ఏరా.. కులాసానా.. తిన్నావా..ఏంచేస్తున్నావు అంటూ ఆత్మీయంగా కుశలమడిగే తోబుట్టులు లేనప్పుడు
తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో
ఏ భేషజాలూ, ఎలాంటి అహాలూ
లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడే తోబుట్టులు లేనప్పుడు
తెలుస్తుంది.. ఒంటరితనమేమిటో
ఎలాంటి సంకోచాలూ లేకుండా
ఉబుసుపోని పిచ్చాపాటి కబుర్లు, పరాచికాలాడటానికి తోబుట్టులు లేనప్పుడు
తెలుస్తుంది..ఒంటరితనమేమిటో
'మా తర్వాత నువ్వు ఎలా' అన్న
అమ్మ బెంగ లోని అంతరార్ధం
అర్ధం ఐనప్పుడు
తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో
'అమ్మ అలా కోప్పడేది, నాన్న ఇలా ముద్దు చేసేవారు..అమ్మ ఆ వంట ఎంత బాగా చేసేదో.. నాన్న ఎంత కష్టపడేవారో'.. తోబుట్టులు మాత్రమే ఎరిగిన అమ్మానాన్నల తో ముడిపడిన జ్ఞాపకాలను పంచుకోడానికి ఎవరూ లేనప్పుడు
తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో
చిన్నతనపు చేష్టలు, ఆటలు, అమ్మానాన్నలతో గడిపిన క్షణాలు
తలచుకోవడానికి, మరచిపోయినవి గుర్తు చేసేవారు ఎవరూ లేనప్పుడు,
ఆ జ్ఞాపకాలన్నీ నీలోనే అణిచిపెట్టుకుంటున్నప్పుడు
తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో
తోబుట్టులు మాత్రమే కలిసి పంచుకోగల అమ్మానాన్నల ఎడబాటు భారపు తీవ్రతని పంచుకునేందుకు ఎవరూ లేనప్పుడు
తెలుస్తుంది..ఒంటరితనమేమిటో
నీలోని లోటుపాట్లని ఎత్తి చూపకుండా
నిష్కల్మషంగా మాట్లాడి, సలహాలిచ్చే
తోబుట్టులు లేనప్పుడు
తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో
కడుపున పుట్టినవారు తప్ప
నీకంటూ ప్రత్యక్ష రక్త సంబంధం ఇంకెవరూ లేనప్పుడు,
నీకంటూ అండ, దన్ను లేనప్పుడు
తెలుస్తుంది..నువ్వెంత ఒంటరివో
( ఒంటరితనానికి చాలా కారణాలు ఉండచ్చు. అందులో ఇదొకటి. భావోద్వేగాల పరంగా అందరూ రకరకాలుగా ఉండచ్చు. జీవిత భాగస్వామి, పిల్లలు ఎంత emotional support ఇచ్చినా, తల్లిదండ్రులు దూరమైన ఆ emotional burden తోబుట్టులు మాత్రమే పంచుకోగలరు. చుట్టాల, స్నేహితుల సహకారం ఎంత ఉన్నా అది కొంతవరకే.)
1 comment:
Excellent...very well said.. I understand
Post a Comment