Thursday, August 9, 2018

దృష్టికోణం

అతను 1 డైరీ :

ముంబై నుంచీ హైద్రాబాద్ వెళ్లాల్సిన విమానం ముప్పావుగంట ఆలస్యంగా రాత్రి 11.45 కి రన్ వే మీదకి వచ్చింది. చిరాగ్గా వచ్చి నా సీట్ లో కూర్చున్నాను. నా వెనకాలే పక్క సీట్ అతను కూడా వచ్చి కూర్చున్నాడు. జేబులోంచి సెల్ తీసి వందోసారి వాట్సాప్ చూసి విసుగొచ్చి సెల్ ఆఫ్ చేశాను. విమానం టేకాఫ్ అయి గాల్లోకి లేచింది. పక్క సీట్ అతను తన సెల్ లో ఏదో చూస్తున్నాడు..చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. యధాలాపంగా నా దృష్టి అతని సెల్ పైన పడింది. ఏవో వీడియోలు చూస్తున్నాడు. పేరుని బట్టి అవి పాకిస్తానీ వీడియోలు అని తెలుస్తోంది.  చూపు పక్కకి తిప్పుకున్నాను. ఓ 5 నిమిషాల తర్వాత కుతూహలం ఆపుకోలేక మళ్లీ చూశాను..ఆధ్యాత్మిక సంబంధమైన ప్రసంగాల వీడియో వస్తోంది. ఈసారి మనసులో ఏదో గుబులు మొదలయింది. ఆ మధ్య చూసిన సినిమాలు, అందులో విమానం హైజాకింగ్ సన్నివేశాలు గుర్తొచ్చాయి. సీట్లో ఇబ్బందిగా కదిలాను. నేను అతని ఫోన్లోకి చూడటం గమనించినట్టున్నాడు..వెంటనే ఆ వీడియో మార్చేసి హనుమాన్ కామిక్ సిరీస్ పెట్టాడు. ఎందుకలా మార్చాడు? తన విషయం తెలిసిపోయిందనా? ఏవేవో అనుమానాలు..రెండు నిమిషాలు గడిచాయి. అతను సెల్ మూసేసి నా వైపు చూసి నవ్వాడు. నేనూ నవ్వాను తిరిగి. అతనెందుకు నవ్వాడో నాకు తెలుసు..నేనెందుకు నవ్వానో అతనికి తెలుసు. తన పేరు చెప్పి పరిచయం చేసుకుంటూ చెయ్యి చాపాడు..నేనూ నా పేరు చెప్పి అతని చేయి అందుకున్నాను. విమానం దిగేదాకా ఇద్దరం మా చదువులు, కెరీర్ గురించి మాట్లాడుకున్నాం.
ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు..మొదట్లో అతడిని తను ఒక విధంగా ఊహించుకోటం గుర్తొచ్చి నవ్వొచ్చింది. మన దృష్టికోణం, మన మనసులు తెలీకుండానే ఎలా ట్యూన్ చేయబడుతున్నాయో,  తలుచుకుంటే ఆశ్చర్యంగా, విచారంగా అనిపించింది.
విమానం లేట్ అయినా తనకో స్నేహితుడు దొరికాడు.

అతను 2 డైరీ

ముంబై నుంచీ హైద్రాబాద్ వెళ్లాల్సిన విమానం ముప్పావుగంట ఆలస్యంగా రాత్రి 11.45 కి రన్ వే మీదకి వచ్చింది.  నా సీట్ నెంబర్ వెతుక్కుంటూ వచ్చి కూర్చున్నాను. అప్పటికే పక్క సీట్ అతను కూర్చుని ఉన్నాడు. విమానం టేకాఫ్ అయిన తర్వాత సెల్ తీసి నాకిష్టమైన కామెడీ వీడియోలు చూడ్డం మొదలు పెట్టాను. ఇంతలో పొద్దున్న అమ్మి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి..రంజాన్ మాసం..ఎంత బిజీ గా ఉన్నా రెండు నిమిషాలు భగవంతుడిని స్మరించుకోమని చెప్పింది. అబ్బాజాన్ ఫార్వర్డ్ చేసిన పెద్దల ప్రసంగాలు వింటున్నాను. ఎవరో నన్ను గమనిస్తున్నట్టు అనిపించి కళ్ళ చివర్ల నుంచీ చూశాను..పక్క సీట్ అతను నా సెల్ చూస్తున్నట్టు అర్ధమయింది. ఏదో ఇబ్బందిగా అనిపించింది. తను ఇవి చూస్తున్నందుకు తన గురించి ఏమయినా వేరే విధంగా  అనుకుంటాడా..అసలే ఇందాక తను చూసిన కామెడీ వీడియోలు కూడా పాకిస్థానీవి..వెంటనే ఆ వీడియో మార్చి హనుమాన్ కామిక్ సిరీస్ పెట్టాను..అయినా సమాధానంగా అనిపించలేదు. అతను చూడటం తను గమనించి మార్చేశాననుకుంటాడేమో..! సెల్ మూసేసి అతని వైపు చూసి నవ్వాను. అతనూ తిరిగి నవ్వాడు ఏదో అర్ధమయినట్టు. ఇద్దరికీ ఏదో అర్ధమయి మనస్ఫూర్తిగా నవ్వుకున్నాం. నాపేరు చెప్పి చెయ్యి చాపాను. అతనూ తనని పరిచయం చేసుకుని చేయి కలిపాడు. విమానం దిగేదాకా ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకున్నాం.
ఇంటికి వెళ్తూంటే ఏవేవో ఆలోచనలు..'నా  గురించి అతను వేరే విధంగా ఊహించుకుంటున్నాడేమో' అని తను అనుకోటం గుర్తొచ్చింది. మన దృష్టికోణం, మన మనసులు తెలీకుండానే ఎలా ట్యూన్ చేయబడుతున్నాయో అని ఆశ్చర్యంగా, విచారంగా అనిపించింది. ఏమయినా తనకో స్నేహితుడు దొరికాడు.
                        ******

కొత్త స్నేహం మొలక వేసింది.

"దృష్టికోణం", ప్రతిలిపిలో చదవండి: https://telugu.pratilipi.com/story/7rlc76doTngP?utm_source=android&utm_campaign=content_share ప్రతిలిపిలో మరెన్నో కథలు, కవితలు, వ్యాసాలను ఉచితంగా చదవండి

1 comment:

G V S N Reddy said...

Madam....so muddabanthi + prathilipi. Mee posts ee rendu vatillo chadavochhu anna matandi...DRUSTIKONAM bavundi andi