Saturday, October 4, 2025

అమ్మ

2018 లో మొదటిసారిగా ఎందుకో బతుకమ్మని పెట్టాలనిపించింది.  కొన్నేళ్ల నుంచీ హైదరాబాద్ లో ఉంటున్నా ఎప్పుడూ అలా అనిపించలేదు.  బహుశా నా చెయ్యి పట్టుకుని, రాబోయే పరిస్థితులకు నన్ను సిద్ధం చెయ్యడానికి వచ్చిందేమో ఆ అమ్మ!  అందుకేనేమో హైదరాబాద్ నుంచీ వైజాగ్ కి మారినా నా వెన్నంటే వచ్చింది.  కన్నవాళ్ళు దూరమైన దుఃఖం ప్రతి నిమిషం నిశ్శబ్దంగా కడుపులో మెలిపెడుతుంటే, మాటి మాటికీ ఉబికి వచ్చే కన్నీటిని, ఆ వేదనని, శోకాన్ని పంచుకొనే  తోబుట్టువయింది బతుకమ్మ.  వెళ్లినపని పూర్తి అయినట్టు మళ్ళీ హైదరాబాద్ కి తీసుకొచ్చింది.


అమ్మ దూరమై మూడు నెలలే అవడంతో,  ఈసారి బొమ్మలు పెట్టడానికి మనస్కరించలేదు ముందు.  కానీ  అమ్మకి ఇష్టమైన బొమ్మలకొలువు పెట్టి, కొలువు పెట్టడంలో మెళకువలు నేర్పించిన తనని తలుచుకోవడమే సరైన పని అనిపించింది. నేను బొమ్మలకొలువు పెట్టినప్పుడు, అందరితో కలిసి బతుకమ్మ ఆడేటప్పుడు తన కళ్ళల్లో కనిపించే ఆ తృప్తి, సంతోషాలని తలుచుకోవడం, తన జ్ఞాపకాలని, వేడుకలను కొనసాగించడమే తనకి నేను ఇచ్చే నివాళి!


Sunday, February 16, 2025

Emblems

ఆత్మీయుల మరణం తర్వాత వారు వాడిన వస్తువులలో వారిని తలచుకోవడం ఒక అసంకల్పిత చర్య.  వారు  భోజనం  చేసిన పళ్లెం కావచ్చు, కాఫీ తాగిన గ్లాస్ కావచ్చు, పాటలు, వార్తలు విన్న రేడియో కావచ్చు, రోజూ కూర్చున్న కుర్చీ, వాడిన బట్టలూ ..ఇలా ఏదైనా..
మొదట్లో కొంతకాలం వాటిని చూసినప్పుడల్లా కడుపులో సుళ్ళు తిరుగుతూ మొదలైన దుఃఖం ఉప్పెనలా కళ్లలో నుంచి దుముకుతూ ఉంటుంది.  కాలం గడుస్తున్న కొద్దీ కంటనీరు చెలమల్లాగా ఊరుతూ ఉంటుంది.  ఏదీ శాశ్వతం కాదని తెలిసినా జ్ఞాపకాలలో, వారికి చెందిన వస్తువులలో వారు బ్రతికే ఉన్నట్టు మనసు భ్రమిస్తూనే ఉంటుంది..ప్రియంగా వారిని తలుచుకుంటూనే ఉంటుంది.

ఫిలిప్స్ కంపెనీ కి చెందిన ఈ సైకిల్ మా నాన్నగారు 1950ల్లో కొన్నారుట.  తన చివరి వరకూ చాలా అపురూపంగా చూసుకునే వారు.  తనకి 88, 89 వయసు వరకూ కూడా అప్పుడప్పుడు సరదాగా తొక్కేవారు.  ఎప్పటికప్పుడు తుడవడం, గాలి కొట్టించడం చేసేవారు.  సైకిల్ బిగుసుకు పోకుండా ఉండటానికి వాచ్ మాన్ ని తొక్కమనేవారు.  

ఇప్పటికీ మంచి condition లో ఉంది కానీ తొక్కేవారు ఎవరూ లేరు.  Show piece లాగా తయారు చేద్దామని Cycle మీద ఉన్న company emblems పోకుండా వాటిని ముందు కవర్ చేసి, మొత్తం నల్ల రంగు వేయించాను.  నెట్ లో చూసిన ఐడియా తో చేయించి, బాల్కనీ లో పెట్టాను.

Sunday, February 2, 2025

అదే తత్త్వం

సత్త్వమా.. తత్త్వమా

వితండవాదమే తత్త్వవాదం

తత్త్వాన్వేషణ ని మించిపోయిన రంధ్రాన్వేషణ

పొంతన లేని చింతనలే అన్నీ